సావిత్రి సదా స్మరామి!

తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతోమంది కథా నాయికలు వచ్చారు… వెళ్ళారు. లెక్కలేనన్ని విజయాలు, భారీ పారితోషికాలు అందుకున్నారు. నెంబర్ వన్ అనిపించుకున్న వాళ్ళు వున్నారు. కానీ ఒక్కరి కి మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. కనీసం ఆమె స్థానానికి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేక పోయారు. ఆ ఏకైక కధానాయిక ఎవరో కాదు…. సావిత్రి. కథా నాయిక స్థానాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళిన నటి సావిత్రి. అభినయం అంటే ఎలా వుండాలి అనే ప్రశ్న తలెత్తిన ప్రతీఒక్కసారి సావిత్రిని గుర్తు తెచ్చుకోవలసిందే. అందుకే ఆమె ‘మహా నటి’ అయ్యింది. ‘మాయా బజార్’లో యన్టీఆర్, ఏయన్నార్, యస్వీఆర్ లాంటి దిగ్గజాలు వున్నా… వారితో పోటీ పడి నటించింది. ‘మాయా బజార్’ ఓ క్లాసిక్ గా నిలబడిందంటే అందులో సావిత్రి భాగస్వామ్యం కుడా వుంది. మరీ ముఖ్యంగా ‘అహనా పెళ్ళీ అంటా..’ పాటలో సావిత్రి అభినయం న భూతో… అని చెప్పలిందే. ‘మిస్సమ్మ’, ‘తోడి కోడళ్ళు’…. ఇలా ఎన్నని చెప్పమంటారు? ప్రతీ సినిమాలోనూ…. అందిన ప్రతీ పాత్రలోనూ ఆమె మార్క్ కనిపిస్తుంది.

‘మా అభిమాన నటి సావిత్రి’ అని ఈ తరం కధానాయికలూ గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఆమె దారిలో నడిచిన నాయిక ఒక్కరూ లేరు. అందాల ప్రదర్శనకు ఇచ్చిన శ్రద్ధ… అభినయం విషయంలో చూపించడం లేదు. కధానాయిక అంటే.. గ్లామర్ మాత్రమే అనుకుంటున్నారు. జయసుధ, జయప్రద, విజయ శాంతి, సౌందర్య వీళ్ళంతా అభినయ ప్రాధాన్య పాత్రలు పోషించారు. కానీ ఏ ఒక్కరూ సావిత్రి స్థానాన్ని చేరుకోలేకపోయారు. సినిమా అంటే వ్యాపారం అయిపొయింది. గ్లామర్ మేళవించక పొతే సినిమా ఎవరూ చూడరు అనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ దశలో సావిత్రి లాంటి కధానాయికను చూడాలనుకోవడం అత్యాశే. 2012లో సావిత్రి మళ్ళీ పుట్టినా… కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. అయితే.. కధానాయిక కేవలం షో కేసులో బొమ్మ కాదు… సినిమాలో ఆమె పాత్రకూ ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాన్ని ఈ తరం దర్శకులు పట్టించుకుంటే బాగుంటుంది.