63 ఏళ్ళు…63 రోజులు… 1000కిలోమీటర్లు

” వస్తున్నా…మీ కోసం ” పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలెట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల పాయింటు ను దాటింది. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి భరోసా ఇచ్చేందుకు గానూ తనే స్వయంగా ప్రజల మధ్యకు వెళ్ళాలనే సంకల్పంతో అక్టోబర్ 2 వతేదిన అనంతపురం జిల్లా హిందూపూర్ లో బాబు తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఈ రోజుకు ( డిసెంబర్ 3 ) నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గం లోని పెంటాఖుర్డూ గ్రామం దగ్గరకు చేరుకునే సమయానికి 1002.8 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ రోజు యాత్ర ముగిసే సమయానికి ఈ మైలురాయి 1015.8 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఇప్పటివరకు ఈ యాత్రలో 5 జిల్లాల్లోని 26 నియోజకవర్గాలు, 52 మండలాలు, 8 మునిసిపాలిటీలు , షుమారు 430 గ్రామాలను చంద్రబాబు కవర్ చేసారు. యాత్ర మొదలయి సోమవారం నాటికి 63 రోజులు పూర్తయింది…ఈ యాత్రా క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎక్కడా తొణక్కుండా బాబు కొనసాగుతున్నారు. మధ్యలో ఒక చోట స్టేజ్ కూలిపోవటం వలనా, తెలుగుదేశం పార్టి సీనియర్ నేత ఎర్రంనాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించటం వలనా యాత్రకు రెండు రోజులు అంతరాయం ఏర్పడింది . తన ఆరోగ్యం సహకరించకపోయినా పట్టుదలతో తన 63 ఏళ్ల వయసులో చంద్రబాబు ఈ యాత్రను కొనసాగించటం పట్ల పలువురు ఆయనను అభినందిస్తున్నారు.

చంద్రబాబు తన యాత్ర ఆసాంతం గత ధోరణికి భిన్నంగా ప్రజలతో మమేకం కావటం విశేషం. కాలినడకన వెళుతూ దారిపొడవునా సామాన్య ప్రజల ముంగిళ్ళ లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు…వారికి భరోసా ఇచ్చారు. కేవలం సామాన్య ప్రజలనే కాక రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారు,మహిళలు, మైనారిటీలు, యువత….ఇలా తారతమ్యం లేకుండా అన్ని వర్గాల వారిని కలిసి వారితో మమేకం అయేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలిస్తోందనే చెప్పాలి. ఆయన పాదయాత్రలో పాల్గొనేందుకు, సభల్లో ఆయన ప్రసంగాలు వినేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలి రావటం తో అన్ని పార్టీల దృష్టి తెలుగుదేశం పై పడింది. సీమ జిల్లాల్లో మాత్రమే కాకుండా తెలంగాణా జిల్లాల్లో కూడా చంద్రబాబు కు జనం బ్రహ్మరధం
పట్టడం టి.ఆర్.ఎస్. లాంటి పార్టీలకు మింగుడు పడటం లేదు. తెలంగాణా జిల్లాలో అడుగుపెట్టిన మొదటిరోజు మెహబూబ్ నగర్ లో బాబు యాత్రకు తెలంగాణా వాదుల నుంచి చిన్నపాటి ప్రతిఘటన ఎదురయినా ఆ తరువాత చంద్రబాబు యాత్ర నిరాటంకంగానే సాగుతోంది. ఆరోగ్యపరంగా ప్రస్తుతం బాబు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఆయన షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నాయనీ, కొద్దిరోజులు యాత్రకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకున్న అనంతరం యాత్రను కొనసాగించమని డాక్టర్లు ఇచ్చిన సలాహాలను సైతం చంద్రబాబు ఖాతరు చేయటం లేదు. కాగా ఈ యాత్ర పుణ్యమా అని నారా, నందమూరి కుటుంబాల
మధ్యన వున్న విభేదాలు సమసిపోయాయన్న అభిప్రాయాన్ని ఆ రెండు కుటుంబాలు ప్రజలకు తెలిసేట్టు చేసారు. పాదయాత్ర ఆరంభాన్ని ఎన్.టి.ఆర్.తనయుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్వయంగా పర్యవేక్షించటం, మధ్యలో బాలకృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్. లు బాబు ను కలిసి తమ నైతిక మద్దతును తెలియజేయటం సహజంగానే తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రానున్న ఎన్నికలలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి శాసన సభకు పోటి చేస్తానని బాలయ్య ప్రకటించటం, ఎన్నికలలో తాను ముమ్మరంగా పర్యటించి ప్రచారం చేసి తెలుగుదేశం విజయానికి కృషి చేస్తానని జూనియర్ ప్రకటించటం తో పార్టి వర్గాల్లో ఉత్తేజకారకమైంది.

పాదయాత్రలో బిజీగా ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ పార్టి ని సమన్వయ పరచుకుంటూ పాలిట్ బ్యూరో సమావేశాలు, లెజిస్లేచర్ పార్టి మీటింగులు, పార్టీ విస్త్రుత స్థాయి సమావేశాలు నిర్వహించటం లాంటివి చంద్రబాబు రాజకీయ పరిపక్వతకు, ప్రణాళికకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన యాత్రలో ఒకపక్క ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే మరో వంక కాంగ్రెస్ , వైఎస్సార్సి , టి.ఆర్.ఎస్.పార్టీల పైన చంద్రబాబు వాడిగా వేడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే క్రమేపి ఎన్నికల వేడిని రగిలించటం
గమనార్హం.