తప్పు వాతావరణశాఖదే : మంత్రి ఆనం

రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వాతావరణ శాఖ ముందుగా ‘నీలం’ తుఫాన్ ప్రభావం  గురించి సరైన హెచ్చరికలు జారీలేకపోవడం వల్లే రాష్ట్రంలో భారీ పంట నష్టం వాటిల్లిందని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరించి ఉంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలిగేవారమని ఆనం అన్నారు. మంత్రి ఆనం బుధవారం ఉదయం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ స్వర్ణ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చీరాల వచ్చిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని అడిగి నీలం తుఫాన్ వల్ల రాష్ట్రంలో సంభవించిన నష్టం వివరాలను తెలుసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పంట నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారన్నారు. సంబంధిత జిల్లాకలెక్టర్‌లను తాత్కాలిక చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. సిఎం రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారని, ఏరియల్ సర్వే కూడా చేయనున్నట్టు ఆనం తెలిపారు. ధర్మల్, గ్యాస్ కొరత వలన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం తగ్గిందన్నారు. అందువల్ల ఇతర ప్రాంతాలనుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చిందని, అయితే విద్యుత్ సరఫరా గ్రిడ్‌ల అనుసంధానం సక్రమంగా లేకపోవటంతో విద్యుత్ కొనుగోలులో అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు వనరులు సమృద్ధిగానే ఉన్నాయని, ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేదని చెప్పారు ఆనం.