ఉందిలే ‘బూతుల’ కాలం ముందు ముందునా…

మంచో, చెడో… బూతులే చూపించాడో, నీతులే చెప్పాడో…. పరిశ్రమలో దర్శకుడు మారుతి ఓ ట్రెండ్ సృష్టించాడు. ‘శంకరాభరణం’, ‘ఖైదీ’, ‘యమగోల’, ‘నువ్వే కావాలి’… ఇవన్నీ క్లాసికల్ ట్రెండ్ సెట్టర్స్. ఈ సినిమాలు సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని… ఎన్నో, ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే వున్నాయి. మారుతి సినిమా ‘బస్ స్టాప్’ కూడా ట్రెండ్ సెట్టరే. కాకపొతే…. అదో ‘బూతికల్ సెట్టర్’.

రూ. కోటీ 75 లక్షలు పెట్టుబడి …. దానికి పది రెట్లు లాభం తెచ్చే సినిమా తీసాడు. మారిపోయిన లెక్కల ప్రకారం డబ్బులు తెసుకొచ్చే సినిమా ‘హిట్’. కాబట్టి ‘బస్ స్టాప్’ సినిమా హిట్ అని ఒప్పుకుని తీరాల్సిందే. మారుతిని స్పూర్తిగా తీసుకుని మరిన్ని బూతు సినిమాలు ఇప్పుడు తయారీలో వున్నాయి. చూసిన వాళ్లకి…. చూసుకున్నంత! ‘బూతు కుడా ఒకరకమైన భావోద్వేగమే’ అని గొప్పగా చెప్పుకున్నాడు మారుతి.  అంటే… ఇలాంటి సినిమా తీసినందుకు కొత్త కారణాలు వెతుకుతున్నాడన్నమాట. ‘నడుం చూపించలేదు, ముద్దులు చూపించలేదు’ అని బాగానే లాజిక్కులు తీస్తున్నాడు గాని….. ఆ గీత కుడా తెలివిగా దాటేసిన విషయం ఒప్పుకోవడం లేదు. ‘కాసులు రాలిపోతున్నాయి… మనం తీసింది మంచి సినిమానే’ అనే లెక్కల్లో వున్నాడీ యువ దర్శకుడు. అంతేనా… ‘బస్ స్టాప్’ సినిమా చూసి అగ్ర నిర్మాతలు కుడా ముచ్చట పడిపోతున్నారు. గీతా ఆర్ట్స్ మారుతీ చేతిలో అడ్వాన్సు పెట్టేసి…. బుక్ చేసేసుకున్నారు.  పెద్ద సినిమాలకు, విలువలతో కూడిన వినోదానికి గీతా ఆర్ట్స్ పెట్టింది పేరు. అలాంటి సంస్థ… మారుతి చేతిలో సినిమా పెట్టిందంటే… కాస్త ఆలోచించాల్సిందే. గీతా ఆర్ట్స్ కోసమైనా మారుతి విలువలతో కూడిన సినిమా తీస్తాడా? లేదంటే తన రూట్లోనే వెళ్లి… వసూళ్ళ వేటే పరమావధిగా సినిమా తీస్తాడా? అనేది ఆసక్తికరమైన అంశం.
సెన్సార్ ని బోల్తా కొట్టించడం ఎలాగో… మారుతిని చూసే నేర్చుకోవాలి. ‘ఇందులో బూతు వుంది’ అని వేలెత్తి చూపించడానికి సెన్సార్ బోర్డు ఒక్క కారణం చూపిస్తే… ‘లేదు’ అని చెప్పడానికి మారుతి తన దగ్గర మూడు కారణాలు వుంచుకున్నాడు.  ఆ తెలివితేటలకు జోహార్లు అర్పించాల్సిందే. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కుడా ‘బస్ స్టాప్’ ఫార్ములానే అనుసరిస్తే… ఎక్కడ కట్ చెప్పాలో తెలీక సెన్సార్ జుట్టు పీక్కోవాలి. అసలు సెన్సార్ పని చేస్తోందా లేదా? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. ‘పెద్దలు కుడా సినిమాలు చూడాలి కదా? అందుకే ‘ఏ’ సర్టిఫికట్ ఇచ్చాం’ అని ఓ సెన్సార్ సభ్యురాలు ఘనంగా చెప్పారు. సినిమాకి వెళ్దాం అనుకున్న సగటు ప్రేక్షకుడు పోస్టర్, లేదంటే ట్రైలర్ చూసో వెళ్తాడు గానీ ఆ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారా? అని ఆరా తీయడు. ఒకవేళ పెద్దలకు నచ్చే సినిమాలనీ ప్రమోట్ చేయాలనే పెద్ద మనసు సెన్సార్ కి ఉందేమో. ఆ లెక్కన కొంత మంది పెద్దలకు ‘బ్లూ ఫిలిమ్స్’ ఇష్టం. అలాంటి సినిమాలని కుడా ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చేసి విడుదల చేయిస్తారా? ఈ ప్రశ్నకు సెన్సార్ దగ్గర సమాధానం ఉందా?
మొత్తానికి మారుతి సినిమా.. పరిశ్రమలో కొత్త ప్రశ్నలను లేవదీసింది. బూతు అనే పదానికి సరైన అర్ధం సెన్సార్ దగ్గర లేదు అనే విషయాన్ని తేటతెల్లం చేసింది. సృజన, వినోదం అనే మాటలకు మరో రూపంలో నిర్వచనం ఇచ్చింది. ఈ తాత్కాలిక ప్రయోజనాలకు ఈ తరం దర్శకులు లొంగిపోతారా? లేదంటే… స్వచమైన వినోదం అందివ్వడానికి మరో సారి కంకణం కట్టుకుంటారా అనేది రాబోయే సినిమాలే నిర్ణయిస్తాయి.