మూడోసారి సెన్సారు కు ‘ బస్ స్టాప్ ‘

ఆంధ్రప్రదేశ్ సెన్సార్ బోర్డు చరిత్రలో మొదటిసారిగా ఒక సినిమా మూడవసారి సెన్సార్ ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాతగా, ‘ ఈ రోజుల్లో ‘ చిత్ర దర్శకుడు మారుతి దర్సకత్వంలో రూపొందిన ‘ బస్ స్టాప్ ‘ చిత్రానికి ఈ పరిస్థితి ఎదురైంది. వచ్చే వారం విడుదలవుతుందని భావిస్తున్న ఈ సినిమాను తొలుత సెన్సార్ సభ్యులు చూసి షుమారు 50 కట్లను ప్రతిపాదించారు. అయితే అందుకు అంగీకరించని నిర్మాత రివైజింగ్ కమిటి కి తన సినిమా చూపించేందుకు సిద్ధమయ్యారు. ఆర్. సి. కూడా షుమారు 30 కట్లను ఇచ్చింది. దాంతో నిర్మాత డిల్లీ లోని ట్రిబ్యునల్ కు సినిమాను చూపించేందుకు సిద్ధమై ఆ మేరకు అప్ప్లై చేసుకున్నారు. ఈ దశలో సెన్సార్ బోర్డ్ సి.యి.ఓ. పంకజ్ రెండవసారి ఆర్.సి.కి చూపించాల్సింది గా నిర్మాతకు సూచించారు. నిర్మాత అందుకు అంగీకరించి గురువారం నాడు తన సినిమాను రెండవసారి రివైజింగ్ కమిటి కి చూపిస్తున్నారు. సినిమా చూసిన తరువాత ఆర్.సి.తీసుకునే నిర్ణయం మీద ఈ సినిమాలో ఎన్ని కట్లు ఉంటాయనేది తెలిసిపోతుంది. రెండవ ఆర్.సి.సూచన మేరకు కట్లు ఇచ్చి సినిమాను విడుదల చేస్తారా లేక ట్రిబ్యునల్ కు వెళతారా అన్నది గురువారం సాయంత్రానికి గాని తెలియదు. కాగా ఈ చిత్రం యావత్తూ అశ్లీల సంభాషణలతో నిండి పోయి వుందని, యదా తధంగా ఈ సినిమాను సెన్సార్ చేస్తే తెలుగు ప్రేక్షకులు సహించరని సెన్సార్ సభ్యుడొకరు అన్నారు.