రివ్యూ : డమరుకం

మోగీ మోగనట్టు మోగిన “ఢమరుకం”

  • తారాగణం : నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, రవిశంకర్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ తదితరులు
  • సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ 
  • ఛాయాగ్రహణం : చోటా కె.నాయుడు 
  • నిర్మాత : ఆర్. వెంకట్ 
  • దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి.

చిన్నపుడు చందమామ కథలు చదివారా? ఒక రాక్షసుడు రాకుమారిపై మనసు పడతాడు. ఆ రాకుమారిని బలి ఇస్తే సర్వ శక్తిమంతుడు అవుతాడని అతని నమ్మకం. అందుకే…ఆమెను ఎత్తుకుపోదామనుకొంటాడు. ఈలోగా…రాజకుమారుడు వచ్చి కాపాడుతాడు. అలా దుష్ట శిక్షణ జరుగుతుంది. ఇలాంటి కథలు ఎన్నో రూపాల్లో చదివుంటారు. అందులో ఒకటి దృశ్యరూపకంగా మన ముందుకు తీసుకొస్తే…అదే ‘ఢమరుకం’. వాయిదాలపై వాయిదాలు వేసుకొంటూ, ఎన్నో అరిష్టాలు దాటుకొంటూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి అంచనాలనూ అందుకొందా? లేకపోతే సాదా సీదాగా తీర్చిదిద్దారా? ‘ఢమరుకం’ బలాలూ, బలహీనతలేంటి? చిన్న చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్ది ఓ పెద్ద హీరోని ఎలా చూపించాడు? తదితర కథాకమామిషూ తెలియాలంటే రివ్యూలోకి వెళ్లిపోదాం రండి.

అనగనగా… కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవతలకూ, రాక్షసులకూ మధ్య యుద్ధం జరిగింది. రాక్షసులంతా చనిపోయారు. ఒక్క అంధకాసురుడు (బొమ్మాళీ రవిశంకర్) తప్ప. దేవతలను ఎలాగైనా నాశనం చేయాలని శపథం బూని… ఓ గుహలో కఠోర దీక్షలో ఉండిపోతాడు. పంచ గ్రహాలు ఒకే కక్ష్యలోకి వచ్చిన పుణ్య మూహూర్తాన ఓ అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయిని గనుక పెళ్లిచేసుకొని, ఆమెను బలిగా అర్పిస్తే… పంచభూతాలు తన ఆధినంలోకి వస్తాయి. అలాంటి శుభఘడియ కోసం ఎదురుచూస్తుంటాడు అంధకాసురుడు. ఆ అమ్మాయి మహేశ్వరి (అనుష్క). అంధకాసురుడు.. మహేశ్వరికి మధ్య ఒక్కడే అడ్డు. వాడే…మల్లి (నాగార్జున). చిన్నప్పటి నుంచీ శివ భక్తుడు. అయితే అంధకాసురుడి వల్ల కుటుంబాన్ని కోల్పోతాడు. అప్పటీ నుంచీ…శివుడిపై కోపం పెంచుకొంటాడు. సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడిన రోజున.. మహేశ్వరిని పెళ్లిచేసుకొని శక్తులు పొందాలనేది రాక్షసుడి కోరిక. మరి అది ఫలించిందా? దానికి మల్లి ఎలా అడ్దుపడ్డాడు? రాక్షసవథకు ఆ పరమశివుడు(ప్రకాష్ రాజ్) ఎలా సహకారం అందించాడు? అనేదే ‘ఢమరుకం’ కథ.

జానపద ఇతివృత్తానికి సంబంధించిన కథ ఇది. తెలుగు తెరపై ఇది వరకు చాలాసార్లు ఇలాంటి కథని వేరే విధంగా చూశాం. ఇప్పుడు వాటికి స్టార్ హంగు, గ్లామర్ కోటింగు వేశారు. మసాలా అద్దారు. మాస్ కి నచ్చేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఈరోజుల్లో చిన్నా చితకా సినిమాలకూ విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారు. గ్రాఫిక్స్ విశ్వరూపం చూపించే అవకాశం ఉన్న కథ ఇది. నిజంగానే ‘ఇండియన్ అవతార్’ లా తీర్చిదిద్దే సత్తా ఉంది. అందుకే…నాగార్జున ఈ సినిమాని అంగీకరించి ఉంటారు. ఇలాంటి కథల జయాపజయాలు విజువల్ ఎఫెక్ట్స్‌, దైవ భక్తి అనే ఫార్ములానీ సమర్థంగా వాడుకోవడాన్ని బట్టే ఆధారపడి ఉంటాయి. అక్కడ సక్సెస్ అయితే జాక్ పాట్ కొట్టినట్టే. అందుకు తగినట్టుగానే మొదటి పది నిమిషాల కథ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. అదో ‘అద్భుతానికి ఆరంభం’ అనిపిస్తుంది. కానీ క్రమంగా రొటీన్ సూత్రాల వైపుకు మళ్లడంతో….ఓ గొప్ప అవకాశాన్ని నీరుగార్చారు.

సినిమా కథంతా మొదటి సన్నివేశంలోనే చెప్పేశారు. దాంతో తరవాత ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగానే సన్నివేశాలు నడుస్తుంటాయి. దాంతో.. ఉత్సుకత తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. కథ అంతా చెప్పకుండా విడతల వారిగా రిలీజ్ చేస్తే… పతాక సన్నివేశాల వరకూ అదే టెంపో కొనసాగేది. హాలివుడ్ సినిమాలకూ మనకూ తేడా ఏమిటంటే… అక్కడ కథ ఏం చెబితే అదే చేస్తారు. ఇక్కడ కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ‘ఇన్ని సన్నివేశాల తరవాత పాట పడాల్సిందే’ అని కంకణం కట్టుకొంటారు. దాంతో… అసలు కథకు పాటలు అడ్డంకిగా వస్తుంటాయి. ‘ఢమరుకం’లోనూ అదే జరిగింది. దేవిశ్రీ ఉన్నాడు కదా…అని కావల్సినన్ని పాటలు చేయించుకొన్నారు. సినిమాలో ఎక్కడ జోడించాలో తెలియక…మధ్య మధ్యలో అతికించారు. ‘లాలి’ పాట ఆడియోలో వినిపిస్తుంది. తెరపై మాత్రం లేదు.

శివుడి పాత్రలో ప్రకాష్ రాజ్ ని చూడడం కష్టమే. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ని చూస్తే….’మహారాణి’లోని అతని వేషాధారణ గుర్తొస్తుంది. శివుడు భూమ్మీదకు రావడం వరకూ ఓకే! కానీ అలా వచ్చినందుకు కథకు ఒరిగిందేమిటి? కేవలం రుద్రాక్ష (బ్రహ్మానందం) పాత్రకు మాత్రమే కనిపించడానికి వచ్చాడా? ఇక బొమ్మాళీ రవిశంకర్ మరోసారి…భీకరమైన గొంతుతో విరుచుకుపడ్డాడు. అతని ఆహార్యం, సంభాషణలు బాగున్నాయి. అయితే “పాతాళభైరవిలో యస్వీఆర్ ని గుర్తుతెస్తాడు” అని సినిమా విడుదలకు ముందు నాగ్ చెప్పిన మాట మాత్రం విడ్డూరమే. పార్వతీ అంశగా అనుష్కను చూపించారు. ఆ పాత్రను వాడుకున్న విధానం కూడా సరిగా లేదు. ఇక శ్రీనివాస రెడ్ది కామెడీ పండించడంలో పట్టున్న దర్శకుడు. ఈ సినిమాలో అందులోనూ ఆయన విజయం సాధించలేదు. పేరున్న హాస్యనటులు కనిపించినా వారి దగ్గర నుంచి నవ్వులు పిండుకొన్నది స్వల్పమే. అసలే బ్రాహ్మణ సంఘాల నిరసన ఎక్కువైన ఈ నేపథ్యంలో….అందుకు ఆజ్యం పోసే సన్నివేశం ఈ సినిమాలో ఒకటి ఉంది. పూజారి వేషంలో ఉన్న బ్రహ్మానందాన్ని కొట్టడం. ఈ సన్నివేశాన్ని బ్రాహ్మణులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. నాగ్ ప్రతీ సంభాషణనీ ఒకేలా పలికారు. డ్యాన్సుల్లో… డిటో. ఇంకా కుర్రాడిలా కనిపించాలనే తాపత్రయం నచ్చింది. సిక్స్ ప్యాక్ లో, అఘోరా అవతారంలో… ఇలా బహురూప దర్శనం ఇచ్చారు. మిగిలిన నట బృందం ఫర్వాలేదు. ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకులు లాజిక్‌ లు పట్టించుకోరు. అయితే… విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని మాత్రం ఆశిస్తారు. ఆ విభాగంలో చిత్రబృందం చాలానే కష్టపడింది. అయితే హాలీవుడ్ మార్క్ చేరుకోవడంలో మనమింకా వేల కిలోమీటర్లు వెనకబడ్డాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసం రూ. 9 కోట్లు ఖర్చుపెట్టారట. అయితే.. ఆ స్థాయి కనిపించలేదు. కొన్ని చోట్ల యానిమేషన్ కు ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ కు తక్కువ స్థాయిలో ఉన్నాయి. సాంకేతిక విభాగంలో చోటా కెమెరా పనితనానికి పేరు పెట్టలేం. దేవిశ్రీ పాటల్లో రెండు వినడానికీ, చూడ్డానికీ బాగున్నాయి. ఆర్.ఆర్ లో మాత్రం విజృంభించాడు. కథలో ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో చూపించాలి అనుకోవడం మంచిదే. అయితే…దాని వెనుక పటిష్టమైన కథను ఎంచుకోవాలనే చిన్న విషయాన్ని చిత్రబృందం మర్చిపోయింది. అది కూడా ఉండుంటే…’ఢమరుకం’ రేంజ్ వేరుగా ఉండేది.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3.5/5                                                       – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

డమరుకం లైవ్‌ అప్ డేట్స్‌ : 

  • ఎంతోకాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన నాగార్జున “ఢమరుకం” సినిమా రిలీజ్‌ అయింది. మరి కాసేపట్లో తెరలపై ఢమరుకం మోగనుంది. అయినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల సినిమా రిలీజ్‌ నిజమా.. కాదా  అన్న అనుమానాలు కొనసాగుతూనే ఉన్నట్టు సమాచారం. అయినప్పటికీ థియేటర్స్‌ మొత్తం నాగార్జున అభిమానులతో కోలాహలంగా మారిపోయాయి.
  • సినిమా మొదలైపోయింది. అంధకాసురుడు అనే రాక్షసుడి కథతో సినిమా ప్రారంభం. ఓంకారం గొప్పదనం వివరించిన తీరు అద్భుతం. మంచి ఫిక్షన్‌ సినిమా ఫీల్‌ తెప్పించగలిగారు.
  • పంచగ్రహాలు ఒకే కక్ష్యలో కలిసిన ముహూర్తంలో అనుష్క జననం. జీవా గెటప్‌ భయంకరంగా ఉంది. మొత్తమ్మీద ఇన్ని రోజులుగా వింటూ వచ్చిన గ్రాఫిక్స్‌ మాయాజాలం తెరపై మొదలైంది.
  • అంధకాసురుడి గెటప్‌ లో రవిశంకర్‌ నట విశ్వరూపం చూపిస్తున్నాడు. నాగార్జున చిన్నప్పటి నుండే శివభక్తుడిగా ఉండే మల్లిఖార్జున గా తెరపై అలరిస్తున్నాడు.
  • అంధకాసురుడి  వల్ల  చిన్నతనంలోనే కుటుంబాన్ని కోల్పోయి మల్లిఖార్జున చిన్నతనంలోనే శివుడిపై ద్వేషం పెంచుకున్నాడు. సంప్రదాయబద్ధమైన గెటప్‌ లో అనుష్క అందంగా ఉంది.
  • శివాలయంలో చోరీ… టాక్సీడ్రైవర్‌ గా నాగ్‌ ఎంట్రీ… గోదావరి యాసలో “హలోబ్రదర్‌” రోజులు గుర్తు చేస్తోన్న నాగార్జున…
  • అదిరిపోయే  ఫస్ట్‌ ఫైట్‌ … అయిపోయిన వెంటనె సక్కు భాయ్‌ పాటతో ఛార్మీ ఎంట్రీ.. మాంఛి గరం గరం సాంగ్‌…
  • మహేశ్వరి(అనుష్క)ని చూసి నాగ్‌ మనసు పారేసుకున్నాడు. బ్రహ్మి, కృష్ణభగవాన్‌, రఘుబాబు, ఎమ్మెస్‌.. కామెడి గ్యాంగ్‌ ఎంట్రీ ఇచ్చుకుంది. థియేటర్లో నవ్వుల పువ్వులు షురూ… శ్రీనివాస రెడ్డి తన్‌ సిగ్నేచర్‌ కామెడీ రుచి చూపించాడు.
  • నాగార్జున డ్రెస్సింగ్‌ అదిరింది. సిస్టర్‌ సెంటిమెంట్‌, శివుడితో నాగ్‌ గొడవ దృశ్యాలు మెప్పిస్తాయి.
  • శివుడి పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌… ఊహించని స్వీట్‌ సర్‌ ప్రైజ్‌. పాత్రలో ప్రకాశ్‌ ఒదిగిపోయాడు. హ్యాట్సాఫ్‌ టూ డైరెక్టర్‌…
  • రెండవ ఫైట్‌ సీన్‌… బ్రహ్మి తెచ్చిన రౌడీల్ని చితగ్గొడుతున్న నాగ్‌.. బ్రహ్మానందానికి శివదర్శనం…
  • నాగార్జున, అనుష్క మొత్తానికి ఫ్రెండ్స్‌ అయిపోయారోచ్‌.. ఆటోమేటిగ్గా పాటేస్కోవాలిగా! అదే కన్‌యాకుమారీ పాట. మాస్‌ కి బాగా నచ్చే పాట ఇది. సెట్స్‌ కూడా బాగా ఉన్నాయి.
  • మహేశ్వరిపై వేలమంది అఘోరాల దాడి… కాపాడిన నాగార్జున…
  • ఇంటర్వెల్‌
  • ఇంటర్వెల్‌ తరువాత ‘నేస్తమా నేస్తమా’ మెలోడీ పాట మొదలైంది. సాంగ్ ని షూట్ చేసిన ప్రదేశాలు భలే ఉన్నాయి. 
  • నాగార్జున కాశీ పయనం. అనుష్కపై అఘోరాల దాడి వెనుక రహస్యాన్ని చేధించిన నాగ్‌. 
  • నాగ్‌, అనుష్కల మధ్య ప్రణయం… కథలో మలుపులు మొదలు… కిక్‌ శ్యాంలో రాక్షసుడి ఆత్మ ప్రవేశం… 
  • రెప్పలపై పాట చాలా బాగుంది. సింపుల్‌ స్టెప్స్‌ తో కనులకు విందులా అనిపించింది. స్వీటీ అనుష్క గ్లామర్‌ మెయిన్‌ ఆకర్షణ అని చెప్పాలి. 
  • రంగు రాళ్ళపై సటైర్లతో కృష్ణభగవాన్‌ అండ్‌ టీం కామెడీ ట్రాక్‌ మరోసారి నవ్వులు పూయించింది.
  •  ఆపదలో ఉన్న హీరోని కాపాడడానికి నందీశ్వరుడు రంగంలోకి దిగాడు. మంచీ చెడుల సమరం నేపథ్యంలో గ్రాఫిక్స్‌ మాయాజాల విశ్వరూపంతో క్షణక్షణం ఆసక్తిగా మారిపోయింది.
  • అంధకాసురుడి విజృంభణ… కథ మెల్లగా క్లైమాక్స్‌ వైపుకు పయనిస్తోంది. 
  • అఘోరాల శివపూజ నేపథ్యంలో “శివ శవ శంకర” పాట దేవిశ్రీ ప్రసాద్‌ కు ఓ చెప్పుకోదగ్గ పాటలా నిలిచిపోవడం గ్యారెంటీ….  చోటా కె నాయుడు కెమెరా పనితనం కూడా సూపర్బ్‌. 
పూర్తి వివరాలతో కూడిన కంప్లీట్‌ రివ్యూ మరి కొన్ని నిమిషాల్లో మీ ముందుంటుంది… 

Click here for English Version 

 

డమరుకం కాదు…’ఢ’మరుకం

damarukam-

శాసనసభలో తీర్మానాల మాదిరిగానే వాయిదాలపై వాయిదాలు పడుతూ చిట్టచివరికి 23న విడుదల తేది ఖరారు చేసుకొంది ‘డమరుకం’. సారీ…ఈ సినిమాని ఇప్పుడు ‘ఢమరుకం’ అని పిలవాలి. సంఖ్యాశాస్త్రం ప్రకారం ‘డమరుకం’ అచ్చురాలేదని ‘డ’ని..’ఢ’గా మార్చారు. పేరు మార్చితే ఫలితమో, శివుడే కరుణించాడో మొత్తమ్మీద ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

ఓ అగ్రకథానాయకుడి సినిమా ఇన్ని రోజులుగా ఊరిస్తూ, విడుదల తేదీ మార్చుకొంటూ రావడం ఈ మధ్యకాలంలో లేదు. నిర్మాణ రంగంలోనూ అపార అనుభవం ఉన్న నాగ్ కి ఇలాంటి స్థితి రావడం తొలిసారి. దాసరి నారాయణరావు లాంటి పెద్దల సహకారంతో ‘డమరుకం’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణలు, ప్రధాన అంశాలు ఓసారి పరిశీలిస్తే…
• అమిష్ రచించిన ‘మెలూహా’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఆధునిక అంశాలు మేళవించిన శివపురాణంగా ఈ నవల ఖ్యాతి నార్జించింది. ‘డమరుకం’ కూడా శివుడి కథే కావడం తో ‘మెలూహా’ ప్రభావం ఈ సినిమాపై ఉందని తెలుస్తోంది. అయితే…నాగార్జున ఈ వాదనకు ఖండిస్తున్నారు.. ఆ నవలకూ ఈ సినిమాకీ సంబంధం లేదని చెబుతున్నారు. “ఆ నవల నేను చదివా. రెండూ వేర్వేరు కథలు” అని నాగ్ చెప్పారు. నిజానిజాలేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
• నాగ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ ఈ సినిమాకే కేటాయించారు. రూ. 45కోట్ల బడ్జెట్ తో ఈ సినిమ తెరకెక్కిందని ఓ అంచనా.
• ‘అవతార్’, ‘యుగాంతం’ సినిమాల స్థాయిలో గ్రాఫిక్స్ మాయాజాలం ఉంటుందని నాగార్జున చెబుతున్నారు. దాదాపు 45నిమిషాల విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. ‘మగధీర’ తరవాత బ్లూమ్యాట్ లో ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించింది ఈ సినిమాకే.
• కేవలం గ్రాఫిక్స్ కోసం తొమ్మిది నెలలు కేటాయించారు. తెలుగు సినిమాల్లో అదో రికార్డు.
• ఓ అగ్ర కథానాయకుడి సినిమాకి దర్శకత్వం వహించడం శ్రీనివాసరెడ్డికి ఇదే తొలిసారి. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న కథ, భారీ బడ్జెట్, పెద్ద హీరో ఈ మూడింటినీ ఆయన ఎలా డీల్ చేశాడో అనే ఆసక్తి నెలకొంది.
• దేవిశ్రీ ప్రసాద్ – నాగార్జున కలయికలో వచ్చిన సినిమాలన్నీ సంగీతపరంగా, వసూళ్ల పరంగా హిట్టే. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి కొనసాగే అవకాశాలున్నాయి. ‘సక్కుబాయ్’ పాట ఇప్పటికే హోరు పుట్టిస్తోంది. ‘కోయిలా కోయిలా’లాంటి మెలోడీలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేవిశ్రీకి ఇది 50వ సినిమా.

• ‘అరుంధతి’లో సోనూసూద్ పాత్ర హైలెట్ గా నిలిచింది. సోనూసూద్ కి గాత్రం అందించిన రవిశంకర్ ఈ సినిమాలో అదిరిపోయే పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున తరవాత ఆ పాత్రనే ప్రేక్షకులు ఎక్కువ గుర్తు పెట్టుకొంటారట.
• నాగార్జున అనుష్క కలయికలో వస్తున్న అయిదవ సినిమా. హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన ఈ జంట…మరో సూపర్ హిట్ ని తమ ఖాతలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
• వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న ఆర్.ఆర్ మూవీ మేకర్స్ మళ్లీ గాడిలో పడాలంటే ఈ సినిమా హిట్ కావాల్సిందే.
• రెండు రోజుల క్రితం ‘డమరుకం’ సినిమాకి బయ్యర్లకు ప్రత్యేకంగా చూపించారు. సినిమా చూసి వాళ్లంతా ఫుల్ ఖుషీ. నాగార్జున కూడా ఈ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నారు. మరి అవన్నీ ఏ మేరకు నిజం అవుతాయో తెలుసుకోవాలంటే…ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
• ప్రతిక్షణం ‘ఢమరుకం’అప్ డేట్స్, లైవ్ రివ్యూ తెలుసుకోవాలంటే….ఎప్పుడూ టచ్ లో ఉండండి.