” పద్మ ” కు దాసరి ని మించిన అర్హులున్నారా…?

అవార్డులు ప్రతిభకు కొలమానాలు కాకపోవచ్చు. కానీ ప్రతిభావంతులకు అవి చేరకపోతే… పురస్కారాలకు విలువ వుండదు. అవార్డుల గొప్పదనం కోసమైనా.. వాటిని గొప్పవారి చేతిలో పెట్టాల్సిందే! కాకపొతే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించక పోవడం దురదృష్టం. దర్శకుడు బాపునే తీసుకోండి! తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పిన ఘనత ఆయనది. తెలుగు సినిమా పూర్తిగా వ్యాపారపరమైన రోజుల్లోనూ కళాత్మక విలువలను వదిలి పెట్టలేదు. ‘ఇది మన సినిమా’ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అది బాపు లాంటి కొందరు దర్శకుల చలవే. కానీ ఆయనకు ప్రభుత్వ పురస్కారాలు అందలేదు. చిత్రకారుడిగా, దర్శకుడిగా… ఆయన సేవల్ని ప్రభుత్వం గుర్తించిన పాపాన పోలేదు. ఇప్పుడు పద్మ అవార్డుల జాబితాలో ఆయన పేరుంది. ఈసారీ ఆయనకు మొండి చేయి చూపించినా ఆశ్యర్య పోనవసరం లేదు. పద్మ వచ్చినంతమాత్రాన ఆ కళాకారుడికి ఒరిగింది ఏమీలేదు. ఆ ‘పద్మ’లే గర్వంగా వికసిస్తాయంతే. రమణ గారికి.. అన్యాయమే చేశాం. పద్మని చూడకుండానే వెళ్ళిపోయారు. బతికున్నప్పుడే… కళాకారులని గౌరవించుకోవాలి… అనే స్పృహ ఈ పెద్ద మనుషులకు ఎప్పుడొస్తుందో….

బాపు మాట సరే! తెలుగులో ‘ పద్మ’ పురస్కారాలకు అన్ని విధాలా అర్హుడైన వ్యక్తి మరొకరు వున్నారు… ఆయనే “దర్శకరత్న దాసరి నారాయణ రావు”. ‘కెప్టెన్’ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆయన… దాసరి స్పూర్తితోనే చాలామంది మెగా ఫోన్ పట్టుకున్నారు. దర్శకుడిగానే కాదు.. కధకుడిగా, కవిగా, రచయితగా, నటుడిగా, నిర్మాతగా, పాత్రికేయునిగా, పంపిణీదారుడిగా, కళాకారుల పక్షపాతిగా… దశాబ్దాలుగా సేవలు అందిచిన ఘనత ఆయనది. 150 సినిమాలు తీసి… ఇప్పటికీ సినిమాపై అంతే ప్రేమతో పనిచేస్తున్న ఒకే ఒక్కడు దాసరి…. అటు రాజకీయాల్లోనూ అడుగు పెట్టి, కేంద్ర మంత్రిగా తన వంతు సేవలు అందించి ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఈ రోజు మనం ‘స్టార్లు’ అని చెప్పుకుంటున్న వారందరినీ .. తయారు చేసిన ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆయన. కొత్త తరహా కధలకు, ప్రయోగాలకు, రికార్డుల పరంపరకూ తొలి అడుగు వేసింది దాసరే! అలాంటి వ్యక్తికి పద్మ పురస్కారం రాకపోవడం కంటే ఘోరమైన విషయం మరొకటి ఉందా?

ప్రభుత్వ పురస్కారాలన్నీ ఇప్పుడు కోటాల్లోనూ, లాబియింగ్ లతోనూ ముడిపడి వున్నాయి. ఈ రోజు మహాత్ముడు బతికి వున్నా… ఆయనకూ సిఫార్సు లేకపోతే ‘పద్మ’ రాని దుస్థితి! అలాంటి అవార్డు వస్తే ఎంత? రాకపోతే ఎంత? కాకపొతే… ప్రపంచం మొత్తం గుర్తించిన తరవాత, మనం మనవారిని కీర్తించడం మానుకుంటే మేలు… ఆవార్డుల పంపకంలో రాజకీయాలు తెలియంది కాదు. ఏ పార్టీ అధికారంలో వుంటే… ఆ పార్టీ వారికే అవి దక్కుతాయి. దాసరి కాంగ్రెస్ పార్టీ వ్యక్తే. తొలి నుంచీ ఆయన ఆ పార్టీకే సేవలు అందిస్తున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉంటూ… మరొకరి అవార్డుల కోసం కృషి చేసారు తప్ప… తనకు అవార్డు ఇవ్వాలని ఎప్పుడూ పట్టు పట్టలేదు. అదే జరిగితే… ఏనాడో ఆయన ఇంటికి పద్మ వచ్చేది. అవార్డులు రావడానికి లాబీయింగ్ చేస్తారు. కాని… దాసరికి అవార్డు దక్కకూడదని… సినిమా రంగానికి చెందిన కొందరు పెద్దలే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదెంత దౌర్భాగ్యమో చూడండి. ఒకరి ప్రతిభను గుర్తించకుండా మోకాలు అడ్డుతున్నారంటే… పద్మ పురస్కారాలు ఏ స్థాయిలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

కోయిల పాటను గుర్తించకుండా ఉన్నంత మాత్రాన… అది కోయిల కాకుండా పోతుందా? తాజ్ మహల్ సోయగాలను చూడలేక కళ్ళు మూసుకుంటే.. ఆ సౌధం మాయమయి పోతుందా? దాసరి కూడా అంతే! 20 ఏళ్ళ క్రితం ఆవార్డులు వస్తే.. అది చూసి వాళ్ళు సంతోషపడేవాళ్ళేమో! ఇప్పుడు అవార్డుల సంతోషం కోసం… ఈ మహానుభావులకు ఇవ్వాలి. ప్రభుత్వం గుర్తించకపోతే ఏమిటి? కోట్లాది ప్రజలు గుర్తించారు. అవే.. వేవేల పద్మాలు.