భా(వి)జపా ప్రధాని నరేంద్ర మోడీ

modiగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయఢంకా మోగించి తన సారధ్యంలోని భారతీయజనతా పార్టీకి తిరుగులేని ఘనవిజయాన్ని సాధించిపెట్టి తన స్టామినాను చాటిచెప్పారు నరేంద్ర మోడీ. ఈ విజయంతో ఎప్పటి నుండో భాజపాలో ప్రధాని అభ్యర్థిగా ముందువరుసలో ఉన్న మోడీ పేరు దాదాపుగా ఖాయమైనట్టే అని చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుత భాజపా అగ్రనాయకుల జాబితాను పరికిస్తే ప్రధాని అభ్యర్థులుగా ఎల్. కె. అద్వానీ తరవాత చెప్పుకోదగ్గ పేరు మోడీ ఒక్కటే. అందునా అద్వానీ వయోభారం మూలంగా ఆ పదవి పట్ల అనాసక్తి కనబరుస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. కాబట్టి కనుచూపుమేరలో భాజపాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ తప్ప వేరొక ఘనాపాటి లేనట్టే.

భాజపాలో ప్రధాని రేసులో ఉన్న నాయకులు… ఎల్. కె. అద్వానీ, నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్, గడ్కరీ, వెంకయ్యనాయుడు. వీరిలో స్పష్టంగా దేశవ్యాప్తంగా కావలిసినంత జనాకర్షణ ఉన్న నాయకుడు మోడీ మాత్రమే. దీనికి తోడుగా ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ వంటి తలలు పండిన నాయకులను సైతం మట్టికరిపించి తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకోవడం కూడా తన ప్రధాని అభ్యర్థిత్వానికి మరింత బలం చేకూర్చింది. దేశవ్యాప్తంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ర్టాల జాబితాలో అగ్రభాగంలో సాగిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలను తోసిరాజని అట్టడుగు భాగాన ఉన్న గుజరాత్ రాష్ర్టాన్ని తన సమర్థవంతమైన పాలనతో, ఆర్థిక సంస్కరణలతో మొదటి స్థానంలో నిలిపిన ఘనత మోడీది. గోద్రా సంఘటనల నేపథ్యంలో మైనారిటీల మద్దతు మోడీకి లభించకపోవచ్చునన్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలు సైతం తప్పుగా నిరూపించబడ్డాయి. వీటితో పాటు భాజపా అగ్రనాయకులు సైతం బాహాటంగా కాకపోయినా తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీయే అని చెప్పకనే చెబుతున్నారు.

guj_campaign_sl_15-12-2012మరోవైపు 2014లో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరు ముందుకొచ్చింది. ఈ తరుణంలో వచ్చే లోక్ సభ ఎన్నికలు నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి మధ్య జరగబోయే హోరాహోరి సమరం అంటూ ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను కూడా ప్రసారం చేస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ ఎన్నికల్లో రాహుల్, సోనియా, మరికొందరు కాంగ్రెస్ అగ్రనాయకుల విమర్శలకు ప్రతి విమర్శలు సంధించి వారిని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు సరికొత్తగా ఎన్నికల ప్రచారంలో త్రిడీ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించి అందరినీ ఆకట్టుకున్న దిట్ట నరేంద్ర మోడీ.

సో.. భాజపా వ్యూహాలన్నీ ఫలించి, పరిస్థితులన్నీ అనుకూలించి, అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగి భారతీయజనతా పార్టీ లేదా భాజపా నేతృత్వంలోని ఎన్ డీఏ 2014లో అధికారాన్ని చేజిక్కించుకోగలిగినట్లయితే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రమోషన్ కొట్టడం దాదాపుగా ఖాయమేనని చెప్పొచ్చు.