తెరాస డ్రామాల పార్టీ : జగ్గారెడ్డి

ప్రభుత్వ చీఫ్ విప్ జగ్గారెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ తెరాసకు ఏజెంటులా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావు పనిచేస్తున్నారనీ, తెలంగాణకు చెందిన కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా  కేసీఆర్ కు వత్తాసు పలుకుతున్నారని  ఘాటైన విమర్శలు చేశారు. పరోక్షంగా కేసీఆర్‌కు సహకరిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ఎంపీలపై విరుచుకుపడ్డారు జగ్గారెడ్డి. తెరాసలోకి వెళ్లిపోతే కేకే తోపాటు అంతా పోతారా అంటూ ప్రశ్నించారు.  తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారనీ, ఒకసారి ఢిల్లీ బాట… మరోసారి మండలాల బాట అంటూ కల్లబొల్లిపనులు చేస్తూ తెలంగాణ సాధనను గాలికి వదిలేస్తున్నారన్నారు. తాజాగా ఎన్నికల్లో పోటీ చేసి తెరాస100 సీట్లుపైగా తెచ్చుకుంటుందని చెపుతున్నారంటే ఆ పార్టీవారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. 50 ఏళ్ల క్రితం నుంచీ తెలంగాణ డిమాండు ఉందని, తెలంగాణ విభజన చివరిదశకు చేరుకున్న దశలో కోస్తా, రాయలసీమ డిమాండ్లు కూడా తెరపైకి రావడంతో నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయారని గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తే సీమ, ఆంధ్ర, కోస్త కావాలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని ముక్కలు చేయడం సాధ్యం కాదు కదా. ఇలాంటి సమస్యపై పార్లమెంటులో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనీ, అంతేతప్ప గల్లీల్లో గొడవ చేస్తే వస్తదా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీకే సమస్యను పరిష్కరించగలిగే సత్తా ఉన్నదనీ, తెరాస రాజకీయ పార్టీ కాదు… డ్రామాల పార్టీ అంటూ ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి.