‘దేశం’ లోకి జయప్రద…. జయసుధ….?

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, సికింద్రాబాద్ నియోజకవర్గ శాసన సభ్యురాలు జయసుధలు త్వరలోనే తెలుగుదేశం పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం అవుతోందా…? జరుగుతున్న పరిణామాలు నిశితంగా గమనిస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన జయప్రద ఆ పార్టీ పైన అలిగి బైటికి వెళ్ళిపోయారు. ఆ తరువాత అమర్ సింగ్ చేయూతతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలుపొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె యు.పి.లోని రాంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆమె తరచూ నియోజకవర్గంలో పర్యటించకపోవటం తో అక్కడి ప్రజల్లో ఆమె పట్ల వైముఖ్యం పెరిగింది. నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకపోవటం, అక్కడి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకపోవటంతో ఆమెకు నియోజకవర్గ ప్రజలనుంచి పెద్దఎత్తున నిరసనలు ఎదురవుతున్నాయి. దాదాపు నాలుగు నెలల తరువాత మొన్ననే తన నియోజకవర్గానికి వెళ్ళిన జయప్రదకు నిరసనలతో బాటు చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.

అక్కడి పార్టీ కార్యాలయానికి వెళ్ళిన ఆమెకు వినూత్న రీతిలో ” మా ఎం.పి. జయప్రద కనిపించుట లేదు… పట్టి ఇచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతి…” అంటూ బ్యానర్లు కనిపించటంతో ఆమె నిర్ఘాంతపోయారు. భవిష్యత్తులో ఆ నియోజకవర్గం నుంచి పోటి చేస్తే గెలవటం అసాధ్యమన్నది ఆమెకు అర్ధమై పోయింది. అందుకే జయప్రద ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక పై దృష్టి సారించినట్టు సమాచారం. కొద్ది మాసాల క్రితం ఆమె ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సందర్భంలో తనకు రాష్ట్ర రాజకీయాలలోకి పునఃప్రవేశం చేయాలని వుందని సూచనప్రాయంగా చెప్పారు. అయితే ఏ పార్టీలో చేరాలనుకుంటున్నది ఆమె స్పష్టం చేయలేదు. ఆ సందర్భంలో ఆమె చంద్రబాబు గురించి పాజిటివ్ గా చేసిన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు విన్నవారంతా తప్పనిసరిగా జయప్రద తెలుగుదేశం పార్టీ లో చేరతారన్న అభిప్రాయానికి వచ్చేసారు. ఆ తరువాత మరెందుకో ఈ విషయమై గ్యాప్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ఈ విషయమై ఎవరూ పెద్దగా చొరవ చూపినట్లు కనిపించలేదు.

తాజాగా రాంపూర్ సంఘటన తరువాత జయప్రద మరో నియోజకవర్గాన్ని వెదుక్కోవలసిన అవసరం ఏర్పడింది. కాని సమాజ్ వాది పార్టీ నుంచి అమర్ సింగ్ తో బాటు ఆమె కూడా బహిష్క్రుతురాలు అయిన నేపధ్యంలో జాతీయ రాజకీయాల పట్ల ఆమె పెద్ద సానుకూలంగా వున్నట్లు కనిపించటంలేదు. ఈ నేపధ్యంలో ఆమె అనివార్యంగా రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీయే రాష్ట్రంలో తనకు సరైన వేదిక అని ఆమె భావిస్తున్నారని ఆమె సన్నిహితులద్వారా అందిన సమాచారం.. ఇప్పటికే ఈ ప్రతిపాదన చంద్రబాబు వద్దకు వెళ్లిందని, ఆయన కూడా సుముఖంగా వున్నారని, ” వస్తున్నా… మీకోసం ” పాదయాత్ర అనంతరం ఈ విషయమై అటు పార్టీ, ఇటు జయప్రదల మధ్య ఒక స్పష్టత వచ్చే అవకాశం వుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదిలావుండగా సికింద్రాబాద్ ఎం.ఎల్.ఎ. జయసుధ కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర అసంతృప్తి తో వున్నట్టు తెలుస్తోంది. రాజకీయాలకంటే సినిమా రంగమే తనకు సంతృప్తికరంగా వుందని, తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు తానేమీ చేయలేకపోతున్నానని జయసుధ ఇటివలనే మీడియా ఎదుట తన ఆవేదనను వెలిబుచ్చారు. ఒక దశలో ఆమె జగన్ శిబిరంలో వున్నారు. జగన్ వెంట వెళ్ళిన కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లతో బాటు ఆమె కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. కాని చివరి నిముషంలో ఆమె మనసు మార్చుకుని కాంగ్రెస్ లోనే వుండిపోయారు. అప్పటినుండి తనపట్ల కాంగ్రెస్ పార్టీ లో చిన్న చూపు మొదలయిందని, తన నియోజవర్గానికి నిధుల కేటాయింపు విషయంలో కూడా వివక్ష కొనసాగుతోందని ఆమె బాధపడ్డారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగటం అవసరమా…. అన్న ఆలోచనలో ఆమె వున్నట్టు తెలిసింది. ఇంత జరిగిన తరువాత మళ్లీ జగన్ పార్టీ లోకి వెళ్లేందుకు ఆమెకు మనసు అంగీకరించే ప్రసక్తే లేదని, ఈమె చేరికకు కూడా జగన్ పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవచ్చునని జయసుధ సన్నిహితులు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి జయసుధకు ఆదినుంచీ ఆహ్వానం వుంది. ఆమె రాజకీయరంగ ప్రవేశమే తెలుగుదేశం పార్టీ లో జరుగుతుందని మొదట్లో అందరూ భావించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు ఆమె కాంగ్రెస్ లో చేరారు. వై.ఎస్. వుండగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ లో మంచి ట్రీట్ మెంటు కొనసాగింది. ఇటీవలి కాలంలో పార్టీ లో ఆమె ఉనికికి పెద్దగా ప్రాధాన్యం ఉండక పోవటంతో సహజంగానే ఆమె మనస్తాపం చెందుతున్నారు. ఈ దశలో ఆమె కళ్ళెదుట వున్న ఏకైక ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయే. ఇటివలనే ‘ దేశం ‘ నాయకులు కొందరు ఆమెతో సంప్రదింపులు జరిపారని, పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామంటూ భరోసా కూడా ఇచ్చారని తెలిసింది. అందుకు జయసుధ కూడా సానుకూలంగా స్పందించారని, సమయం చూసి తన నిర్ణయాన్ని తెలియచేస్తానని వారితో చెప్పినట్లు భోగట్టా..

అనుకున్నట్టుగా జయప్రద, జయసుధ లు ఇరువురు తెలుగుదేశం పార్టీ లో చేరితే మహిళల పరంగా పార్టీకి పెద్ద ప్రయోజనం ఉంటుందని, దానికి తోడు సినిమా గ్లామర్ కూడా తోడు అవుతుందని ‘ దేశం ‘ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పార్టీలో ‘ జయ ‘ ‘ జయ ‘ ధ్వానాలు ఎప్పుడు వినిపిస్తాయోనని ‘ దేశం ‘ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.