రివ్యూ : కృష్ణం వందే జగద్గురుమ్

మనిషిని దేవుణ్ణి చేసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’

ఒక్కొక్కయుగంలో దేవుడు ఒక్కో అవతారంలో ఉద్భవించి రాక్షస సంహారం చేశాడట. ఎవరో ఏవో పుస్తకాలు రాస్తే చదువుకొన్నాం. అదే నిజమనుకొంటున్నాం. అంతే కాదు…’సంభవామి యుగేయుగే’ అంటూ పొరపాటున ఇవ్వకూడని మాట ఏమరుపాటులో ఇచ్చేశాడు. అంటే… పాపం ఎప్పుడైతే పండుతుందో అప్పుడు దేవుడు ఉద్భవిస్తాడన్నమాట. మరి దేవుడెక్కడ? రాజకీయ నాయకులూ, కబ్జాదారులూ, దోపీడీకోరులూ మట్టిని వాటాలేసుకొని మెక్కుతూ ఉంటే… చోద్యం చూస్తున్నాడేంటి? మనిషిని చంపుకొని తింటుంటే… రాయిలా గుళ్ళోనే నిలబడిపోయాడేంటి? వరాహావతారం, మత్స్యావతారం…అంటూ ఎత్తవలసిన అవతారాలన్నీ ఎత్తి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాడేంటి? దెవుడెక్కడ? లేడా? ఉన్నా… రాలేడా? ? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు రోజూ మనలో మెదులుతూ ఉంటాయి. ఆ క్షణం ఆవేశపడిపోయి.. మరుసటి నిమిషం వేరే వ్యాపకాల్లో పడిపోతాం. “రోజు పేపర్ చదవుతూ ఉంటే కోపం వస్తుంది. మరుసటి రోజు ఆ పేపర్ పాతపడిపోతుంది. కొత్త న్యూస్… కొత్త కోపం…” (ఇది ఈ సినిమాలో డైలాగ్) సమాజాన్నీ, సమస్యల్నీ అందరిలాగే లైట్ తీసుకొంటాం. ఈ ఆలోచనలు క్రిష్ కీ వచ్చాయి. దేవుడు ఖురాన్ లోను, బైబిల్ లోనూ లేడు, భగవద్గీత, రామాయణాల్లో లేడు… మనిషిలోనే ఉన్నాడు…అని చెప్పే ప్రయత్నం చేశారు. మనిషిని దేవుడుగా మార్చారు. రాక్షసులు పుడుతూనే ఉంటారు. వాళ్ల కోసం దేవుడు దిగిరాడు. మనిషే దేవుడిగా మారాలి… అని చెప్పే ప్రయత్నం చేశారు. అదే…’కృష్ణం వందే జగద్గురుమ్’.

 

బాబు(రానా) బీటెక్ చదివి నాటకాలు వేస్తుంటాడు. ఎలాగైనా సరే.. అమెరికా వెళ్లాలనేది బాబు కల. మేకప్ కంపు కొడుతున్న బతుకుని బాగు  చేసుకోవాలని ఆశ పడుతుంటాడు. ‘నిద్రలో కనేది కల… జనాన్ని నిద్రలోంచి మేల్కొలిపేది కళ…’ అంటూ తాతయ్య (కోట) ఎంత చెప్పినా పట్టించుకోడు. ఓరోజు తాతయ్య చనిపోతాడు. చివరిసారిగా తాతయ్య రాసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ నాటకాన్ని బళ్లారిలో వేయాలని బాబు నిశ్చయించుకొంటాడు. బళ్లారిలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుంటోంది. అక్కడ రెడ్డప్ప (మిలింద్ గునాజి)దే రాజ్యం. బళ్లారిని కబ్జా చేసి… అక్రమ త్రవ్వకాలతో లక్ష కోట్లు సంపాదిస్తాడు. అక్కడున్న గూడెం ప్రజలను ఖాళీ చేయించి.. వారి నివాస స్థలాన్ని ఆక్రమిస్తాడు. రెడ్డప్ప అక్రమాలను వెలుగులోకి తీసుకురావడానికి దేవిక(నయనతార) బళ్లారి వస్తుంది. బళ్లారిలో బాబుకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? రెడ్దప్ప ఆక్రమణలను ఎలా ఎదుర్కొన్నాడు? దేవిక ప్రయత్నాలు ఫలించాయా, లేదా? అసలింతకీ బాబుకీ, రెడ్దప్పకీ ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.

రివెంజ్ డ్రామా అనేది తెలుగు తెరపై ఎప్పటి నుంచో చూస్తున్నదే. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ కూడా ఒకవిధంగా అలాంటి కథే. అయితే.. క్రిష్ దానికి సరికొత్త బ్యాక్ డ్రాప్ ఇచ్చాడు. మైనింగ్ మాఫియా, నాటకాలు, సమాజం, సమస్యలు, దేవుడు ఈ అంశాలను మేళమించి పాత కథనే బాధ్యతతో ఎలా చెప్పాలి? అనే విషయాన్ని ఇప్పటి దర్శకులకు ఓ పాఠంలా బోధించాడు. నిత్యం వార్తల్లో గాలి జనార్థన్ రెడ్దిలాంటి వాళ్లు కోటాను కోట్లు ఎలా ఆర్జించారో.. తెలుసుకొంటూనే ఉన్నాం! రోజుకో బడా బాబు అక్రమం బయటపడుతోంది. అందుకే.. కథలోని సామాన్య ప్రేక్షకుడు కూడా సులభంగా ప్రవేశిస్తాడు. సినిమాలో క్రిష్ కొన్ని మంచి విషయాలు చెప్పాలని తాపత్రయపడ్డాడు. నాటకం, కళ గొప్పదనం, మనిషికున్న సామాజిక బాధ్యత, మీడియా పనితనం… దేన్నీ వదల్లేదు. అన్నికంటే ముఖ్యంగా దశావతార రూపకాన్ని కథలో వాడుకొన్న తీరు ప్రశంసనీయం.

కథ తొలి సన్నివేశం నుంచే పరుగుపెడుతోంది. క్రిష్ ఆలోచనకు… బుర్రా సాయిమాధవ్ అందించిన సంభాషణలు సరైన ఊతం ఇచ్చాయి. ప్రతీ సన్నివేశంలోనూ ఓ మెరుపులాంటి సంభాషణ… చప్పట్లు కొట్టించేలా చేస్తుంది. ‘అన్నం లేకపోతే మట్టిని అడిగితే పెడుతుంది. అలాంటి మట్టినే లేకుండా చేస్తున్నారు…’ అంటూ మట్రాజు (ఎల్బీ శ్రీరామ్) పలికిన సంభాషణ వెనుకే… ఈ కథంతా దాగుంది. ‘తల్లి నవమాసాలూ మోస్తే నేను పుట్టాననుకొంటాడు ఒకడు. నాన్న అమ్మ దగ్గర పది నిమిషాలు గడిపితే పుట్టాననుకొంటాడు ఇంకొకడు. రెండూ నిజాలే. పురిటి నొప్పుల బాధను చూసినవాడు మనిషవుతాడు… పడక సుఖం మాత్రమే చూసినవాడు పశువవుతాడు’ అనే మాట రాయడానికి దర్శకుడు, సంభాషణా రచయిత ఎన్ని పురిటినొప్పులు పడ్దారో..? ! మీడియాపై కూడా చురకలు పడ్డాయి. ‘మీడియా సర్కస్ రెండూ ఒక్కటే. రెండింటిలోనూ బఫూన్ లుంటారు’, ‘కాస్ట్ ని బట్టే టెలీకాస్ట్’ లాంటి మాటలు ఈటెల్లా తగులుతాయి. పోసాని కృష్ణమురళి నోటిలోనూ పదునైన మాటలే పేలాయి. ఎంతోకాలం నుంచి రానా ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాని కోసం ప్రాకులాడకుండా… కథ కోసం ఏం చేయాలో ఈ సినిమాలో అతను అన్నీ చేశాడు. అతని నటనలో నిజాయితీ కనిపిస్తుంది. ఆ ఎత్తు, శారీరక ధారుడ్యం బాబు పాత్రకు చక్కగా నప్పాయి. ఇక నయనతార ఇంత పద్ధతిగా మరే ఇతర కమర్షియల్ సినిమాలోనూ కనిపించలేదు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంది. ఆ గొంతు… దేవిక పాత్రకు సరిపోయింది. కోట, ఎల్బీ శ్రీరామ్, పోసాని, రఘుబాబు… ఇలా అందరూ క్రిష్ ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు. ఓ పాటలో వెంకీ తళుక్కున మెరుస్తారు. అది వెంకటేష్ అభిమానులకు బోనస్.

కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా… పాటలొస్తుంటాయి. అవి లేకపోయినా సినిమాకు వచ్చిన నష్టం లేదు. వాటి వల్ల ప్రయోజనమూ లేదు. సిరివెన్నెల రాసిన దశవతార రూపకం గురించి చెప్పుకోవాలి. తొమ్మిది నిమిషాల పాట….  అందులోని భాగోద్వేగాలనూ సినిమాకు అనుగుణంగా వాడుకొన్న తీరు బాగుంది. పతాక సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మణిశర్మ ఇచ్చిన ఆర్.ఆర్…సినిమాలోని మూడ్ ని చివరి వరకూ క్యారీ చేశాయి. సాంకేతిక నిపుణులంతా ప్రశంసా పాత్రులే.
మన దర్శకులు, నిర్మాతలూ పైసా వసూల్ మైకంలోపడి… కథని పట్టించుకోవడం మానేశారు. రాసుకోవడం మానేసి… కొనుక్కొంటున్నారు. తమిళంలోనో, హిందీలోనో ఓ సినిమా ఆడితే దాని కోసం లక్షలు గుమ్మరిస్తున్నాం. కథలు ఎక్కడో లేవు.. తెరచి చూస్తే సమాజంలోనే కావల్సినన్ని ఉన్నాయి. మనిషి మనిషిలోనూ ఉన్న వ్యథల్లో రసవత్తరమైన సన్నివేశాలున్నాయి. అవన్నీ ఒడిసి పట్టుకొంటున్న దర్శకుడు క్రిష్. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాల కోసం ఆయన నేల విడిచి సాము  చేయలేదు. ఈ నేలలోనే, ఈ మట్టిలోనే మాణిక్యంలాంటి కథ వెతుకొన్నాడు. తను చెప్పదలుచుకొన్న విషయాన్ని నిజాయితీగా మన ముందుంచాడు. ఆశీర్వదించవలసిన బాధ్యత… ప్రేక్షకులదే.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3.75/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here For ‘ Krishnam Vande Jagadgurum’ English Review

 

లైవ్‌ అప్‌ డేట్స్‌ :

* టైటిల్‌ కార్డ్‌ లోనే స్టోరీలైన్‌ మైనింగ్‌ మాఫియా గురించి క్లుప్తంగా వివరించారు. జర్నలిస్ట్‌ గా నయనతార ఎంట్రీ…

* నాటకాలరాయుడు బీటెక్‌ బాబుగా రానా ఎంట్రీ… రఘుబాబు అండ్‌ ట్రూప్‌ తో నాటకం సీన్‌. ఘటోత్కచుడి పాత్రలో రానా నట విజృంభణ… సుదీర్ఘమైన తెలుగు డైలాగ్స్‌ రానా అలవోకగా పలకడం స్పెషాలిటీ..

* తాతామనవళ్ళుగా   కోట, రానా… నాటకాలు వదిలి అమెరికా వెళ్ళిపోవాలనే మనవడితో కళ గురించి కోట చెప్పే డైలాగ్స్‌ బాగున్నాయి.

*   రంగమార్తాండ అంటూ సాగే మొదటిపాట.. “సి” క్లాస్‌ బార్‌ సెట్‌ లో.. హీరో క్యారెక్టరైజేషన్‌ వివరించే సాంగ్‌. వెంకటేశ్‌ స్టెప్స్‌ అనుకరిస్తూ రానా డ్యాన్స్ అదుర్స్‌..  అభిమానులు హ్యాపీ…

* తాత చనిపోవడంతో సురభి నాటక ట్రూప్‌ విచ్చిన్నం… తాత వ్రాసిన చివరి నాటకం బళ్ళారిలో ఆడాలని బాబు నిర్ణయం.. ఈ సన్నివేశాల్లో మణిశర్మ రీ రికార్డింగ్‌ అద్భుతంగా ఉంది.

* సినిమాకు హైలైట్‌ అని మొదట్నుండీ చెబుతూ వస్తున్న దశావతారాల సాంగ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లో వస్తూ జీవితసారాన్ని వివరించిన తీరుకు ఖచ్చితంగా క్రిశ్‌ కు హ్యాట్సాఫ్‌ చెప్పితీరాల్సిందే..

* రంగస్థల  పండిట్‌ “రంపం” పాత్రలో ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మీ.. థియేటర్లో నవ్వుల పువ్వులు.. దేవిక(నయన్‌) ను చూసి ఫ్లాట్‌ అయిపోయిన బాబు(రానా) ….

* దేవిక కోసం రెడ్డెప్పతో తలపడిన బాబు…. ఐటం సాంగ్‌ తో సమీరా ఆన్‌ స్క్రీన్‌ కెవ్వుకేక… వెంకీ బాబాయ్‌ తో కలిసి అబ్బాయ్‌ రానా… సమీరా రెడ్డితో వేసిన స్టెప్పులకు థియేటర్లో విజిల్స్‌ అండ్‌ క్లాప్స్‌…

* పోలీస్‌ స్టేషన్‌ లో గొడవ  పడిన బాబు… స్లోగా కథ సీరియస్‌ నెస్‌ సంతరిచుకుంటోంది.  గమ్యం, వేదం స్టైల్లో ఈ సినిమా కూడా ఉంది. ఇలాగే సాగితే ఆ రెండింటినీ మించే సినిమా కావచ్చు.

* పోసాని ఎంట్రీ.. తన డైలాగ్స్‌ కు థియేటర్లో చప్పట్లు, విజిల్స్‌… తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పిన నయనతారకు ఫుల్‌ మార్క్స్‌ ఇవ్వచ్చు.

* మైనింగ్‌ మాఫియాతో బాబు గొడవ‌… ఫైట్‌ మొదలయింది.. సినిమా కథ ముదిరి పాకాన పడుతోంది.

* మీడియా పై సటైర్స్‌ వేసిన క్రిశ్‌.. ఇప్పటివరకూ ఒక్క వేస్ట్‌ సీన్‌ కూడా లేదు.. స్క్రీన్‌ ప్లే అదుర్స్‌…

* కథలో రానా ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌.. తన తల్లిదండ్రుల్ని చంపింది రెడ్డెప్ప అని బాబుకు తెలిసిపోయింది.

* మూడవ పాట “స్పైసీ గర్ల్‌” స్టార్ట్‌ అయింది…

* అడవిలో భారీ ఛేజింగ్‌ సీన్‌… …… బుల్లెట్లు, బాంబుల దాడి నుంచి తప్పించుకున్న బాబు, దేవిక…

* ఇంటర్వెల్‌

* రానా, నయనతారలను కాపాడిన గూడెం ప్రజలు… పోసాని, హేమ, బ్రహ్మానందం మధ్య కామెడీతో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్‌…

*  గూడెం ప్రజలలో స్ఫూర్తి నింపిన బాబు.. ప్రతి సన్నివేశంలోనూ తన మార్క్‌ చూపించిన క్రిశ్‌….

* “అరెరె పసిమనసా” అంటూ సాగిపోయే మరో బ్యూటిఫుల్‌ సాంగ్‌… ఈ పాటలో రానా, నయనతార చాలా అందంగా కంపించారు.

* ఆచూకీ తెలుసుకుని వచ్చిన విలన్‌ గ్యాంగ్‌ తో మరో భారీ ఫైట్‌…

*  ప్రేక్షకులకి ఓ స్వీట్‌ షాక్‌… మన్మధుడిగా బ్రహ్మానందం దర్శనం…

* సమాజంలో కుళ్ళు, కుతంత్రాలను క్రిశ్‌ చూపిస్తున్న తీరు చాలా బాగుంది. బాబు ఆందోళన ఆవేశంగా మారుతోంది. కథ నెమ్మదిగా క్లైమాక్స్‌ వైపుకు టర్న్‌ తీసుకుంటోంది.

* ఎమోషన్‌ సీన్స్ ను పండించడంలో తనకు సాటిలేదని క్రిశ్‌ మరోసారి నిరూపించుకున్నాడు. చక్రవర్తి  జరిపిన ఎటాక్‌ నుండి రెడ్డెప్ప తప్పించుకున్నాడు.

* రెడ్డప్ప నిజస్వరూపం బట్టబయలయింది. కథలో ఇదే అసలుసిసలయిన ట్విస్ట్‌ అని చెప్పుకోవచ్చు…

* క్లైమాక్స్‌ కి రంగం సిద్ధం.. మరోసారి దశావతార రూపకం ఘట్టం… పది అవతారాల్లో మెప్పించిన రానా.

* నరసింహావతారంలో శతృసంహారం చేసిన బీటెక్‌ బాబు…

* శుభం కార్డు

Catch complete review in a few minutes…

Click Here For ‘ Krishnam Vande Jagadgurum’ English Review

 

కృష్ణం వందే జగద్గురుమ్ ప్రివ్యూ :

ప్రతిభ, విజయాలు…. రెండూ వేరు కాదని చిత్రపరిశ్రమ బలంగా నమ్ముతుంది. ఇక్కడ విజయానికి వాయిస్ ఎక్కువ. అందుకే ఆ విజయం అంటే అంత తాపత్రయం. తొలి దశలోనే పరాజయాలు చుట్టుముడితే ఇక ఎంత ప్రతిభవున్నా నెగ్గుకురావడం కష్టం. వీలైనంత తొందరగా ఆ హిట్ జేబులో వేసుకోవాలని ఆరాటపడేది అందుకే. అయితే ఈ లెక్కలకు దూరంగా ప్రయాణం చేస్తున్న కధానాయకుడు దగ్గుబాటి రానా. తొలి సినిమా ‘లీడర్’ని మినహాయిస్తే… ఆయనకు ఒక్క విజయం కూడా దక్కలేదు. ‘నేను… నా రాక్షసి’, ‘నా ఇష్టం’… దారుణంగా బోల్తా పడ్డాయి. ఆ సినిమాల వల్ల రానాకి వ్యక్తిగతంగా వచ్చిన లాభం కూడా ఏమీ లేదు. కేవలం అనుభవం కోసం ఉపయోగపడ్డాయి. ఇప్పుడు క్రిష్ సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాపైనే రానా ఆశలన్నీ. ఈ చిత్రం ఈ నెల 30 న విడుదల కాబోతుంది.
‘కృష్ణం వందే..’ సినిమాపై రానా ఒక్కడికే కాదు. పరిశ్రమలోనూ కొన్ని అంచనాలు వున్నాయి. ఆ ఆశలకు కారణాలు ఇవీ..

# మానవీయ విలువలకు పెద్దపీట వేసే క్రిష్ ఈ సినిమాకి దర్శకుడు కావడం… తొలి భరోసా. ‘గమ్యం’, ‘వేదం’ సినిమాలు ఈ దర్శకుడి పంధాను సినీ ప్రపంచానికి తెలిసేలా చేసాయి. క్రిష్ సినిమా అంటే… ఎదో ఒక మేజిక్ ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఇది మన కధ.. అనిపించేలా ఆయన సినిమా తీస్తారని ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ‘కృష్ణం వందే….’ టైటిల్ కుడా ఆకర్షించేదే. మైనింగ్ మాఫియా, నాటక సమాజం.. ఈ రెండిటి నేపధ్యంలో క్రిష్ కధను ఎలా నడిపాడో తెలుసుకోవాలని విమర్శకులు సైతం ఎదురుచూస్తున్నారు.

# ఈ సినిమా ట్రైలర్ కూడా ‘కృష్ణం వందే..’ పై అంచనాలు పెంచేస్తుంది. రానా గెటప్స్.. సంభాషణలు ‘ఈ సినిమాలో ఎదో వుంది’ అనే సంకేతం పంపించాయి. ‘దేవుడంటే సాయం’ అనే మాట హృదయం లోపలికి వెళ్లేదే. సినిమా కుడా అదే స్థాయిలో వుంటే… క్రిష్ కష్టం ఫలించినట్టే.

# ఈ సినిమాలో 9 నిమిషాలపాటు సాగే.. దశావతార రూపకం వుంది. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో ఉద్వేగానికిలోనై రాసిన గీతమిది. సినిమాలో ఎంత కంటెంట్ వుందో… ఈ పాట వింటే అర్ధమవుతుంది. ‘ఈ పాట రాయడానికే ఇంతకాలం ఈ పరిశ్రమలో వున్నానేమో. ఈ పాట రాసిన తరవాత మరో పాట రాయవలసిన అవసరం లేదనిపిస్తోంది’ అని ఉద్వేగభరితంగా మాట్లాడారు సిరివెన్నెల.

# వెంకటేష్ ఫాన్స్ కి ఈ సినిమా పండగే. ఎందుకంటే వెంకీ ఓ పాటలో తళుక్కున మెరవనున్నారు. రానా, సమీరా రెడ్డిలతో ఆయన చిందులు వేయబోతున్నారు. వెంకీ,రానా ఇద్దరినీ ఒకే తెరపై చూడడం కనులవిందే.

# ‘శ్రీరామరాజ్యం’ తరవాత నయనతార నటిస్తున్న సినిమా ఇదే. నయన్ కుడా.. పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మంచి పాత్రలనే ఎంపిక చేసుకుంటోంది. పైగా క్రిష్ సినిమాలో కదానాయికలంతా పద్దతిగా వుంటారు. ఈ రెండు లెక్కలు నిజమైతే.. ఈ సినిమాలో నయన్ పాత్ర పండితే… ఈ సినిమా సగం హిట్ అయినట్టే.

‘హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేని విషయాలు. విభిన్నమైన పాత్రలు ఎంచుకోవడం వరకే నా బాధ్యత’ అంటారు రానా. ఆమాట నిజమే అయినా… కమర్షియల్ హిట్ ఇచ్చే మజా వేరు. అది పది సినిమాలకు కావాల్సిన ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ఇప్పుడు రానాకి కావాల్సింది అదే. ‘దగ్గుబాటి హీరో’ అనే ట్యాగ్ లైన్ ఆయనకు జీవితాంతం వెన్నంటి వుండదు. తనను తాను నిరుపించుకోవాలంటే… హిట్ హీరో అనిపించుకోవలసిందే. ‘కృష్ణం వందే..’ రానా చేతిలో వున్న మరో మంచి అవకాశం. ఈ సినిమా ఫలితంపై హీరోగా రానా భవిషత్తు ఆధారపడి ఉంది. రానా కమర్షియల్ హీరోనా? కాదా? అనే విషయం ఈ నెల 30న తేలనుంది. రానా…. ఆల్ ది బెస్ట్!

Click Here For ‘ Krishnam Vande Jagadgurum’ English Review