రివ్యూ : రొటీన్ లవ్ స్టొరీ

మల్టీ ప్లెక్స్ ప్రేమ కధ… ‘రొటీన్ లవ్ స్టొరీ’

అబ్బాయి, అమ్మాయి…. వారి మద్య ఇగో గోలలు, అలకలు, అపార్ధాలు – ఏ ప్రేమ కధ తీసుకున్నా దాదాపుగా ఇవే కనిపిస్తాయి. వాటికి కాస్త రొమాంటిక్ కోటింగ్… సినిమాటిక్ టచ్ ఇచ్చిన చిత్రం ‘రొటీన్ లవ్ స్టొరీ’. ‘మాది రొటీన్ కధ’ అని ముందే చెప్పేశారు కాబట్టి కొత్తదనం ఆశించి ఎలాగూ థియేటర్లకు వెళ్ళం. కానీ దర్శకుడు ప్రవీణ్ సత్తారు… రొటీన్ ప్రేమకధలోనే ‘ఫ్రెష్ నెస్’ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. అది ఎంత వరకూ ఫలించింది? రొటీన్ కధలో వున్న కొత్తదనం ఏమిటి? తెలుసుకుందాం రండి…

సంజు ( సందీప్ కిషన్) ఇంజనీరింగ్ స్టూడెంట్. తనతో పాటు చదివే తన్వి ( రెజీనా) ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. సంజు చాలా ప్రాక్టికల్. అమ్మాయిలను దూరం నుంచి చూడడం వరకూ ఓకే. ఫ్రెండ్ షిప్ అనో, లవ్ అనో దగ్గరైతే… అమ్మాయిలను తట్టుకోవడం కష్టమని, వాళ్ళకో బాడీ గార్డ్ గా మారవలసి వస్తుందని భయపడతాడు. తన్వి అభిప్రాయం వేరు. ప్రేమించాలంటే ఒకరికొకరు తెలుసుకోవాలని, అభిప్రాయాలు కలసిన తరవాతే ప్రేమించాలని అనుకుంటుంది. అందుకే.. ఆరు నెలల పాటు పరస్పర అంగీకారం తో… స్నేహం మొదలుపెడతారు. ఆ గడువు పూర్తయినా ‘నిన్ను అర్ధం చేసుకోవడానికి ఇంకొంత సమయం కావాలి’ అని అడుగుతుంది. మరింత దగ్గర కావడానికి ‘కాశ్మీర్’ టూర్ కి వెళ్తారు. అక్కడ అనుకోకుండా సంజు, తన్వీ ఓ ప్రమాదం లో చిక్కుకుంటారు. అదేమిటి? ఈ టూర్ లో అయినా వారిద్దరూ దగ్గరయ్యారా లేదా? రొటీన్ గా సాగుతున్న ఈ లవ్ స్టోరీలో మలుపు ఎప్పుడొచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

యల్ బీ డబ్లూ సినిమాతో… ప్రవీణ్ సత్తారు మెగాఫోన్ పట్టారు. ఆ సినిమా ఆర్ధికంగా లాభాలు తీసుకురాకపోయినా.. ప్రవీణ్ మార్క్ తెలిసింది. శేఖర్ కమ్ముల స్టైల్ లోనే… సున్నితమైన భావాలు, చిన్ని చిన్ని సంఘర్షణలు, సహజత్వం వీటి మద్య కధ నడిపారు. ఎక్కడా ఆడంబరాలకు పోకుండా.. అడ్డ దిద్దమైన లాజిక్ వైపు వెళ్ళకుండా సినిమా తీర్చి దిద్దారు. ‘ఖుషి” సినిమా ప్రేమికుల మధ్య ఆసూయని పతాక స్థాయిలో చూపించింది. మళ్ళీ అలాంటి కధనే ఎంచుకునే ధైర్యం చేసాడు దర్శకుడు. సినిమాలో ఒక్క సన్నివేశం కుడా కొత్తగా అనిపించదు. కానీ… ఆ సన్నివేశం చుట్టూ ఓ కొత్త వాతావరణం సృష్టించాడు. ఆ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవలసిందే.

యువతరాన్ని టార్గెట్ చేసుకుని తలా తోకా లేని సినిమాలు చాలా వస్తున్నాయి. బూతులు, శృంగారం మేళవించి సినిమాలు తీసేస్తున్నారు. ఈ దశలో క్లీన్ అండ్ నీట్ గా ఓ ప్రేమకధ చెప్పాలనుకోవడం అభినందనీయం. లిప్ లాక్ ముద్దులను చూపించినా… మద్యలో ఓ బొమ్మ అడ్డుగా పెట్టి ‘తాను హద్దులు తెలిసిన దర్శకుడినే’ అనే విషయం తేటతెల్లం చేశారు. తొలి భాగం అంతా సరదాగా గడిచిపోతుంది. ‘కాశ్మీర్’ ట్రిప్ కూడా ఓకే. అయితే… ద్వితీయార్ధం కధకు పొంతన లేకుండా సాగింది. ‘జంగల్ మే మంగళ్’ ఆలోచన బాగుంది. కానీ.. కధకు అడ్డుకట్ట వేసేదే. ఎంత సహజత్వాన్ని నమ్ముకుంటే మాత్రం…. బొత్తిగా ట్విస్ట్ లు లేకుండా… సో సో గా నడుస్తుంది, దాంతో చూసిన సన్నివేశమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు… అక్కడ వింత ప్రవర్తన చూపించవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు.

సినిమాలో అంతా పిజ్జా, బర్గర్, సాండ్ విచ్ తినే బ్యాచే. ఒక్కరూ అన్నం తిన్న పాపాన పోలేదు. దర్శకుడు ఎంత ప్రవాస భారతీయుడు అయినా… అక్కడి వాతావరణం ప్రతీ ఫ్రేం లోనూ చుపించేయాలి అనుకుంటే.. ఇక్కడి ప్రేక్షకులకు ఎక్కొద్దూ. కాఫీ షాప్ ల చుట్టూ, కే యఫ్ సీ ల చుట్టూ ప్రేమకధలు తిరిగితే.. గ్రామీణ ప్రేక్షకులకు చేరువయ్యేది ఎలా? సినిమా మొత్తం మల్టీప్లెక్స్ సంసృతి కనిపించింది. అబ్బాయిలు, అమ్మాయిల గోల తప్ప… తల్లిదండ్రుల భావాలు ఎక్కాడా చూపించలేదు.

సందీప్ కిషన్ లో… మంచి ఈజ్ వుంది. కొన్ని సార్లు పవన్ కళ్యాన్ ని ఇమిటేట్ చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ లోపం లేకపోతె… హీ ఈజ్‌ పర్ఫెక్ట్. రేజీనా కూడా అంటే. ఇలియానా, జెనీలియా చాయలు కనిపించాయి. అక్కడక్కడా ఓవర్ యాక్షన్ చేసింది. కొన్ని లోటు పాట్లు సవరించుకుంటే… తెలుగు తెరకు మంచి కధానాయిక దొరికినట్టే. మిత్ర బృందం నటన బాగానే వుంది. తాగుబోతు రమేష్ పాత్ర శుద్ధ అనవసరం. ఇంతకాలానికి ఈ నటుడు తాగకుండా దర్శనమిచ్చాడు. మిక్కి సంగీతం, పాటలకు రచయిత అందించిన సాహిత్యం బాగున్నాయి. ఆర్ధవంతమైన పదాలు వినిపిస్తాయి. అది దర్శకుడి అభిరుచికి నిదర్శనం. కెమెరా పనితనం కుడా బాగుంది. స్వల్ప వనరులతోనే ఫ్రేమ్ లను అందంగా అమర్చేందుకు ప్రయత్నించారు.

ఏ క్లాస్ ప్రేక్షకులకు మాత్రమె పరిమితమైన సినిమా ఇది. మంచి సినిమా అంటే.. అందరూ చుసేవిధంగా మలచాలి అనే విషయం ప్రవీణ్ గుర్తుపెట్టుకుంటే మంచిది. తన టార్గెట్ మల్టీప్లెక్స్ మాత్రమే అయితే…. ఈ సినిమా రీచ్ అయినట్టే.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3/5                                                       – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.