రివ్యూ : తుపాకి

Thuppaki

గట్టిగానే పేలింది ‘తుపాకి’:

తారాగణం : విజయ్, కాజల్, అగర్వాల్, అక్షరగౌడ, జయరామ్, విద్యుత్ జమ్వాల్ తదితరులు
సంగీతం : హరీశ్ జయ్ రాజ్
ఛాయాగ్రహణం : సంతోష్ శివన్
నిర్మాత : శోభారాణి
కథ, మాటలు, దర్శకత్వం : మురుగదాస్
ఎలాంటి సినిమాకైనా కథ ప్రాణమని నమ్ముతారు. అది నిజం కూడా. అయితే మామూలు కథతో మ్యాజిక్ చేయాలంటే స్క్రీన్ ప్లే బలంగా ఉండాలి. నిజానికి ప్రేక్షకులు కూడా ఇప్పుడు కొత్త కథలు కోరుకోవడం లేదు. అది అత్యాశే అనే విషయం అర్థమైంది. రొటీన్ కథనే కొత్తగా చెబితే చాలు. మురుగదాస్ అదే చేశాడు. 80వ దశకం నుంచీ అరిగిపోయిన యాక్షన్ కథకు స్క్రీన్ ప్లేతో కొత్త కలర్ ఇచ్చాడు. దాంతో ‘తుపాకి’ కాస్త గట్టిగానే పేలింది. ‘గజిని’తో తన స్టామినాను చూపించిన ఈ దర్శకుడు ‘సెవెన్త్ సెన్స్’ తో నిరుత్సాహపరిచాడు. ఆ లోటు ‘తుపాకి’తో తీరిపోయినట్టే.

జగదీష్ (విజయ్) మిలట్రీ నుంచి సెలవుల కోసం ఇంటికొస్తాడు. ‘అబ్బాయి వయసు ముదిరిపోతుంది, ఎలాగైనా పెళ్లిచెయాలి…’ అని ఇంట్లోవాళ్ల తొందర. అందుకే…రైలు దిగీ దిగగానే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నిషా (కాజల్)ని చూస్తాడు. తొలుత నచ్చకపోయినా నిషా ప్రవర్తన, మాట తీరు చూసి ప్రేమలో పడిపోతాడు. ఒకరోజు బస్సు ప్రయాణంలో ఓ దొంగతనం జరుగుతుంది. ఆ చిన్ని సంఘటనతోనే ముంబై మహానగరంలో జరిగే ఓ కుట్ర గురించి భయంకరమైన నిజం తెలుస్తుంది. స్లీపింగ్ సెల్స్ పేరుతో అరాచకవాదులు విధ్వంసం సృష్టించడానికి సన్నద్ధం అవుతున్నారని అర్థమవుతుంది. ఈ కుట్ర నుంచి ముంబై నగరాన్ని ఎలా కాపాడాడు? అందుకోసం జగదీష్ ఎన్ని సాహసాలు చేశాడు? అనేదే సినిమా కథ.

యాక్షన్ నేపథ్యంలో సాగే ఇలాంటి కథల్ని చాలానే చూసుంటాం. ఉగ్రవాదం ప్రధానాంశంగా కూడా ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే అలాంటి కథనే చిక్కుముళ్లతో నడిపించి… మురుగదాస్ మార్కులు కొట్టేశాడు. బస్సులో దొంగతనం ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచీ కథలో సీరియస్ నెస్ బయటపడుతుంది. ప్రతి సన్నివేశం చాలా పకడ్బందీగా రాసుకొన్నాడు. నాయకుడు, ప్రతినాయకుడూ ఇద్దరూ తెలివైనవాళ్లే. ఇద్దరూ ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. దాంతో… థియేటర్ లో ప్రేక్షకుడికీ అదో పజిల్ లా అనిపిస్తుంది. ఇంట్రవెల్ బ్యాంగ్… దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. పన్నెండు స్లీపింగ్ సెల్స్ ని మట్టుపెట్టడానికి పన్నెండు మంది సైనికులను హీరో రంగంలోకి దింపడం..భలే ఆలోచన. విశ్రాంతి తరవాత జోరు కాస్త తగ్గినా.. కిడ్నాప్ ఉదంతం మళ్లీ సినిమాకి జీవం తీసుకొచ్చింది.

‘దుర్మార్గులు ఓ చెడ్డపని చేయడానికి ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధమైనప్పుడు, మంచివాడు ఓ మంచి పని కోసం ప్రాణాలు కోల్పోవడంలో తప్పులేదు’ అనే పాయింట్ చుట్టూ అల్లుకొన్న కథ ఇది. మురుగదాస్ కథల్లో ప్రేమ అనే ఎలిమెంట్ ని చాలా కొత్తగా చూపిస్తుంటారు. ఈ సినిమాలోనూ దాన్ని విడిచిపెట్టలేదు. విజయ్-కాజల్ ల మధ్య ట్రాక్ విడిగా బాగానే ఉన్నా, కథకు కాస్త ఇబ్బంది కలిగించినట్టే అనిపిస్తుంటుంది. కథ సీరియస్ గా సాగుతున్నప్పుడు పాట కోసం కాజల్ ఎంట్రీ ఇస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అది తప్పు కాకపోయినా…సినిమా మూడ్ ని దెబ్బతీసింది. సాధారణంగా డబ్బింగ్ సినిమాల్లో వినోదం కాస్త ‘అతి’గా ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చు. గొప్పగా నవ్వించకపోయినా..పర్వాలేదనిపించారు.

విజయ్ కి తెలుగులో మార్కెట్ లేదు. ఈ హీరో సినిమా అంటే అంత క్రేజ్ కూడా లేదు. అందుకే విజయ్ పాత్రని రిసీవ్ చేసుకోవడానికి తెలుగు ప్రేక్షకులకు కాస్త సమయం పడుతుంది. ఎప్పుడైతే జగదీష్ గా ఆయన సీరియస్ యాక్షన్ లోకి దిగారో అప్పటి నుంచీ… విజయ్ ని ఫాలో అయిపోతాం. విజయ్ నటన చూస్తే కాసేపు కమల్ హాసన్, ఇంకాసేపు రజనీకాంత్ కనిపిస్తుంటారు. కాజల్ నటన ఓకే. ప్రతి నాయక పాత్రధారి చాలా సెటిల్డ్ గా నటించాడు. సాంకేతిక పరంగా యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించిన విధానం బాగుంది. హరీశ్ జయరాజ్ పాటల్లో మెలోడీ ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఆ మృదుత్వం కనిపించలేదు. నిజానికి పాటలు ఈ సినిమాకి పెద్ద మైనస్. ఒక్క పాట కూడా చెవులకు చేరదు. మిగితా సాంకేతిక బృందం దర్శకుడికి మంచి సహకారం అందించింది. మిలట్రీ గొప్పదనం చూపించిన సినిమా ఇది. చాలా సంభాషణలు మిలట్రీ పై గౌరవాన్ని పెంచేలా ఉన్నాయి. కథకు ఏం కావాలో అది చేస్తే.. ఏ సినిమా అయినా సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తుంది. ఎక్స్ ట్రాల జోలికి వెళ్లకుండా ఎవరి పరిధిలో వాళ్లుండాలి. ‘తుపాకి’ టీమ్ అదే చేసింది. మురుగదాస్ లోని నైపుణ్యం మరోసారి బయటపెట్టిన సినిమా ఇది.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3/5                                                       – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.