” వేరే పనేం లేదా షర్మిలా….? “

వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తన పాదయాత్రలో అన్నీ అబద్ధాలే మాట్లాడుతోందని, చంద్రబాబును విమర్శించటమేటమే పనిగా పెట్టుకున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి అన్నారు. గురువారం నాడిక్కడి ఎన్.టి.ఆర్. ట్రస్ట్ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ” ఆనాడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి, ఓదార్పు యాత్రలో జగన్, నిన్న వై.ఎస్.విజయమ్మ, నేడు షర్మిల అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా చేసిన ఆరోపణలే మళ్లీ మళ్లీ చేస్తూ ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో 4 వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చిలకపలుకులు పలుకుతున్న షర్మిల తన తండ్రి హయాంలో 14 వేల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న విషయం మరచిపోయారు. వై.ఎస్. అసమర్ధ విధానాలు, పాలన వల్లనే రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం నెలకొంది. రైతులు, పారిశ్రామిక వర్గాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బెంగుళూరు లో వుండి వచ్చిన షర్మిల ఎవరో రాసిచ్చిన అసత్య సమాచారాన్ని చదువుతోంది. ఆమె చెప్పేవి ప్రజలు నమ్ముతారని భావిస్తే అది అవివేకం అవుతుంది. ” అని శోభా హైమవతి అన్నారు.