జగన్ గూటికి… పూరి ‘జగన్’!

తెలుగు మిర్చి చెప్పింది…. అక్షరం పొల్లు పోలేదు. ‘పూరి జగన్.. జగన్ మనిషా?’ అని కొన్ని రోజుల క్రిందట ఇచ్చిన విశ్లేషనాత్మక వివరణ (http://telugumirchi.com/te/is-puri-jagan-jagans-man/)  ఈ రోజు నిజమయ్యింది. జగన్ అడుగులకు మడుగులు వత్తుతూ… జగన్ పిలుపు కోసం కళ్ళు కాయలు కాచేలా ‘పూరి జగన్’ కుటుంబం ఎదురు చూస్తోందని తెలుగు మిర్చి ఆనాడే చెప్పింది. వై యస్ జగన్ కుటుంబంపై తన సానుభూతిని, అభిమానాన్ని తెలియపరచడానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని ఓ ఆయుధంలా పూరి వాడుకున్నాడని తెలుగు మిర్చి కొద్ది రోజుల క్రిందట సంశయం వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే నిజమయ్యింది. పూరి జగన్నాద్ కుటుంబం జగన్ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది.

వై యస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీకి ఎప్పటినుంచో సినీ గ్లామర్ కొరత. సినిమా రంగం నుంచి వెళ్లి ఆ పార్టీకి అండగా నిలబడినవాళ్ళు ఇప్పటి వరకూ లేరనే చెప్పాలి. మరో వైపు చిరంజీవి పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్స్ కి… కావలసినంత గ్లామర్ దొరికింది. తెలుగుదేశం కి మాత్రం సినీ గ్లామర్ కావలసినంత వుంది. అందుకే 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ పార్టీ సినీ గ్లామర్ సమీకరణాల్లో పడింది. ఎప్పటినుంచో పూరి జగన్నాద్…. జగన్ కి చేరువకావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయన జీవిత కధ ఆధారంగా ఓ సినిమా తీయాలని భావించారు. ‘రాజశేఖరరెడ్డి’ అని నామకరణం కూడా చేసారు. అందులో రాజశేఖర్ ని కధానాయకుడిగా ఎంచుకున్నారు. మరెందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. సినిమా ప్లాన్ విజయవంతం కాకపోయినా… జగన్ దృష్టి పూరి పై పడింది. జగన్ సోదరుడు గణేష్ తెలుగుదేశం పార్టీ జండా మోసినవాడే. జగన్ పార్టీ స్థాపించడంతో అటువైపు దూకారు. జగన్ పాదయాత్రలో భాగంగా పూరి స్వగ్రామం బీకే పల్లి వెళ్ళారు. అప్పటినుంచి జగన్ తో పూరి జగన్నాద్ కుటుంబ స్నేహానికి బీజం పడింది.

ఉప ఎన్నికల ప్రచారంలోవిజయలక్ష్మి, షర్మిల బీకే పల్లి వెళ్ళినప్పుడు వాళ్ళ బస… పూరి ఇంట్లోనే. పూరి జగన్నాధ్ ఇంట్లో జరిగిన ఓణీల పండక్కి జగన్ అతిధిగా వచ్చారు. ఆ తరవాత కూడా జగన్ చాలా సందర్భాల్లో వై యస్ కుటుంబం పై తన అభిమానాన్ని ప్రకటించుకున్నారు. “నేను ఇప్పటివరకూ కేవలం 5 సార్లు మాత్రమె దిన పత్రిక చదివాను. వై యస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చివరిసారిగా న్యూస్ పేపర్ చదివాను. ఆ తరవాత నుంచి ఇప్పటివరకూ ముట్టుకోలేదు” అని స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ‘… రాంబాబు’ సినిమా ద్వారా పూరి కి మరో అవకాశం దొరికింది. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర.. దానికి పెట్టిన పేరు వై యస్ ని పోలి వుంటుంది. అంతే కాదు.. వై యస్ పాదయాత్ర గొప్పదనాన్ని కుడా అందులో ఉటంకించారు. రాజశేఖర్ రెడ్డి ప్రధాన రాజకీయ శత్రువు… చంద్రబాబు నాయుడి ని విమర్శించడం పరాకాష్ట. ఈ సినిమా కేవలం రాజశేఖర రెడ్డి ని హీరోగా చూపించడానికి, తెలంగాణాపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి సాకుగా తీసాడని… చిత్ర సీమలో పెద్ద దుమారమే రేగింది. అవన్నీ ఊహాగానాలు కాదనే విషయం క్రమంగా రాష్ట్ర ప్రజలకు బోధ పడుతోంది.

2014 ఎన్నికలలో జగన్ పార్టీ తరపున పూరి కుటుంబం ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలూ వున్నాయి. పూరి తమ్ముడు గణేష్ కి నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం. అందుకోసం గణేష్ ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దాని కంటే పూరి భార్య లావణ్య కు అనకాపల్లి యం.పీ సీటు ఇస్తే మంచిదని జగన్ పార్టీ భావిస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కాపు సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం అధికం. వారికి గాలం వేయాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన పూరి కుటుంబాన్ని రంగం లోకి దింపడం మంచిదని ఆ పార్టీ భావిస్తోంది. చివరి నిమిషాల్లో స్వయంగా పూరి జగన్నాద్ రంగంలోకి దిగినా షాక్ కి గురి కావలసిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లోనే కాదు…. రాజకీయాల్లోనూ ఏదైనా జరగొచ్చు. మొత్తమ్మీద అనకాపల్లిపై జగన్ పార్టీ ముందస్తు దృష్టి పెడుతోంది. దానికి… పూరి జగన్నాద్ సినీ ఇమేజ్ ని అస్త్రంగా వాడుతోంది. మరి… ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే… కొన్నాళ్ళు నిరీక్షించాల్సిందే.