రివ్యూ : దేవరాయ

ఫలించని ఫ్యాంటసీ  దేవరాయ
తారాగణం : శ్రీకాంత్, విదీష, మీనాక్షీ దీక్షిత్, ఎమ్మెస్ నారాయణ, జీవా, రంగనాథ్, శివాజీ రాజా, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం : చక్రి
నిర్మాతలు : నాని కృష్ణ, కిరణ్ జక్కంశెట్టి
దర్శకత్వం : నాని కృష్ణ

సోషియో ఫ్యాంటసీ మన దర్శకులకు బాగా అచ్చొచ్చిన ఫార్ములా, కావల్సినంత వినోదం పండించడానికీ, గ్రాఫిక్ మాయాజాలం చూపించడానికి ఇలాంటి కథల్లోనే అవకాశం దక్కుతుంది. కాస్తంత మెలోడ్రామా జోడిస్తే చాలు సినిమా సేఫ్ జోన్ లో పడిపోయినట్టే. అప్పుడప్పుడూ దర్శకులు ఇలాంటి ప్రయోగాలకు పూనుకొంటారు. అయితే.. ఫ్యాంటసీ కథను తెరపై ఆవిష్కరించడం అనుకొన్నంత సులభం కాదు. లెక్క ఎక్కడ తప్పినా మొదటికే మోసం వస్తుంది. అనుభవం ఉన్న దర్శకులు కూడా చాలా సార్లు బోల్తా పడుతుంటారు. ఇక ఇది కొత్త దర్శకులకు కత్తిమీద సామే! ఆ బాధ్యత తొలి సినిమాతోనే తన భుజాలపై వేసుకొన్నాడు నాని కృష్ణ. కుటుంబ కథాచిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ కు… శ్రీకృష్ణదేవరాయ పాత్ర అప్పగించాడు! ఆ సినిమానే ‘దేవరాయ’. మరి నానికృష్ణ తన ఆలోచనను తెరపై అందంగా తీసుకురాగలిగాడా? శ్రీకాంత్ ఇమేజ్ దానికి ఎంత వరకూ తోడ్పడింది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లిపోవలసిందే.

అమలాపురంలో దొరబాబు (శ్రీకాంత్) భలే ఫేమస్‌. అతడిని ఆకట్టుకొనే అంశాలు రెండే రెండు. ఒకటి కోక… రెండోది పేక. ఓ తొట్టి గ్యాంగును వెనకేసుకొని కనిపించిన అమ్మాయినల్లా తన చెంతకు రప్పించుకొంటాడు. తరతరాలుగా వస్తున్న ఆస్తిని వినోదాలకు, విలాసాలకు ఖర్చుచేస్తుంటాడు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన అమ్మాయి (విదీష) ను చూసి మనసు పారేసుకొంటాడు. ఎలాగైనా సరే…. శారీరకంగా అనుభవించాలనుకొంటాడు. కానీ… ఆ అమ్మాయి దొరబాబుని మనస్పూర్తిగా ప్రేమిస్తుంది. ‘పెళ్లికి ముందు ఎలాగున్నా ఫర్లేదు గానీ, ఆ తరవాత రాముడిలా ఉంటే చాలు’ అంటుంది. ఆ మాటలతో దొరబాబులోనూ మార్పు వస్తుంది. కానీ అమ్మాయి తండ్రి (రంగనాథ్) ఈ పెళ్లికి ఒప్పుకోడు. జల్సా రాయుడికి తన కూతురిని ఇచ్చి పెళ్లిచేయనంటాడు. మరోవైపు పురాతనశాఖకు గోదావరి తీరంలో కొన్ని వస్తువులు దొరకుతాయి. అవి శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటివని తెలుస్తుంది. ఆ వస్తువులతో పాటు ఓ పుస్తకం కూడా లభిస్తుంది. అందులోని లిపి దేవనాగరి. ఆ లిపి తెలిసింది రంగనాథ్ ఒక్కడికే. అందుకే పురావస్తు శాఖ రంగనాథ్ సహాయం తీసుకుంటుంది. ఆ పుస్తకంలో కొన్ని నిజాలు బయటపడతాయి. అవేంటి? వాటికీ దొరబాబుకీ సంబంధం ఏమిటి? దొరబాబు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడా లేదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

కథ సూక్ష్మంగా తెలుసుకుంటే ఉన్న ఆసక్తి.. తెరపై చూస్తున్నపుడు ఉండదు. కారణం… అమలాపురంలో దొరబాబు ఎపిసోడ్ మొత్తం బీసీ కాలం నాటి వ్యవహారంలా కనిపిస్తుంటుంది. రాజేంద్రప్రసాద్ “మైనర్‌ రాజా”ని తలపిస్తుంది. రంగుల చొక్కా, మెడలో పులిగోరు, వెనుక గొడుగు పట్టే సేవకుడు….పది మంది స్నేహితుల బృందం…ఇదీ అమలాపురం దొరబాబు సెటప్. దర్శకుడు ఇంకా ఎక్కడున్నాడో?! ఒక్కసారి పల్లెటూరుకు వెళ్లి చూడండి. ఇలాంటి వాతావరణం ఎక్కడా కనిపించదు. ఇరవై ఏళ్ల క్రితపు దృశ్యాల్ని ఇప్పుడు చూపిస్తే ఎలా?! పైగా ఆ ఊర్లో అమ్మాయిలంతా దొరబాబు కౌగిట్లో నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చూపించారు. ప్రథమార్థంలో ఆసక్తి కలిగించే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ లేదు. దొరబాబు స్నేహితుల బృందం మధ్య మంచి వినోదం పండించే ఆస్కారం ఉంది. కానీ ఆ విషయాన్ని దర్శకుడు మర్చిపోయాడు.

‘ఈగ’ సినిమా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సినిమా మొదలవ్వగానే వెనుక ‘నాన్నా కథ చెప్పవూ’ అనే గొంతు వినిపిస్తుంది. ఇక్కడా అదే తంతు. ‘నానీ..మంచి కథ చెబుతానన్నావ్. రొటీన్ కథలొద్దు. వైరైటీగా చెప్పు’ అంటూ శ్రీకాంత్ గొంతు వినిపిస్తుంది. అంటే ఓం ప్రదమైన సన్నివేశమే కాపీ అన్నమాట. కథానాయిక విదీష పాత్ర చిత్రీకరణ కూడా అంతంత మాత్రమే. ఆమెకంటే గ్రూప్ డాన్సర్లే బాగున్నారనిపించింది. సినిమాలో కాస్త ఆసక్తికరమైన అంశం ఏదైనా ఉందంటే… అది శ్రీకృష్ణదేవరాయలు ఏపిసోడ్ మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే కథకు అదే ప్రాణం. కానీ అక్కడా నానికృష్ణ మెప్పించలేకపోయాడు. శ్రీకృష్ణదేవరాయలుగా శ్రీకాంత్ నటన ఫర్వాలేదనిపించే స్థాయిలోఉంది. ఎన్టీఆర్ సంభాషణలను అనుకరించే ప్రయత్నం చేశాడు. కొన్ని పదాలు తప్పుగా పలికినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అది సంభాషణల రచయిత తప్పిదమో, శ్రీకాంతే సరిగా పలకలేకపోయాడో తెలీదు. మీనాక్షీ దీక్షిత్ కూడా చేసిందేమీ లేదు. హావభావాలు శూన్యం. గ్రాఫిక్స్ విషయంలో కాస్త శ్రద్ధపెట్టినట్టు కనిపిస్తుంది. అయితే అక్కర్లేని విషయాలకు గ్రాఫిక్స్ జోడించారు. ఉన్నంతలో శ్రీకాంత్ నటన ఆకట్టుకొంటుంది. దొరబాబుగా అల్లరి చేశాడు. దేవరాయగా హుందాగా కనిపించాడు.

దర్శకుడు చిన్నచిన్న విషయాలను పట్టించుకోలేదు. దేవరాయల కాలంలో గుర్రాలపై సైన్యం వస్తుంటే… వెనక కరెంటు స్థంభాలు కనిపిస్తాయి. గుడి ధ్వంసం చేయడానికి వెళ్ళిన రౌడీల బృందం చేతిలో సుత్తి, కొడవలి మాత్రమే కనిపిస్తాయి. అంటే వాటితో పురాతనమైన గుడిని రాత్రికి రాత్రే నేలమట్టం చేద్దాం అనుకున్నారా?! దొరబాబు శరీరంలోకి దేవరాయ ఆత్మ ప్రవేశించింది… అనే విషయం థియేటర్లో ప్రేక్షకులకే తెలీదు. సీనులో ఉన్న రంగనాద్‌, శివాజీరాజాలకు అంత తొందరగా ఎలా అర్థమైంది? ఆత్మత్యాగం చేస్తేనే విగ్రహ ప్రతిష్ట సాధ్యం అవుతుంది అని చెప్పారు. కానీ విగ్రహ ప్రతిష్ట జరిగినా దొరబాబు ఎలా బ్రతికాడు? ఇలా రాసుకుంటూ పోతే… ఈ సినిమాలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. అసలు శ్రీకృష్ణదేవరాయల చరిత్రను చూపించవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఎంత కల్పితం అనుకున్నా… దేవరాయల వారు ఓ నర్తకిని మోహించి ఆమె కోసం గుడి కట్టేందుకు సిద్ధమైనవాడిగా చూపించడం ఎంతవరకూ సబబు? !

సాంకేతిక వర్గం గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. పాతకథకు చక్రి పాత బాణీలనే అందించాడు. శ్రీకాంత్‌ కెరీర్‌ లోనే భారీ బడ్జెట్‌ చిత్రమిది. అయితే అందుకు తగిన ఫలితం దక్కుతుందా? అనేది అనుమానమే!

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2.5/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.