రివ్యూ: ‘గజరాజు’

కనువిందు చేసిన ‘గజరాజు’

Gajaraju 2

  • తారాగణం: విక్రం ప్రభు, లక్ష్మీ మీనన్, తంబి రామయ్య తదితరులు.
  • సంగీతం: ఇమామ్
  • ఛాయాగ్రహణం: సుకుమార్
  • నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, రమేష్ బాబు
  • దర్శకత్వం: ప్రభు సాల్మన్

Gajarajuతెలుగు దర్శకులు గ్లామర్ చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. మనకెప్పుడూ తెర అంతా అందంగా కనిపించాలి. హీరోయిన్ మేకప్ డబ్బాలో ముంచి తేల్చినట్టు ఉండాలి. హీరో వస్తూ వస్తూ వంద మందిని ఒంటి చేత్తో అవతల పారేయాలి. లేదంటే హీరోయిజం పండదని గాభరా పడిపోతారు. ఈ సూత్రాలకు విరుద్ధంగా ఓ సినిమా వచ్చిందంటే… అది ఖచ్చితంగా డబ్బింగ్ బొమ్మే అయ్యుండాలి. తమిళ దర్శకులను పొగిడేయడం కాదుగాని…. వాళ్ళు కథకి ఇచ్చిన ప్రాధాన్యం.. మరిదేనికీ ఇవ్వరు. దేనికీ రాజీ పడరు. అందుకే… వాళ్ళ సినిమాలు కాస్త స్లో గా…. ఇంకాస్త నసగా కనిపిస్తాయి. కాస్త ఓపిక తెచ్చుకుని చూస్తే గానీ వాళ్ళ భావాలు అర్ధం కావు. సహనంతో, సినిమాపై ప్రేమ…. అంతకు మించి… “ఈ దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో చూద్దాం” అనే కోరికతో చుస్తే… తప్పకుండా ఆ పనితనానికి జోహార్లు అర్పించాల్సిందే. అలాంటి సినిమానే ‘గజరాజు’. సృజనాత్మక దర్శకుడు ప్రభు సాల్మన్ మెగా ఫోన్ పట్టిన ఈ చిత్రంతో ప్రభు కుమారుడు విక్రం ప్రభు హీరోగా రంగ ప్రవేశం చేశారు. ‘గజరాజు’ ఎలాంటి కధ? ఇందులో మన తెలుగు ప్రేక్షకులకి నచ్చే అంశాలు ఏమిటి? ఈ విషయాల్లోకి వెళ్తే….

Gajaraju 3అది గిరిజన ప్రాంతం…. దేవగిరి. అడవికి సమీపంలో వుంటుంది. ఆ గూడెంలో కొన్ని కట్టుబాట్లు వుంటాయి. ప్రభుత్వ సహాయం తీసుకోరు. ఎవరి మీదా ఆధార పడరు. ఆ గూడెం అమ్మాయికి, అక్కడి అబ్బాయితోనే మనువు చేస్తారు. ఆ గూడెం కి ఓ సమస్య. కోతల సమయంలో అడవిలోంచి కపాలి అనే ఓ ఏనుగు వచ్చి… పంటలను నాశనం చేస్తుంటుంది. అడ్డమొచ్చిన వారిని దారుణంగా చంపేస్తుంది. ఏనుగు వల్ల గూడెం ప్రజలకు కంటిమీద కునుకు వుండదు. ఆ కారణంతో గూడెం ప్రజలను అక్కడినుంచి ప్రభుత్వం ఖాళీ చేయించాలని తెలుస్తుంది. ఆ గూడెం పెద్ద (తంబి రామయ్య). ఎలాగైనా సరే… ఏనుగు బారి నుంచి తనవాళ్ళని కాపాడాలని భావిస్తాడు. ఎలాంటి ఏనుగుని తరిమి కొట్టాలంటే ‘గుమ్కీ’ ఏనుగుల వల్లే అవుతుంది. అయితే.. అందుకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. అలాంటి శిక్షణ ఏమీ లేని… ‘మాణిక్యం’ ఆ గూడెంలోకి అడుగు పెడుతుంది. అదంటే బోపన్న(విక్రం ప్రభు) కి ప్రాణం. అతనికి తల్లీ, తండ్రీ లేరు. చిన్నప్పటి నుంచీ మాణిక్యం తోనే పెరిగాడు. మాణిక్యం ని జాతరలో ఊరేగిస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటాడు. ఓసారి అనుకోని పరిస్థితిలో గుమ్కీ ఏనుగు అని చెప్పి… మాణిక్యాన్ని ఆ గూడెం కి తీసుకెళ్తాడు. అత్యంత ప్రమాదకరమైన కపాలి ఏనుగుకి ధీటుగా మాణిక్యం నిలబడిందా? తాను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఏనుగుని బోపన్న ఎందుకు కపాలి మీద ప్రయోగించాలని చూసాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే గజరాజు చూడాల్సిందే.

Gajaraju 1‘మైనా’ అనే అందమైన ప్రేమకావ్యం ఆవిష్కరించి… తమిళ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రభు సాల్మన్. నిజ జీవితానికి దగ్గరగా వుండే కథలను ఎంచుకుంటాడు. ఈసారీ… తన దారిలోనే వెళ్ళాడు. ఓ గూడెంలో సాగే ప్రేమకథ ఇది. కాస్త ఎడ్వెంచర్ మేళవించాడు. కధకు తగిన లొకేషన్లలోనే సినిమా తెరకెక్కించాడు. నావెల్టీ వున్న కథ ఇది. మన తెలుగు సినిమాల్లో ఇలాంటి నేపథ్యాలు ఆశించలేం. అలాంటి లొకేషన్లను చూడడం కుడా కష్టమే! దట్టమైన అడవి, పారే జలపాతాలు.. కొండలూ, వాగులూ…. అన్నీ కలగలిపి ఈ సినిమాని ఓ అందమైన దృశ్య కావ్యం లా మలిచాడు దర్శకుడు. ఓ మంచి ఏనుగుకీ, ఓ చెడ్డ ఏనుగుకీ మధ్య జరిగే పోరాటం ఇది. ఈ మధ్యలో ఓ ప్రేమకధ మేళవించాడు. నేపధ్య సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. తెరపై, వెనుక… సాంకేతిక సొగసులు కనిపించాయి.

Gajaraju-telugu-movie-stills_009ఓ వారసుడి తొలి చిత్రం అనగానే తెలుగులో నానా బిల్డప్ ఇస్తారు. ఫైటింగులు, డాన్సులకు అవకాశం వుండే కధలను ఎంచుకుంటారు. అయితే విక్రం ప్రభు…. వాటి గురించి పట్టించుకోకుండా కేవలం కథను మాత్రమే నమ్మాడు. నటుడిగా నిరూపించుకునే ప్రయత్నంలో తొలి అడుగు దిగ్విజయంగా వేసాడు. కధానాయిక చాలా క్యూట్ గా కనిపించింది. హీరో మేనమామ వినోదం పండించే బాధ్యత సక్రమంగా నెరవేర్చాడు. తెలుగు ప్రేక్షకులు మెచ్చే మాస్ మసాలా అంశాలు ఏమీ ఈ సినిమాలో వుండవు. పతాక సన్నివేశాలు కుడా మన టేస్ట్ కి దూరంగా వుంటాయి. పైగా తమిళంలో యాంటీ సెంటిమెంట్ ఎక్కువ జోడిస్తారు. అక్కడ క్లైమాక్స్ లో నాలుగైదు పీనుగలు లేవక పొతే వాళ్లకు తృప్తి వుండదు. ‘గజరాజు’ కధ కుడా విషాదాంతమే. ఈ ముగింపు తెలుగు ప్రేక్షకులకు రుచించక పోవచ్చు. కధానాయకుడు తన ప్రేమకోసం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఏనుగుని బలి పెట్టడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్న మెదులుతుంది. ‘మదం ఎక్కింది నీకు కాదు… నాకు’ అని… చివర్లో హీరో పలికే సంభాషణ అందుకు సమాధానంగా వినిపిస్తుంది. ఏనుగుల మధ్య పోరు కంటే… ప్రేమ కధే ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు, సంభాషణలు కుడా ఈ సినిమాపై కాస్త ఆసక్తిని తగ్గిస్తాయి. ప్రకృతి రమణీయత చూడాలనుకుంటే.. కెమెరామెన్ ప్రతిభ, నటీ నటుల సహజ నటన చూడాలంటే…. ఈ సినిమా కి వెళ్ళండి!

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2.75/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here For ‘ Gajaraju’ English Review