రివ్యూ: ఎటో వెళ్ళిపోయింది మనసు

ప్రేమికులకు మాత్రమే… ఎటో వెళ్ళిపోతుంది మనసు


తారాగణం : నాని, సమంత, కృష్ణుడు తదితరులు

సంగీతం : ఇళయరాజా
పాటలు : అనంత శ్రీరాం
మాటలు : కోన వెంకట్‌
నిర్మాత : సి.కళ్యాణ్‌
దర్శకత్వం : గౌతం మీనన్‌

కొంతమంది దర్శకులు కథల కోసం పెద్దగా కష్టపడరు. అసలు ఆ అవసరం లేదనుకుంటారు. కానీ… అందమైన సన్నివేశాలు పేర్చి ‘కథ లేదు’ అనే సంగతి ప్రేక్షకులు మర్చిపోయేలా చేయగలరు. అలాంటి దర్శకుల్లో గౌతమ్ మీనన్ దిట్టే. ప్రేమ అనే బ్రహ్మ పదార్థంలోతు, ఎత్తు, బరువూ తెలుసుకొంటే దాన్ని ఎలాగైనా, ఎన్నిసార్లయినా, అంతే అందంగా, సుకుమారంగా, రసరమ్యంగా తెరపైకి తీసుకురావచ్చు. గౌతమ్ కి ప్రేమ పై కాస్త ప్రేమ ఎక్కువ. అందుకే ఆ కథనే అటు తిప్పి, ఇటు తిప్పి చూపిస్తుంటారు. ఆ దారిలోనే వచ్చిన మరో కథ…’ఏటో వెళ్లిపోయింది మనసు’

కథలోకి వెళ్దాం…! సారీ…ఈ సినిమాలో కథెక్కడ ఉందో ఎంతవెదికినా కనిపించదు. ఒ అమ్మాయి, అబ్బాయి మ ధ్య ఉండే ఇగోలు, అపార్థాలు తప్ప, అయినా చెప్పుకోవాలి కాబట్టి అందులోనే కథ వెతుక్కుంటే… అరుణ్ (నాని), నిత్య (సమంత) చిన్నప్పటి నుంచీ స్నేహితులు. ఒకే కాలనీలో ఉంటారు. ఆటపాటలతో వారి బాల్యం సరదాగా గడిచిపోతుంటుంది. అక్కడే ఓ చిన్న గొడవ. ఓ రోజు అరుణ్ తనతో ఆడుకోవడానికి రాలేదని నిత్య అలుగుతుంది. ఆ తరవాత వాళ్లు ఊరొదిలి వెళ్లిపోతారు. ఇంటర్ లో మళ్లీ కల్లుసుకొంటారు. ఆ చిననాటి సంగతుల్ని గుర్తు తెచ్చుకొని పాత స్నేహాన్ని ప్రేమ పుంత తొక్కించేలోగా మరో గొడవ. మళ్లీ విడిపోతారు. 22వ యేట ముచ్చటగా మూడోసారి కలుస్తారు. ఈసారి మాత్రం ప్రేమ మైకంలో మునిగిపోతారు. అరుణ్ కి ఇంట్లో బాధ్యతలు ఎక్కువవుతాయి. పై చదువుల కోసం కేరళ వెళ్దామనుకొంటాడు. అది నిత్యకి ఇష్టం ఉండదు. దాంతో మళ్లీ గొడవ. ఇద్దరూ దూరమైపోతారు. ఐదేళ్ల తరవాత నిత్యను వెతుక్కొంటూ వెళ్తాడు అరుణ్. అప్పుడైమైంది? ఇద్దరూ కలుసుకొన్నారా? వయసు పెరిగిన తరవాత ప్రేమలో వారికొచ్చిన పరిపక్వత ఏమిటి? ఈ జంట ఎప్పుడు, ఎలా కలిసింది.. అనేదే ‘ఏటోవెళ్లిపోయింది మనసు’ సినిమా.

పరిచయాలు, ప్రేమలు, అపార్థాలు, అవి తొలగి మళ్లీ కలుసుకోవడాలు, మళ్లీ విడిపోవడం… ఇదీ ఈ సినిమా కథ. ఎనిమిదేళ్ల వయసు నుంచి 28 యేళ్ల వయసు వరకూ ఓ ప్రేమ జంటలో ఎలాంటి మార్పులొచ్చాయో తెరపై చూపించాలను కొన్నారు గౌతమ్ మీనన్. సన్నివేశాలను పేర్చుకోవడంలో, అందంగా మలచడంలో మణిరత్నంని ఆదర్శంగా తీసుకొనే ఈ దర్శకుడు ఈసారీ అదే పంథా పాటించారు. అమ్మాయిని దొంగ చాటుగా చూడడం, ఆమె ప్రతి కదలికనూ జాగ్రత్తగా గమనించడం వయసులోనిఅబ్బాయిలు…అందులోనూ ప్రేమలో పడినవాళ్లు అనునిత్యం చేసేదే. అందుకే ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు ‘మావే’ అని యువతరం వెంటనే తమ సొంతం చేసుకొంటారు. ప్రారంభ సన్నివేశాలు… హాయిగానే సాగిపోతాయి. అరుణ్, నిత్యలు విడిపోయే కారణాలు చాలా సిల్లీగానే అనిపిస్తాయి. కానీ… అలాంటి కారణాలతోనే, ఇంచుమించు అవే కారణాలతో దూరమయ్యే ప్రేమికులు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. లేదంటే అరుణ్, నిత్యల్లో మనమే ఒకరు కావచ్చు. అందరి కథనీ తెరపైకి తీసుకురావడంతో సన్నివేశాల్లో నవ్యత లేకపోయినా, సహజత్వం కనిపిస్తుంది.

కథ ఎక్కువగా అరుణ్, నిత్యలపైనే నడుస్తుంది. మూడు దశల్లో వారి హావభావాలు, వేషధారణ చాలా సహజంగా అనిపించింది. నాని, సమంతలు నటించినట్టు ఎక్కడా అనిపించదు. పాత్రలోకి తేలిగ్గా వెళ్లిపోయి… వాటికి సజీవ రూపం తీసుకొచ్చారు. స్నేహితుడిగా కృష్ణుడు నవ్వుల్ని పంచుతాడు. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవలసింది…ఇళయరాజా సంగీతం గురించి. సినిమా పడిపోతోంది… అనుకొన్న ప్రతిసారీ తన పాటతో మళ్లీ నిలబెట్టారు. ‘లాయిలాయి…’, ‘ఎంతెంత దూరం’ పాటలు గుర్తుండిపోతాయి. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ సినిమా కథకు సూచికగా క(వి)నిపించింది. సినిమా ప్రారంభం కాగానే ఒకదాని వెంట మరొకటి రెండు పాటలొచ్చేస్తాయి. అయినా విసుగురాదు. కార ణం… అది ఇళయరాజా కాబట్టి. గౌతమ్ మీనన్ సినిమాలకు ఛాయాగ్రహణం ప్రాణం. ఈసారీ ఆ తరహా పనితీరు
కనిపించింది.

సహజత్వం పేరుతో… గౌతమ్ మీనన్ చాలా ఇబ్బంది పెట్టాడు. చాలా సన్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. ప్రత్యేకించి కథంటూ లేదు కాబట్టి, చూసిన సన్నివేశమే మరోసారి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇళయరాజా సంగీతం కాబట్టి సరిపోయింది. లేదంటే…ఆ సాగదీతకు భరించడం ఇప్పటి ప్రేక్షకులకు సాధ్యం కాదు. విశ్రాంతి ముందొచ్చే సన్నివేశం దాదాపుగా ౧౦ నిమిషాలకుపైనే ఉంటుంది. టీవీ సీరియల్ కోసం కథ రాసుకొని సినిమా తీసేశాడేమో అనే ఫీలింగ్ వస్తుంది. ‘ఎంత తిట్టుకుంటారు, దీనికి అంతే లేదా?’ అనే అనుమానం కూడా వస్తుంది. ద్వితీయార్థం కాస్త బెటరే. సన్నివేశాలు బాగానే ఉన్నాయి. కానీ వాటిలో ఆత్మ లోపించిన భావన. పతాక సన్నివేశాలు కూడా రొటీన్.

 దాదాపు ప్రతి ప్రేమకథా చిత్రమూ యువతరాన్ని టార్గెట్ చేస్తూ తీసేవే. ఈ సినిమా కూడా వాళ్లకి నచ్చే అవకాశాలున్నాయి. అయితే ఏ క్లాస్ కి మాత్రమే. వాళ్లూ కాస్త ఓపిగ్గా ఈ సినిమా చూస్తే, గౌతమ్ మీనన్ మనసుకి దగ్గరగా వెళ్లగలిగితే ఈ సినిమా చేరువవుతుంది. ప్రేమలో పడి ఉండకపోతే, దానిపై సదాభిప్రాయం లేకపోతే… ఈ సినిమాలో ఒక్కసన్నివేశం కూడా నచ్చదు. ఆల్రెడీ ప్రేమలో పడిన జంటైతే…. ఈ సినిమాలో మీ కథ కూడా ఉండొచ్చు. ఎంజాయ్ ద షో…!

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2.75/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here For ‘ Yeto Vellipoyindi Manasu’ English Review