రివ్యూ: ‘బస్ స్టాప్’

బూతుల మాటున నీతిబోధ… ‘బస్ స్టాప్’

  • నటీనటులు: ప్రిన్స్, దివ్య, రావూ రమేష్, రావిపల్లి రాంబాబు, సాయికుమార్ సంపన తదితరులు
  • సంగీతం: జే.బీ
  • చాయాగ్రహణం: సుదాకర్ రెడ్డి
  • కధ, మాటలు, దర్శకత్వం: మారుతి

తల్లిదండ్రులు బిడ్డలను ఎప్పుడూ.. తమ గుండెల్లో దాచుకోవాలని చూస్తారు. ఆ బంధం  పిల్లలకు  మాత్రం నిర్భంధంలా  అనిపిస్తుంది. యుక్త వయసులో వున్నప్పుడు మరీనూ. అందుకే… ఎప్పుడు రెక్కలొస్తాయా… ఎప్పుడు ఎగిరిపోదామా అనిపిస్తుంది. తగిన తోడు కనిపించగానే…. ఎదిగీ ఎదగని రెక్కలతో ఆకాశాన్ని తాకాలనుకుని మళ్ళీ నేలకు ఒరిగిపోతారు. తప్పు తెలుసుకునే లోగా రెక్కలు వుండవు. ఊహలు వుండవు. ఏ ధైర్యంతో ఎగరాలని చూసారో ఆ తోడూ వుండదు. కానీ అప్పటికీ తల్లిదండ్రులుంటారు. ‘బస్ స్టాప్’లో దర్శకుడు మారుతి చెప్పాలనుకున్నది ఇదే! తల్లిదండ్రుల ఆలోచనలు, పిల్లల మనస్తత్వాలు…  మధ్యలో ఓ చిన్న గీత వుంటుంది. ఆ గీత మద్యలో కూర్చుని… ఇద్దరి వైపూ మాట్లాడాలని చూసాడు దర్శకుడు. మరి అనుకున్న విషయం చెప్పడానికి మారుతి ఎంచుకున్న కధ ఎలా వుంది? ఆ కధ ఆవిష్కరించిన విధానం ఎలా వుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే గబగబా రివ్యూ లోకి వెళ్లిపోవలసిందే.

శ్రీను (ప్రిన్స్), శైలు (దివ్య) చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. పదోతరగతిలో ఉన్నప్పుడే వారి ప్రేమ చిగురిస్తుంది. అల్లు అర్జున్ సంతకం చేసిన వంద రూపాయల  కాగితంతో ఐస్ క్రీమ్ కొనుక్కుని తినేశాడు అనే కారణంతో…. శ్రీను ని వదిలి శైలు వెళ్ళిపోతుంది. మళ్ళీ నాలుగైదేళ్ళ  తరవాత …. కాలేజీ ఫైనల్ ఇయర్ లో కనిపిస్తుంది. అప్పటివరకు శైలు ఆలోచనలతో గడిపేస్తాడు శ్రీను. ముందు కాస్త బెట్టు చూపినా… ఆ తరవాత శ్రీను ప్రేమలో పడిపోతుంది. శైలూ కి అమ్మానాన్నలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి…. శ్రీను కోసం ఇంట్లో అబద్ధాలు  చెప్పడం మొదలుపెడుతుంది. మరోవైపు శ్రీను కి ముగ్గురు స్నేహితులు. ఒకోక్కరిదీ ఒక్కో ప్రేమ కధ. సెల్ లో సిమ్ములు మార్చినంత సులభంగా అమ్మాయిలను మారుస్తాడు ఒకడు. ఇంట్లో వస్తువులన్నీ తాకట్టుపెట్టి ప్రియురాలికి బహుమానాల ఎర వేస్తాడు ఇంకొకడు. ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడు తన గదికి తీసుకెల్దామా అని… గోతి కాడ నక్కలా కాపుకాచేది మరొకడు. వీళ్ళ ప్రేమకధలు ఏమయ్యాయి. రోజు రోజుకీ చేయి దాటిపోతున్న పిల్లలను చూస్తూ పెద్దలు పడిన వేదన ఏమిటి? శ్రీను, శైలు ఏమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానమే… ‘బస్ స్టాప్’.

ఇంతకు ముందు మారుతి ‘ఈ రోజుల్లో’ అనే ఓ చిన్న సినిమా తీసి… పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఆ కధ  కూడా యువతరాన్ని టార్గెట్ చేసి తీసిందే. మరోసారి అదే పంధాలో వెళ్ళిపోయాడు. మారుతి చెప్పాలనుకున్న విషయం మంచేదే. కానీ… ఆ విషయం చెప్పడానికి ఎంచుకున్న దారి మాత్రం సరైనది కాదు. కుర్ర కారు వెర్రి మొర్రి చేష్టలు… ఇది వరకు చాలా సినిమాల్లో చుసేసాం. ఈ సినిమాతో అది పరాకాష్ట కి చేరింది. షకీలా టైపు సినిమాలు ఎవరైనా చూస్తే…. అందులో చూపించాల్సిన బూతు అంతా చూపించేసి చివరకు శుభం కార్డు వేసేటప్పుడు ‘నాయనా ఇదంతా తప్పు’ అని జాతిని ఉద్ధరించే సందేశం ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. ‘బస్ స్టాప్’ కూడా ఆ కోవకు చెందిన కధే. ఈ ఒక రీలు సందేశాన్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు… అంతకు ముందు 13 రీళ్ల పాటు చూపించిన బూతే… కనిపిస్తుంది.

సెల్ ఫోన్, సిం కార్డ్, బ్యాటింగ్, పిచ్, బంతులు, టిఫిన్…ఇలా తరచుగా మనం మాట్లాడుకునే మాటల్లో ఇన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయా అనిపిస్తుంది. చాలా  సీన్లు డబుల్ మీనింగ్ సంభాషణలతో నింపేశారు. వాటిలో కొన్ని అమ్మాయిల చేత కూడా పలికించారు. కన్నతండ్రి తన కూతురికి  ‘హెచ్ పీ’ లాప్ టాప్ ఇస్తూ  ‘హెచ్ పీ… హెచ్ పీ’ అంటూ.. ఆ పదాన్ని ‘వేరే’ అర్ధంలో పదే పదే పలికించారు. “బ్యాటు వుంది కదా అని భుజాన వేసుకుని వెళ్ళిపోయి  ప్రతి పిచ్ పైనా ఆడేసావు. ఇప్పుడు ఏమయ్యింది? పిడి చేతికొచ్చింది”, “ఇలాగే ఆడుతూ పోయావంటే.. నువ్వు భద్రంగా చూసుకునే నీ సెల్లు ఎందుకూ పనికిరాకుండా పోతుంది”, “….. అందుకే పిల్లలు ఏం చేసినా నోరూ ‘గుడ్డ’ ముసుకోవాలి”… ఇలా ఈ సినిమాలో వున్న డైలాగులన్నీ  రాస్తే అదో బూతు భారతం అవుతుంది. గుబురు మొక్కల పక్కన సరసాలు ఆడుకుంటున్న ఓ జంటను చూసి  “టిఫిన్స్ ఒక్కటేనా భోజనాలు కూడా కానిచ్చేసారా? అని  ఓ అమ్మాయి  అడుగుతుంది. “ఇప్పుడే మూట పై చెయ్యి వేసా… మీరొచ్చారు” అని ఆ అబ్బాయి సమాధానం చెబుతాడు.ఈ మాటలకు అర్ధం ఈ తరం కుర్ర కారుకి ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు.

నీతులు కూడా బూతులు మేళవించి చెబితేనే ఈ తరం చూస్తారు అని… మారుతి అనుకుంటే అది పొరపాటే. ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఎన్ని బూతులున్నాయి? ‘నువ్వేకావాలి’ లో డబుల్ మీనింగ్ డైలాగు ఒక్కదాన్ని పట్టుకోమనండి చూద్దాం.  యూత్ అంటే…. బూతు మాత్రమే అనుకుంటే… ఇంతకు మించిన ఆలోచనలు రావు. దర్శకుడిగా మారుతి విజన్ మంచేదే కావచ్చు. కానీ ప్రేక్షకులకు వాటిని చూపించే మార్గం మాతం ఇది కాదు. ‘ప్రియమైన అమ్మానాన్నలకు ఈ సినిమా అంకితం’ అని టైటిల్ కార్డులో వేసుకున్న మారుతి… అమ్మా నాన్నలతో చూసే సినిమాని మాత్రం తీయలేకపోయాడు.

నటీనటులు దాదాపుగా కొత్తవారే. ‘ఈ రోజుల్లో’ సినిమాలో కనిపించిన మొఖాలు ఈ సినిమాలో కొన్ని కనిపిస్తాయి. వారంతా తమ పరిధి మేరకు బాగానే చేసారు. తల్లి దండ్రుల నటన సహజంగా వుంది. ప్రిన్స్, దివ్య హీరో హీరోయిన్ అని చెప్పుకోలేం. నాలుగు జంటల్లో ఓ జంట అంతే. సాయికుమార్ పంపన నటన హుషారుగా వుంది. సంగీత పరంగా  “నీవల్లే నీవల్లే” పాట కొంతకాలం గుర్తుంటుంది. మిగతావన్నీ తెరపైన చూడడానికి బాగున్నాయి. సుధాకర్ రెడ్డి కి ఎక్కువ మార్కులు పడతాయి. 5డీ ని… ఆయన ఉపయోగించిన తీరు ప్రసంసనీయం. తెరపై ప్రతీ సన్నివేశం రంగుల హరివిల్లులా వుంటుంది. సంభాషణలు కుడా మారుతే రాసుకున్నారు. జల్లెడ పడితే… 80 శాతం బూతులే. మాతుతి ఇదే దారిలో వెళ్లి సినిమాలు తీస్తే… ఆయన ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాల  వరకే పరిమితమైపోయే ప్రమాదం వుంది.

గమనిక: కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా ఆడుతున్న చుట్టుపక్కలకి వెళ్ళకపోవడమే ఉత్తమం.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2.5/5                                                       – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.