రివ్యూ: సారొచ్చారు

saarocharu

ప్రేక్షకుల్ని ఫూల్స్‌ ని చేయడానికి… సారొచ్చారు

నటీనటులు : రవితేజ, కాజల్‌ అగర్వాల్‌, రిచా గంగోపాధ్యాయ, నారా రోహిత్‌, జయసుధ, చంద్రమోహన్‌ తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాత : అశ్వనీ దత్‌
దర్శకత్వం : పరశురాం (బుజ్జి)

sarocharu-5తెలుగు ప్రేక్షకులంటే చిన్నచూపేమో కొంతమంది దర్శకులకు. ఏం చెప్పినా చూస్తారులే….. అని అతి విశ్వాసం కూడా కావచ్చు. చూసిన కథే చూపించినా, కొత్త కథంటూ కాపీ కథల్ని ఆవిష్కరించినా, అంతా చూపించేసి ‘తూచ్… ఇదంతా ఉత్తినే. నిజం కాదు..’ అని ప్రేక్షకుల్ని వెర్రి బాగులవారిని చేసినా.. ‘భరిస్తారు’ అనుకొంటారు. ఎన్నిసార్లు తిప్పి కొట్టినా అదే కథను మళ్లీ మళ్లీ చూపిస్తుంటారు. ‘సారొచ్చారు’ కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. ‘మంచి ప్రేమ కథతో’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చినా… ఈ సార్ చెప్పేది రొటీన్ కథే అని నాలుగో సన్నివేశం నుంచి అర్థమైపోతుంది. సగం గడిచాక.. ఇది కాపీ కథ అనే అనుమానం వస్తుంది. ఇంకాసేపట్లో సినిమా ముగుస్తుంది అనగా.. ప్రేక్షకుల్ని దద్దమ్మలు చేసేందుకే ఈ సినిమా తీశాడనే నిజం రూఢీ అవుతుంది. ఇన్ని అనుమానాలు మేళవించిన ‘సారొచ్చారు’ సంగతేంటి? ఈ సారు చెప్పిన కథేంటి?

sarocharu-3సంధ్య (కాజల్) అమెరికాలో చదువుకుంటూ ఉంటుంది. ‘నేను చాలా అందగత్తెను, ఎవడైనా సరే, నా కాళ్లకింద నలిగిపోవాల్సిందే’ అనే భ్రమల్లో బతుకుతుంటుంది. తన అభిరుచులు, అలవాట్లూ కలిసిన వ్యక్తితోనే జీవితం పంచుకోవాలని ఆశపడుతుంది. ఈ ఆలోచనల్లో ఉండగా తన మనసుకి జిరాక్స్ తీసినట్టుండే కార్తీక్ (రవితేజ) కనిపిస్తాడు. సంధ్య తన మనసులో ఉన్న ప్రేమని కార్తీక్ ముందు రకరకాలుగ బయటపెడుతుంది. కానీ కార్తీక్ పట్టించుకోడు. ఈలోగా సంధ్య చదువు పూర్తయిపోతుంది. ఇండియా వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అదే సమయంలో కార్తీక్ కూడా ఇండియా బయల్దేరతాడు. ఇద్దరూ ఒకే విమానంలో పక్క పక్క సీట్లలో కూర్చుంటారు. మంచి సమయం చూసుకొని ‘ఐ లవ్ యూ కార్తీక్…’ అంటుంది సంధ్య. కానీ కార్తీక్.. ‘నాకు ఇది వరకే పెళ్లయిపోయింది’ అని చెబుతాడు. ఊటీలో తనకు పరిచయమైన వసు (రిచా గంగోపాధ్యాయ) గురించి చెబుతాడు. ఫ్లాష్ బ్యాక్ లో సీన్లు రింగు రింగు మంటూ ఒక్కొక్కటీ కళ్లముందు కదులుతాయి. తమ ప్రేమ ఎలా మొదలైంది. పెళ్లిపీటల వరకూ ఎలా చేరింది? విడమర్చి చెబుతాడు. ఇవన్నీ విని సంధ్య తట్టుకొందా? కార్తీక్ మనసులో సంధ్యకు ఉన్న స్థానమేంటి? ఇవన్నీ రెండో భాగం చూసి తెలుసుకోవాలి. సింగిల్ లైన్ ఆర్డరులో ఈ కథ చెబుతున్నప్పుడు ‘రొటీన్ గానే ఉంది కదా?’ అనుకొంటాం. చూస్తున్నప్పుడూ సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో అరవై సన్నివేశాలుంటాయి. నలభై సన్నివేశాలు చూపించేసి ‘ఇదంతా అబద్ధం. సరదాగా చెప్పిన కథ’ అంటే ఎలా ఉంటుంది. గంటన్నర వరకూ ఈ సోది భరిస్తున్న ప్రేక్షకుడికి ఒళ్ళు మండిపోదూ!? ‘డార్లింగ్’ సినిమాలో కరుణాకరనే లాగి లాగి… ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.

sarocharu-1స్ర్కీన్ ప్లేలో ఇదో ట్రిక్కు.. అని ఈతరం దర్శకులు భ్రమపడుతున్నారు. కానీ.. ప్రేక్షకుల ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారనే విషయం వారికి అర్థం కావడం లేదు. కథ లేనప్పుడే ఇలాంటి ట్రిక్కులపై ఆధారపడుతుంటారు. రవితేజ ‘హిట్’ అనే మాట విని చాలాకాలం అయ్యింది. కథల ఎంపికలో ఆయన చేస్తున్న నిర్లక్ష్యం… ఈ సినిమాలోనూ బయటపడింది. అదృష్టం కొద్దీ.. రవితేజ రొడ్డకొట్టుడు క్యారక్టరైజేషన్ ఈ సినిమాలో కనిపించలేదు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. చాలా వరకూ అండర్ ప్లే చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రవితేజ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కథ రాసుకొన్నారంటే నమ్మబుద్ధి కాదు. జగపతి బాబు ఏజ్ బార్ అయిపోయిందని.. రవితో లాగించేసినట్టు కనిపిస్తుంది. కాజల్ నటన్ బాగుంది. తొలి సగం… సినిమా కాస్త చూశామంటే కారణం కాజల్ నటన, దర్శకుడు రాసుకొన్న సంభాషణలే… తాను ప్రేమించిన అమ్మాయి మనసులో ఎవరున్నారో తెలుసుకొని.. వారితో పెళ్లిచేయించే ‘త్యాగమూర్తి’ క్యారెక్టరు ఇలాంటి కథలో కనిపిస్తుంటుంది. ఆ త్యాగమూర్తి పాత్రలో నారా రోహిత్ కనిపిస్తారు. హీరోగా సినిమాలు చేస్తూ… ఇలాంటి పాత్ర ఒప్పుకొన్నాడంటే గ్రేటే. ఎమ్మెస్ ఉన్నది కాసేపే అయినా.. ఆ పాత్ర బాగా పేలింది.

ravitejaఇక రిచా గురించి ఎంత చెప్పుకొన్నా ఎక్కువే. ‘నువ్వు కోపంగా ఉన్నప్పుడు నిన్ను అస్సలు చూళ్లేం…’ అంటాడో చోట రవితేజ… రిచాని ఉద్దేశించి ఆ మాట కొంచెమే కరెక్టు. ఎందుకంటే రిచాని ఈ సినిమాలో ఏ ఫ్రేములోనూ చూళ్లేం. కథానాయికగా ఆమెకు అవకాశాలు వస్తున్నాయంటే అదంతా ఆమె అదృష్టమే. ‘సారొచ్చారు’ అనే టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టారో అస్సలు అర్థం కాదు. ‘సోలో’ సినిమాతో తొలి విజయం సాధించి… ‘విషయం ఉన్న దర్శకుడు’ అనిపించుకొన్న పరశురామ్.. ఈసారి చాలా బలహీనమైన కథను ఎంచుకొన్నాడు. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాల్ని పండించాలనుకొన్నాడు. కానీ… సరైన బేస్ మెంట్ లేక అవన్నీ తేలిపోయాయి. దేవిశ్రీ ప్రసాద్ 51వ సినిమా ఇది. గత యాభై సినిమాల్లో పక్కన పడేసిన ట్యూన్లు ఈ సినిమాకి వాడుకొన్నట్టు అనిపిస్తుంది. దేవి మార్క్ ఎక్కడా వినిపించదు. నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టలేం. అయితే… వైజయంతీ మూవీస్ నుంచి రావల్సిన సినిమా కాదిది. బలహీనమైన కథను ఆ బ్యానర్ నుంచి ఊహించలేం. సగం తలనొప్పి ఉన్నవాళ్లు ఈ సినిమా చూడండి సంపూర్ణమవుతుంది.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2.5/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version

First look :

మాస్‌ మహారాజా రవితేజ, కాజల్‌ అగర్వాల్‌, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్‌ లో స్టార్‌ ప్రొడ్యూసర్‌  అశ్వినీదత్‌ నిర్మించిన “సారొచ్చారు” మొదటి షో ఇప్పుడే పూర్తయింది. రవితేజ తో ఇంతకు ముందు “ఆంజనేయులు” వంటి  ఎంటర్‌ టైనర్‌ అందించిన పరశురాం ఈ చిత్రానికి దర్శకుడు. మరి సినిమా ఎలా ఉందీ అంటే….

  • saarocharu-movie-latest-stills-1వైజాగ్‌ లో జరిగే ఓ ఛేజింగ్‌ సీన్‌ తో సినిమా మొదలవుతుంది. ఇందులో రవితేజ పేరు కార్తీక్‌.
  • వెరైటీగా ఈ సినిమాలో హీరో అట్టహాసం లేకుండా సింపుల్‌ ఎంట్రీ ఇస్తాడేంటో మరి. తన మార్కు పంఛ్‌ డైలాగ్స్‌ ఇందులో బాగానే ఉన్నాయి.
  • ఇటలీలో షూట్‌ చేసిన “మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌” పాట సినిమాలో వచ్చే ఫస్ట్‌ సాంగ్‌.
  • స్పెషల్‌ క్యారెక్టర్‌ ప్లే చేసిన నారా రోహిత్‌ ఇందులో సహజ నటి జయసుధ కు మేనల్లుడిగా కనిపిస్తారు.
  • కాజల్‌ పాత్ర పేరు సంధ్య. లవ్‌ ట్రాక్‌ కాజల్‌ తరపు నుండి ఉంది.
  • రవితేజను లవ్‌ లో పడెయ్యడానికి కాజల్‌ చేసే ప్రయత్నాలు బాగానే నవ్వులు పూయించాయి.
  • ఎమ్మెస్‌ నారాయణ వర్ధమాన కథారచయిత ప్లాటినం ప్రసాద్‌ పాత్రలో కామెడీ పండించాడు.
  • సినిమాలో రెండవ పాట “జగజగ జగదేకవీర”. యూరప్‌ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు.
  • రవితేజ చెప్పే ఓ న్యూస్‌ తో సినిమాలో కాజల్‌ తో పాటు చూసే ప్రేక్షకులకు కూడా షాక్‌…
  • రొటీన్‌ గా రవితేజ గతం చూపించాడు దర్శకుడు పరశురాం.
  • ఇదివరకే తెలిసినట్టుగా హీరో ఓ ఫుట్‌ బాల్‌ కోచ్‌ గా కనిపిస్తాడు. అక్కడ మరో హీరోయిన్‌ రిచా గంగోపాధ్యాయ ఎంట్రీ ఇస్తుంది.
  • రవితేజ, రిచా గంగోపాధ్యాయల మధ్య ప్రేమాయణం స్టార్ట్స్‌… రిచా తమ్ముడిగా మాస్టర్‌ భరత్‌ ఎంట్రీ…
  • రవితేజ, రిచాలపై మొదటి పాట.. “రచ్చ రంబోలా”.  ఈపాటను సెట్స్‌ లో గ్రాండ్‌ గా షూట్‌ చేశారు.
  • రవితేజకున్న పాట తర్వాత హీరో, విలన్‌ ల మధ్య భారీ ఫైట్‌ సీన్‌…
  • పంచ్‌ డైలాగ్‌ ” నేను ఒక్కసారి యాక్షన్‌ లోకి దిగితే అవతలి వారికి రియాక్షన్‌ కట్‌ చేసే టైం కూడా ఉండదు” … ఈ డైలాగ్‌ కి థియేటర్‌ లో అభిమానుల కేకలు, ఈలలు….
  • మరో ట్విస్ట్‌ తో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌…
  • ఓవరాల్‌ గా చూస్తే మొదటి అర్ధభాగం కాస్త కామెడి, కాస్త లవ్‌, కొంచెం యాక్షన్‌… రొటీన్‌ రవితేజ స్టైల్‌ లో సాగింది.
  • రిచా-రవితేజల  పై మరోపాట “గుస గుస” … దృశ్య చిత్రీకరణ పరంగా బాగుందని చెప్పుకోవచ్చు.
  • సినిమా గతం నుండి ప్రెజెంట్‌ కు వచ్చేసింది..
  • రవితేజ మార్క్‌ పైట్‌ సీన్‌ ఇంకొకటి… దాబాలో చిత్రీకరించారు.
  • ఉన్నట్టుండి “కాటుక కళ్ళు” పాట వచ్చేసింది. ఎందుకో, ఏమిటీ అర్థం కాదు.
  • కథలో క్లైమాక్స్‌ ట్విస్ట్‌.. నిజంగానే ఊహించని మలుపు అని చెప్పాలి..
  • మళ్లి నారా రోహిత్‌ ఎంట్రీ… పరుచూరి, చంద్రమోహన్‌ తదితరుల మధ్య ఫ్యామిలీ డ్రామా…
  • సినిమా అయిపోయింది… కొత్తగా ఏమీ అనిపించలేదు..

 

Click here for English Version