వి అంటే విక్టరీ… వి అంటే వెంకటేష్!

క్లాస్, మాస్, ఫ్యామిలీ… ఈ మూడు వర్గాల ప్రేక్షకులనూ ఏక కాలంలో మెప్పించడం ఏ అగ్ర హీరోకీ సాధ్యం కాలేదు. ఒకరిని కావాలనుకున్నప్పుడు, మరొకరిని దూరం చేసుకోవలసి వచ్చేది. ఈ ముగ్గురి చేతా ఒకే సినిమాలో సెహభాష్ అనిపించుకునే కిటుకు ఒక్క వెంకటేష్ కి మాత్రమే తెలిసింది. ఇది అతిశయోక్తితోనో, అత్యుత్యాహంతోనో చెబుతున్న మాటలు కావు. తెలుగు సినిమా చరిత్రను తిరగేసిన ఎవరికైనా, తెలుగు సినిమాలపై కనీస అవగాహన కలిగిన వారికీ సులభంగా అర్ధమయ్యే విషయం. మాస్ హీరో అనే సరికి ఇమేజ్ చట్రం లో ఎరుక్కోవలసి వస్తుంది. ఫలానా పాత్రలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ తో… కధలను ఎన్నుకోవలసి వస్తుంది. కానీ పాతికేళ్ళ నుంచి ఈ లెక్కలకు దూరంగా వున్నది వెంకటేష్ మాత్రమే. మాస్, క్లాస్, ఫ్యామిలీ డ్రామా, మల్టీ స్టారర్… ఎలా ఏ కధనయినా రాసుకోండి. న్యాయం చేయగలిగే హీరో…. వెంకీ ఒక్కడే. డిసెంబర్ 13 వెంకీ జన్మదినం. ఈ సందర్భంగా విజయాల వెంకటేష్ ప్రయాణాన్ని, పురోగతి నీ ఓ సారి రివైండ్ చేసుకుంటే..

‘విక్టరీ వెంకటేష్…’ అబిమానులంతా ఆయన్ని ముద్దుగా ఇలాగే పిలుచుకుంటారు. ఆ పేరు సార్ధకం చేయడానికి అహర్నిశలూ కష్టపడు తుంటారు వెంకటేష్. ‘మినిమం గ్యారెంటీ’ హీరోగా చిత్ర సీమలో ఆయనకు మంచి పేరుంది. అంటే… అయన సినిమాకి పెట్టుబడి తెరిగి తీసుకురావడం చాలా తేలిక అన్నమాట. ఈ ఖ్యాతి ఊరకే రాలేదు. కధల ఎంపికలో ఆయన తీసుకున్న జాగ్రత్తే.. ఆయనకూ, ఆయన నటించిన సినిమాలకూ శ్రీరామ రక్ష. ఒక నిర్మాత తనయుడిగా, మరో నిర్మాత తమ్ముడిగా పుట్టినందుకేమో… సాటి నిర్మాత యోగ క్షేమాలు ఆలోచిస్తారు. “బడ్జెట్ అదుపులో ఉంచుకోండి. ఖర్చులు తగ్గించుకోండి” అని నిర్మాతలకు సలహా ఇస్తారు వెంకటేష్.

కధానాయకుడిగా వెంకటేష్ ప్రయాణం ముందునుంచీ విభిన్నమే. ఎప్పుడూ ఒకే రకమైన కధలు ఎంచుకోలేదు. ‘చంటి’, ‘చినరాయుడు’, ‘గణేష్’,’సూర్య ఐ పి యస్”, ‘సుందరాకాండ’, ‘బొబ్బిలి రాజా’… ఇలా ప్రతీదీ విభిన్నమైన సినిమానే. తన బలాలు, బలహీనతలూ రెండు తెలిసిన వ్యక్తి. తనకు ఓ కధ నప్పదంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. తనకు నచ్చేతే ఏ భాష నుంచయినా కధ తీసుకుంటారు. అగ్ర హీరోల్లో రిమేక్ కధా చిత్రాలు ఎక్కువగా చేసింది వెంకటేష్ మాత్రమే . అందుకే ఆయన్ని ‘రీమేక్ రాజా’ అని పిలుచుకుంటారు. ‘చంటి’, ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘వసంతం’, ‘బాడీ గార్డ్’, ‘ఈనాడు’, ‘నాగవల్లి’… ఇలా చెప్పుకుంటూ పొతే… ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. దాదాపుగా అనీ హిట్టే. “రీమేక్ కధల్లో ఓ సౌలభ్యం వుంది. రిస్క్ తక్కువ. హిట్ సినిమాలోని మంచి విషయాలు తీసుకుని, వాటికి మరిన్ని మెరుగులు పెట్టి… మరింత మంచి సినిమాగా తీర్చి దిద్దవచ్చు” అని వెంకీ చెబుతున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ సినిమాని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకీతో పాటు యువ కధానాయకుడు రామ్ నటిస్తున్నారు.

మల్టీ స్టారర్ సినిమాలంటే వెంకీకి చాలా ఇష్టం. ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే… కొత్త కధలు వస్తాయనేది ఆయన అభిప్రాయం. చిరంజీవీ, బాలకృష్ణ, నాగార్జునలతో కలసి నటించాలని వెంకీ చాలాసార్లు భావించారు. అయితే.. కొన్ని కారణాల వాళ్ళ ఆ సినిమాలు పట్టాలేక్కలేదు. అయితే నవతరం తో సినిమాలు చేసే అవకాశం ఆయనకు దక్కింది. మహేష్ బాబు, వెంకటేష్ అన్నాదమ్ములుగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాపై యావత్ సినీ ప్రపంచం ద్రుష్టి పడింది. దాదాపు 25 ఏళ్ళ తరవాత తెలుగులో వస్తున్నా మల్టీ స్టారర్ సినిమా ఇదే. ఈ సంక్రాంతి కి ఈ సినిమా విడుదల కాబోతుంది. “ఈ సినిమా బాగా ఆడితే…. ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలు మరిన్ని వస్తాయి. రచయితలకు కొత్త కధలు రాసుకునే అవకాశం  దక్కుతుంది. మల్టీ స్టారర్ సినిమాలో ఎవరితో అయినా, ఎప్పుడయినా చేయడానికి నేను సిద్దం” అని వెంకీ చెబుతున్నారు. మరోవైపు ‘షాడో’ గా తన విశ్వరూపం చూపించడానికి సమాయాత్తం అవుతున్నారు. ఈ సినిమా కుడా పూర్తి కావచ్చింది. 2013 ఫిబ్రవరి లో ఈ సినిమా విడుదల కానుంది. ‘వివేకానంద’ గా కనిపించాలని వెంకటేష్ ఆశ పడుతున్నారు. ఇందుకు సంబంధించిన కధ కుడా సిద్ధం అయ్యింది.

కొత్త కధలకు, సరికొత్త ఆలోచనలకూ పెద్ద పీట వేస్తూ… ప్రేక్షకులను వినోద సాగరంలో ముంచెత్తుతున్న వెంకీ…. రాబోయే రోజుల్లో కుడా ఇలాగే దూసుకు పోవాలని, నవతరానికి స్ఫూర్తి కలిగించాలని తెలుగు మిర్చి మనసారా కోరుకుంటుంది. వెంకీ… మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే….