2012… పవన్‌… మహేష్… ఎవరు నంబర్‌ వన్‌..? !

2012.. వెళ్ళిపోతోంది. ఎప్పట్లాగే గుంపులు, గుంపులుగా సినిమాలొచ్చాయి. స్టార్లు చక్రం తిప్పారు. అగ్ర దర్శకులు హవా చూపించారు. కథానాయికలూ మెరిశారు. హిట్లొచ్చాయి. అంచనాలు పెంచుకున్న సినిమాలు నిండా మునిగాయి. మహేష్ బాబు, రాం చరణ్‌, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌… ఈ హీరోలకు మాంచి విజయాలు దక్కాయి. అయితే నంబర్‌ వన్‌ సింహాసనం మాత్రం ఇద్దరితో దోబూచులాడుతోంది. ఒకరు మహేష్ బాబు.. ఇంకొకరు పవన్‌ కళ్యాణ్‌! వీరిద్దరి సినిమాలు బాక్సాఫీసును కొల్లగొట్టాయి. వారి స్టామినాను మరోసారి రుచి చూపించాయి. ఇంతకీ 2012 ఎవరిది? పవన్‌ కళ్యాణ్‌, మహేష్ బాబు… ఈ ఏడాది నంబర్‌ వన్‌ సింహాసనంలో కూర్చునే అర్హత వీరిద్దరిలో ఎవరికి ఉంది???

“దూకుడు”, “బిజినెస్‌ మేన్‌”.. వరుసగా రెండు విజయాలు దక్కించుకొన్నాడు ప్రిన్స్. 2011లో దూకుడుతో బాక్సాఫీస్‌ బాద్‌ షాగా నిరూపించుకొన్నాడు మహేష్. ఆ సినిమా కమర్షియల్‌ గానే కాదు, క్రిటిక్స్‌ పరంగానూ మెప్పించింది. నంది అవార్డులు సాధించింది. ఉత్తమ నటుడు అవార్డ్‌ మహేష్ చెంతకు వెళ్ళింది. ఆ దూకుడు ఈ ఏడాది బిజినెస్‌ మేన్‌ లోనూ చూపించాడు మహేష్. “నీ కన్నా తోపు ఎవడూ లేడిక్కడ..” అంటూ మహేష్ బాబు పలికిన ప్రతీ మాటా.. ఫ్యాన్స్ చేత విజిల్స్‌ వేయించింది.  ఈ రెండు సినిమాలూ కలిపి దాదాపు రూ.120 కోట్లు  వసూలు చేశాయి. ఒక అగ్ర హీరో వరుసగా రెండు భారీ విజయాలు తన ఖాతాలో వేసుకోవడం ఓ రికార్డ్‌! ఈ ఏడాది మహేష్ నటిస్తున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా విడుదలయ్యేదే. డిసెంబర్‌ 21న రావలసిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వెనక్కి వెళ్ళింది. ఆ సినిమా కూడా వచ్చుంటే నిస్సందేహంగా ప్రిన్స్ మహేష్ బాబు… సింహాసనాన్ని అధిష్టించేవాడు. ప్రిన్స్ కి పోటీ ఉండేదే కాదు.

నెంబర్‌ వన్‌ కిరీటం కోసం మరోస్టార్‌… మహేష్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు… అతనే పవర్‌ స్టార్‌… పవన్‌ కళ్యాణ్‌! ” నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది..” అంటూ పవన్‌ “గబ్బర్‌ సింగ్‌”లో రెచ్చిపోయాడు. పవన్‌ నుంచి ఓ సాదాసీదా సినిమా వస్తేనే దాన్ని అందలం ఎక్కిస్తారు అభిమానులు. మరి సూపర్‌ హిట్‌ వస్తే ఊరుకుంటారా? హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తారు. అనధికార లెక్కల ప్రకారం “గబ్బర్‌ సింగ్‌”… “మగధీర” రికార్డులను క్రాస్‌ చేసేసింది. దాదాపు రూ.80కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఎప్పటి నుంచో పవన్‌ విజృంభణ కోసం ఆశగా ఎదురుచూస్తున్న మెగాఫ్యాన్స్ కి వినోదాల విందు భోజనం వడ్డించింది “గబ్బర్‌ సింగ్‌” సినిమా. పవన్‌ స్టైల్‌, స్టామినా రెండూ చూపించి… “నెంబర్‌ వన్‌” రేసులోకి వచ్చాడు. ఈ ఏడాదే “కెమెరా మేన్‌ గంగతో రాంబాబు” సినిమా కూడా వచ్చింది. తెలంగాణా అంశంపై రాజుకున్న విమర్శలను పక్కన పెడితే.. “… రాంబాబు” కూడా తన హవా బాగానే చూపించాడు. నైజాంలో ప్రతికూల పరిస్థితుల్లో సైతం వసూళ్ళు రాబట్టుకున్నాడు. తనకు పట్టున్న ఆంధ్రాలో విజయపథం వైపు నడిచిందీ చిత్రం. ఇటీవలే “… రాంబాబు” చిత్రం 50 రోజుల మార్కు కూడా దాటింది. “… రాంబాబు” గన్‌ షాట్‌ గా హిట్‌ అయితే నెంబర్‌ వన్‌ పవన్‌ అయ్యేవాడే!

రికార్డుల గురించి, అవార్డుల గురించి పట్టించుకోని ఇద్దరే ఇద్దరు అగ్రహీరోలు పవన్‌ కళ్యాణ్‌, మహేష్ బాబు! ఎంత పెద్ద విజయం అందుకున్నా… అతిగా స్పందించకుండా, విజయాన్ని తలకెక్కించుకోకుండా… మరుసటి సినిమా పనిలో పడిపోతారు. అలాంటి స్వభావం ఉన్న ఈ స్టార్లిద్దరూ నంబర్‌ వన్‌ కి నూటికి నూరుపాళ్ళూ అర్హులే. తెలుగు సినిమా కెపాసిటీని పెంచిన హీరోలు వీరు. ఎవరి అభిమాన గణం వారికుంది. ఒకరిని మరొకరితో పోల్చుకోలేం. ఎందుకంటే ఇద్దరిదీ భిన్నమైన దారి. కానీ… ప్రేక్షకులకు, అభిమానులకూ వినోదం పంచివ్వడానికే అహర్నిశలూ కష్టపడుతుంటారు. ఆ తపనే వారిని విజయపథం వైపు దూసుకుపోయేలా చేస్తోంది. నంబర్‌ వన్‌ ఎవరు? అనే చర్చ ఎప్పుడు వచ్చినా వీరిద్దరినీ ప్రస్తావించకుండా ఉండలేం. అందుకే 2012 వీరిద్దరిదీనూ. వచ్చే ఏడాది కూడా ఇంతే జోష్ చూపించాలని, పరిశ్రమకు మరిన్ని విజయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది తెలుగుమిర్చి డాట్‌ కాం (telugumirchi.com).