ఎఫ్.డి.సి. సింహాసనం ఎవరికి……?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టి.వి.,నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రోజు రోజుకూ పోటీ పెరుగుతోంది. ఎవరికీ వారు ఈ పదవికోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ప్రస్తుతం ఈ చైర్మన్ పదవి సీటులో ఎవరూ లేరు. మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులో మాత్రం ఒక ఐ.ఎ.ఎస్. అధికారి వున్నారు. ఖాళీగా వున్న ఈ పదవికోసం తమ అభ్యర్ధి పేరును ప్రతిపాదిస్తూ పరిశ్రమ లోని పెద్దలు తమ తమ లాబీయింగ్‌ ల ద్వారా తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతంలో ఈ పదవిని అధిష్టించిన వారిలో జమునా రమణారావు, ఎమ్.ఎస్. రెడ్డి, మురళీమోహన్, పద్మాలయ ఆదిశేషగిరి రావు  తదితరులు వున్నారు. ఎంతో కాలంగా ఈ కుర్చీ ఖాళీగానే వుంది.కాగా ప్రస్తుతం ఈ పదవిని ఆశిస్తున్న వారిలో పూర్ణోదయ ఎంటర్ ప్రైజెస్  అధినేత ఏడిద నాగేశ్వర రావు, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ వున్నట్టు తెలిసింది.

ఏడిద నాగేశ్వరరావు పేరును కేంద్రమంత్రి చిరంజీవి ముందుకు వచ్చి గట్టిగా ప్రపోజ్‌ చేసారు. చిరంజీవి హీరోగా ఏడిద గతంలో కొన్ని సినిమాలను నిర్మించారు కూడా… తెలుగు సినిమా రంగంలో సీనియర్ నిర్మాత గా వున్న ఏడిద ఈ పదవి కి అన్నివిధాలా అర్హుడని చిరంజీవి పట్టుబడుతున్నారట. వివాదరహితుడిగా  పేరున్న ఏడిద ఈ పదవికి వన్నె తెస్తారని చిరంజీవి అభిప్రాయపడుతున్నారని తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి అప్పట్లో అల్లు అరవింద్ పేరును గట్టిగా సిఫారసు చేసి భంగపడ్డ చిరంజీవి ఈ సారి ఎలాగైనా సరే ఎఫ్.డి.సి. చైర్మన్ పదవిని తమ వారికే ఇప్పించాలనే గట్టి పట్టుదలతో వున్నట్టు తెలిసింది.

కాగా ఫిలించాంబర్ అధ్యక్షుడుగా ప్రస్తుతం కొనసాగుతున్న తమ్మారెడ్డి భరద్వాజ కు రాష్ట్రమంత్రి డి.కే.అరుణ తన పూర్తి మద్దతును అందిస్తున్నట్టు సమాచారం. సినిమాటోగ్రఫీ మంత్రిగా వున్న అరుణ ఈ పదవికి భరద్వాజ పేరును గట్టిగా ప్రతిపాదిస్తున్నట్టు భోగట్టా. అరుణ భర్త, కాంగ్రెస్ నాయకుడు భరతసింహారెడ్డి , భరద్వాజ ఇద్దరూ మంచి స్నేహితులు… కలిసి చదువుకున్నారు కూడా… నంది అవార్డులనుంచి సినిమాలకు సంబంధించిన ప్రతి కమిటి ఎంపిక సమయంలోనూ అరుణ… భరద్వాజ సలహాలను తీసుకుంటారనే మాటలు సినిమా పరిశ్రమలో వినిపిస్తూ వుంటాయి.

మరోపక్క ఈ పదవిని మరోమారు దక్కించుకోవాలని హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు, కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ఆశీస్సులు ఆదిశేషగిరిరావు కు పుష్కలంగా వున్నాయి. ఇదిలా వుండగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ విషయమై చాలా గుంభనంగా వున్నారని, ఇప్పటిదాకా ఆయన ఎవరికీ ఈ మేరకు హామీ ఇవ్వలేదని పరిశ్రమలోని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.