రివ్యూ: యమహో… యమః

ఇదో రకమైన నరకం ‘యమహో యమః’

నటీనటులు: సాయిరామ్ శంకర్, శ్రీహరి, పార్వతీ మెల్టన్, సంజన, యమ్మెస్ నారాయణ, రమాప్రభ, తాగుబోతు రమేష్ తదితరులు

సంగీతం: మహతి

నిర్మాత: జి.విజయ్ కుమార్

దర్శకత్వం: జితేందర్

ఒబామా కధను చెప్పాలనుకుంటే… అమెరికా చూపించాలి. ముషారఫ్ గాధ చూపాలంటే పాకిస్థాన్ లో వున్న ఫీలింగ్ కలిగించాలి. అలాగే.. యముడి కధ కాబట్టి ప్రేక్షకులకు నరకం ట్రైల్ పార్ట్ అనుభవపూర్వకంగా తెలిసొచ్చేలా చేయాలని దర్శకుడు జితేందర్ అనుకుని ఉంటాడు. అందుకే… టికెట్ కొన్న పాపానికి అర్ధం పర్ధం లేని సన్నివేశాలతో శూల దండనానికి గురిచేశాడు. ఖూనీ రాగాలతో కుంభీపాకం, నవ్వు రాని వినోదం పేరిట… సల సల కాగే నూనెలో వేయించాడు. మొత్తం మీద… ప్రేక్షకుల చేత పాప ప్రక్షాళన చేయించాడు. 2012 డిసెంబర్ 21న ప్రపంచం అంతమైపోతుందంట. అంతకు ఓ వారం రోజుల ముందే… దాని సంకేతం ఎలా వుంటుందో రుచి చూపించడానికి తీసిన సినిమానే ‘యమహో యమః’. పోస్టరు పై శ్రీహరి పోజు, పార్వతీ మెల్టన్ అందచందాలు చూసి, మురిసిపోయి ఆ ‘నరక కూపం’లోకి అడుగు పెట్టేముందు.. కాస్త ఆ చిత్ర ‘హింస’ ఎలా ఉంటుందో… తెలుసుకోండి.

హీరో గారి పేరు బాలు( సాయిరామ్ శంకర్). యమ భక్తుడు. పనీ పాటా వుండదు. కానీ అనాధలను చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తుంటాడు. బామ్మ (రమాప్రభ) బాలుని అమెరికా పంపించాలని తహతహ లాడిపోతుంది. ఎలాగోలా అమెరికా వెళ్తాడు. అక్కడ నిషా(సంజన) ని రక్షించి, ఆమె ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. నిషా ఖాళీగా వున్నప్పుడు బాలుతో డ్యూయెట్లు పాడుతూ తరించి పోతుంది. బాలుయే మరీ బేవార్సుగా చూసే సరికి…. యముడు (శ్రీహరి)కి తెగ ఇన్సల్టింగ్ గా వుంటుంది. ఒక్క గానొక్క భక్తుడు… అలా అల్లరిగా తిరిగితే తన పరువు ఏమైపోతుంది.. ? అందుకే ఇది ఇజ్జత్ కీ సవాల్ అనుకుని.. చిత్ర గుప్తుడితో భూలోకం వచ్చేస్తాడు. అమెరికా లో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఓ దారిలో పెడదామనుకుంటాడు. వీరిద్దరి పగటి వేషాలను చూసి… తన బాపతే అనుకుని నిషా ఇంట్లోనే చోటు ఇస్తాడు బాలు. అతని భక్తి, ప్రేమ, చూసి చలించిపోతాడు యముడు. ఎంత ప్రయత్నించినా దారిలోకి తీసుకురాలేక పోతాడు. ప్రేమలో పడితే తప్ప భాధ్యత తెలియదని.. మన్మధ బాణం వేయించి మరీ బాలు మనసులో ప్రేమ మొలకెత్తేలా చేస్తాడు. ఓసారి బాలు ప్రేమను కాపాడిన స్వప్న (పార్వతీ మెల్టన్)ని ప్రేమిస్తాడు. ఈలోగా చిత్రగుప్తుడికి స్వప్న వల్లే… బాలుకి ప్రాణగండం ఉందనే నిజం తెలుస్తుంది. మరి బాలుని యముడు రక్షించాడా? అసలింతకీ బాలు యమ భక్తుడు గా మారడానికి కారణం ఏమిటి? స్వప్న గతం ఏమిటి? ఇవన్నీ కలిపితే ‘యమహో యమః’ సినిమా.

యమ కాన్సెప్ట్ పై అటు చిత్ర పరిశ్రమకీ, ఇటు సినీ అభిమానులకీ గౌరవం వుంది. యముడి కధలు సేఫ్ జోన్ అని నిర్మాతలు, ఈ సినిమాకి వెళ్తే టికెట్ రేటు గిట్టుబాటు అవుతుందని సగటు ప్రేక్షకుడు నమ్మకం పెట్టుకుంటారు. వాటిని భూస్తాపితం చేయడానికి పూనుకుని మరీ ఈ సినిమా తీశారా? అనిపిస్తుంది. అటు వినోదం లేక, ఇటు ఆసక్తి కరమైన సన్నివేశాలూ లేక… శ్రీకారం నుంచే ఈ కధ నేలను విడిచి నింగి పై సాము చేస్తుంటుంది. హీరో గారి ఎంట్రీ నే అత్యంత భయంకరంగా వుంటుంది. మహా నగరం లోకి వచ్చిన పులి బారి నుంచి ఓ పాపాయిని కాపాడి… ఆ పులిపై స్వారీ చేసి… ఓ పాట పాడి, ఆ పులి చేతే స్టెప్పులు వేయించి… ఇంత క్రియేటివిటీ మన తెలుగు సినిమాల్లోనే సాద్యం అని నిరూపించాడు. అమెరికా ఎలా వెళ్తాడో , ఎందుకు వెళ్తాడో ఎవరికీ అంతు పట్టదు. అక్కడ నిషా పాత్ర మరీ అధ్వానం. ఆమెకు ఒంటిపై బట్ట నిలవడం కష్టంగా కనిపిస్తుంది. పార్వతీ మెల్టన్ హీరోయినా? అనే అనుమానం వేస్తుంది. తొలి భాగంలో ఆమె రెండంటే రెండు సార్లే కనిపిస్తుంది. ఆ కొంత సేపయినా పార్వతీ ముఖారవిందాన్ని చూడడం కష్టమే!

యముడి గెటప్ శ్రీహరి కి సూట్ అయ్యిందా అనే విషయం పక్కన పెట్టండి. ఆ వేషధారణలో శ్రీహరే చాలా అసహనానికి లోనయినట్టు కనిపించింది. భూలోకం వచ్చిన తరవాత శ్రీహరి విగ్గు, ఆ పాత్రకు తొడిగిన దుస్తులు, ఆయనకు వేసిన మేకప్… చాలా కంపరం కొడతాయి. అసలు యముడు భూలోకానికి వచ్చిన కారణం బలంగా లేదు. విశ్రాంతి తరవాత కధ రాయలసీమ కు వెళుతుంది. అక్కడ ‘మర్యాద రామన్న’ సినిమా మరో సారి చూపించారు. హీరో పగలు కనిపిస్తే… చంపుకోవచ్చు. రాత్రికి మాత్రం ఏమీ చేయకూడదు.. అదీ కాన్సెప్ట్!

నటనా పరంగా ఎవరి గురించీ చెప్పుకోవడానికి లేదు. సాయిరామ్ కధల విషయంలో మరింత జాగ్రత్తగా వుండాలి. పార్వతీ మెల్టన్ ని తీసుకునే టప్పుడు దర్శక నిర్మాతలు జాగ్రత్తగా వుండాలి. వామ్మో.. ఆమె కంటే జూనియర్ ఆర్టిస్ట్ లే కావలసినన్ని హావభావాలు పలికిస్తారు. సంజనకి ఇంకా అవకాశాలు దక్కుతున్నాయంటే అది ఆమె అదృష్టమే. మహతి పాటల వల్ల సినిమా కంటే… ప్రేక్షకులకే కాస్త మేలు జరిగింది. పాట వచ్చినప్పుడలా ఆ గోల భరించలేక బయటకు వచ్చి కాస్త రిలాక్స్ అవ్వొచ్చు. నేపధ్య సంగీతం ఎలా ఇవ్వకూడదో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. పరమ నీరసమైన కథను, మరింత… నీరసంగా తీస్తే ఎలావుంటుందో… ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

 

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here For ‘ Yamaho Yamaha’ English Review