మరోసారి వివాదం లో చిక్కుకున్న ఐకియా స్టోర్

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రారంభమైన అతి పెద్ద స్టోర్ ఐకియా. దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ స్టోరును ప్రారంభించారు. హైటెక్‌ సిటీకి సమీపంలో 13 ఎకరాల స్థలంలో స్టోర్‌ ఏర్పాటు చేసారు. ఈ స్టోర్ లో ఇంట్లో ఉపయోగపడే చిన్న సామాగ్రితో పాటు అందుబాటులో ఉన్న ఫర్నీచర్‌, గృహాలంకణ వంటి 7500 వస్తువులు అందుబాటులో ఉంటాయి. అలాంటి గొప్ప స్టోర్ ఇప్పుడు తరుచు వివాదాల్లో చిక్కుకుంటుంది.

మూడు వారాల కిందట వెజ్ బిర్యానీలో గొంగళిపురుగు కనిపించి వార్తల్లో హాట్ టాపిక్ కాగా , తాజాగా ఓ చాక్లెట్ కేక్‌లో పురుగు రావడం మరోసారి కలకలం రేపింది. కిశోర్ అనే వ్యక్తి ఈ నెల 12న తన కూతురితో కలిసి హైటెక్‌సిటీలోని ఐకియా స్టోర్‌కు వెళ్లాడు. అక్కడి ఫుడ్ కోర్ట్‌లో కూతురు అడిగిందని చాక్లెట్‌ కేక్‌ని ఆర్డర్‌ ఇచ్చారు. తీరా కేక్‌ని సర్వ్ చేశాక చూస్తే అప్పటికే అందులో ఓ పురుగు ఉంది. ఇది గమనించిన కిశోర్.. చాక్లెట్‌ మీద ఉన్న పురుగు ఫొటోలతో పాటు బిల్లు రిసీప్ట్‌ను జత చేస్తూ ట్విట్ చేశాడు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

జీహెచ్ఎంసీ అధికారులు ఐకియా స్టోర్ యాజమాన్యానికి 5 వేల రూపాయల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అంత పెద్ద స్టోర్ లో ఇలాంటివి జరగడం పట్ల అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.