టోల్ ఫీజు కట్టమన్నందుకు… ఎమ్మెల్యే వీరంగం !

ప్రజా ప్రతినిధులకు చట్టాలు చుట్టాలు అని చెబుతుంటారు. ఇలా ఫీలైన ఓ ఎమ్మెల్యే టోల్ ఫీజు కట్టమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయారు. కేరళలోని పూంజార్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పీసీ జార్జ్‌.. మంగళవారం అర్ధరాత్రి కొచ్చి నుంచి త్రిశూర్‌కు ఓ ఖరీదైన కారులో ప్రయాణిస్తున్నారు. ఆయన వాహనం పాలియెక్కర టోల్‌ ప్లాజా వద్దకు రాగానే అక్కడ సిబ్బంది టోల్‌ ఫీజు కట్టమని ఆయన వాహనాన్ని ఆపారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. తన అనుచరులతో దిగి వచ్చి స్టాప్‌ బారియర్‌ను విరగ్గొట్టారు.

సీసీటీవీ పుటేజీలో నమోదైన ఈ ఘటన తాలుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే కాస్త విచిత్రంగా స్పందించారు. ఎమ్మెల్యే బోర్డు ఉన్నప్పటికీ నన్ను రుసుం కట్టాలని అడిగారు. చాలాసేపు ఎదురు చూశాను. అప్పటికే చాలా ఆలస్యమయిందన్నారు.

ఈ ఎమ్మెల్యేకు గొడవలకు దిగడం ఇదేమీ కొత్తకాదు. గతంలో ఆర్డర్‌ చేసిన వెంటనే భోజనం తెచ్చివ్వలేదని క్యాంటిన్‌ సిబ్బందిపై చేయి చేసుకొన్నారు. గతేడాది ఫిబ్రవరిలో వివాదాస్పదమైంది. భూమి విషయంలో వ్యాపారులతో గొడవకు దిగారు. తుపాకీ పేలుస్తూ నినాదాలు చేయడంతో సంచలనానికి తెరతీశారు. ఎమ్మెల్యే టోల్ గేట్ ఘటనపై ఇప్పటికీ వరకు పోలీసులు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం.