అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ మెట్రో మార్గం వచ్చేస్తుందోయ్


హైదరాబాద్ వాసులకు మరో శుభవార్త ఎప్పుడెప్పుడా అని నగరవాసులు ఎదురుచూస్తున్న అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ మార్గం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 24వతేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించడానికి ముహర్తం పెట్టారు. దీన్ని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్‌, సీఎస్‌ జోషి, హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్.రెడ్డి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ బుధవారం రాజ్‌భవన్లో గవర్నర్‌ను కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా ఆయన అంగీకరించారు.

నగరంలో గత ఏడాది నవంబరు 28న ప్రధానిమోదీ తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్టును 30 కి.మీ. పరిధిలో మియాపూర్‌, నాగోల్‌ మధ్యలో ప్రారంభించారు. తాజాగా 16 కిలోమీటర్ల మార్గం కలుపుకొని మొత్తంగా 46 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు ప్రయాణం హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

మాములుగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్‌కు బస్సులో ప్రయాణం చేయాలంటే దాదాపు రెండు గంటల దాకా పడుతుంది. 29 కిలోమీటర్ల ఈ దూరాన్ని మెట్రోలో కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. రద్దీ సమయాల్లోనూ ప్రతి మూడు నుంచి ఐదు నిమిషాలకొక రైలు అందుబాటులో ఉంటాయి. దీంతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ దాకా రోడ్డు మీద వాహనాల రద్దీ, ట్రాఫిక్ చిక్కులు గణనీయంగా తగ్గే అవకాశముంది.