ఎన్డీ తివారి ఇక లేరు..

ఎన్డీ తివారి (93) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తివారి.. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా సేవలందించిన తివారీ.. జ్వరం, న్యుమోనియాతో పది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. వైద్యానికి ఆయన శరీరం సహకరించకపోవడంతో ఇవాళ సాయంత్రం కన్నుమూసినట్లు తెలుస్తుంది.

1925 అక్టోబర్‌ 18న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌జిల్లా బాలూటి గ్రామంలో జన్మించారు. రాజకీయాల్లోకి వచ్చాక 1967లో జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఆయన సేవలందించారు. ఇక 2007 ఆగస్టు 19న ఏపీ గవర్నర్‌గా నియమితులైన తివారి 2009 డిసెంబర్‌లో తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. తివారి మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటూ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉత్తరాఖండ్ సీఎంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.