ఒక్క మగాడు.. ఆసియా కప్‌లో బంగ్లా బోణీ


ఆసియా కప్‌లో సంచలనాల బంగ్లాదేశ్‌ ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 137 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లంక 124 పరుగులకే చేతులెత్తేసింది. బంగ్లా బౌలర్లలో మొర్తాజా 2, రహ్మాన్‌ 2, హసన్‌ 2, షకిబ్‌, రుబెల్‌, హుస్సైన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

కాగ బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరు చూస్తే.. చివరికి చేసిన స్కోరు అనూహ్యమే. ఫాస్ట్‌బౌలర్‌ లసిత్‌ మలింగ ధాటికి ఆరంభంలో ఆ జట్టు కుదేలైంది. అతను లిటన్‌ దాస్‌ (0), షకిబ్‌ (0)లను ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే పెవిలియన్‌ చేర్చాడు. తర్వాతి ఓవర్లో తమీమ్‌ గాయంతో మైదానాన్ని వీడాడు. దీంతో 3 పరుగులకే మూడు వికెట్లు పడ్డట్లయింది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో గొప్పగా పోరాడుతూ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (144).. యువ ఆటగాడు మహ్మద్‌ మిథున్‌ (63;) సహకారంతో బంగ్లాకు అనూహ్యమైన స్కోరు అందించాడు.