లార్డ్స్‌ టెస్టు: వరుణుడిదే ఆట

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్ట్‌కి వరుణుడు ఆటంకంగా మారాడు. వాతావరణంలో అనూహ్య మార్పులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. బుధవారం రాత్రి నుంచి లండన్‌ నగరంలో వర్షం కురుస్తుండటంతో ఈ రోజు ఉదయం టాస్‌ సైతం వేయలేదు. ఆటగాళ్లు కనీసం సాధన చేయలేకపోయారు. దీంతో తొలి రోజు తొలి సెషన్‌ వృథా అయింది. పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. ఆకాశం మేఘావృతమై ఉండటం, కనీసం గాలులు కూడా వీయకపోవడంతో వాతావరణం ఇంకా చల్లగానే ఉంది.

వర్షం కురవడంతో అర్ధగంట ముందే భోజన విరామం ప్రకటించారు. కాగా ఇంగ్లాండ్‌ ఇంతకుముందే 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. టీమిండియా తుది జట్టును ప్రకటించకున్నా జట్టులో రెండో స్పిన్నర్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్టు కోహ్లీ సూచనలు చేశాడు. ఐదు టెస్టులో సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), కుక్, జెన్నింగ్స్, పోప్, బెయిర్‌స్టో, బట్లర్, వోక్స్‌/అలీ, రషీద్, కరన్, బ్రాడ్, అండర్సన్‌.
తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, విజయ్, రాహుల్, రహానే, కార్తీక్, పాండ్యా, కుల్దీప్‌/జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ.