HHVM : ‘హరి హర వీరమల్లు’ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు : పవన్ కళ్యాణ్

Pawankalyan
HHVM : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 21(సోమవారం) సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “లక్షలాది మంది అభిమానుల మధ్య ఈ వేడుక జరగాలనుకున్నా.. వాతావరణ పరిస్థితుల వల్ల పరిమితంగా నిర్వహించాల్సి వచ్చింది. కానీ మీ క్షేమమే నాకు ముఖ్యమైందని ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. సినిమాల్లోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో, అలాగే రాజకీయాల్లోకి వచ్చి ఈశ్వర్ ఖండ్రే గారి లాంటి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన ఇక్కడికి వచ్చినందుకు కృతఙ్ఞతలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన కందుల దుర్గేష్ గారు, రఘురామకృష్ణ రాజు గారికి కూడా నా ధన్యవాదాలు.

• నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో అభిమానులు తప్ప
బీమ్లా నాయక్ చిత్రం విడుదల అయినప్పుడు అందరి సినిమాల టెక్కెట్లు రూ. 100ల్లో ఉంటే నా సినమా టిక్కెట్ రూ. 10, రూ. 15 ఉండేది. ఆ రోజు నేను ఒకటే చెప్పాను మనల్ని ఎవడ్రా ఆపేది అని. ఆ మాట డబ్బు కోసమో, రికార్డుల కోసమో చెప్పలేదు. ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం నిలబడ్డాం. నేను ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. నేను ఏమీ కోరుకోలేదు. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నాను అంటే కారణం అభిమానులే. పడి లేచి పడి లేచినా దానికి కారణం మీరే. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు. నా గుండెల్లో అభిమానులే ఉన్నారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

• వయసు పెరిగినా.. గుండెల్లో చేవ చావలేదు
నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. వయసు పెరిగింది కానీ, గుండెల్లో చేవ మాత్రం చావలేదు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఒక బంపర్ హిట్ కావాలని మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ఒక అభిమాని అడిగాడు. ఆ రోజు నా అభిమానుల కోసం ఒక హిట్ ఉంటే బాగుండు అని భగవంతుడిని కోరుకున్నాను. హరీష్ శంకర్ వల్ల అది తిరిగి వచ్చింది. ఆ సినిమా కూడా క్లిష్టమైన సమయంలోనే తీశా. అంతకు ముందు జానీ సినిమా ఫెయిల్ అయినా అభిమానులు నా వెంటే ఉన్నారు. చిత్ర పరిశ్రమలో అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఒకప్పుడు నా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాను. నేను చిత్ర పరిశ్రమలో హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వదిలేశా. నేను ఎప్పుడూ బంధాలకే ప్రాధాన్యత ఇచ్చాను. చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను.

• శ్రీ కీరవాణి గారి మ్యూజిక్ వీరమల్లుకి బలం
కొత్త కథలు చేసే అవకాశం ఉన్నా, అది పోతే అందరం ఇబ్బంది పడతాం. పార్టీ నడపాలి, కుటుంబాన్ని పోషించాలి. అందుకే రీమేక్ లకు ప్రాధాన్యత ఇచ్చా. ఎప్పటికైనా మంచి సినిమాలు చేయాలని కోరుకున్నా. ఆ సమయంలో శ్రీ ఎ.ఎం. రత్నం గారి ద్వారా వచ్చింది.. శ్రీ క్రిష్ జాగర్లమూడి ద్వారా వచ్చింది. ఆయనకు కరతాళ ధ్వనుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ చిత్రం మీద రెండు సార్లు కరోనా ప్రభావం పడింది. సినిమా ముందుకు వెళ్తుందా లేదా అన్న నిరుత్సాహం నాలో వచ్చినప్పుడల్లా శ్రీ కీరవాణి గారు సంగీతం తిరిగి ఉత్సాహం నింపేది. ఈ సినిమా పట్ల నిరుత్సాహం వచ్చినప్పుడల్లా శ్రీ కీరవాణి గారి సంగీతం ఆత్మవిశ్వాసం నిలిపింది. శ్రీ కీరవాణి మ్యూజిక్ లేకపోతే హరి హర వీరమల్లు లేదు. వాళ్ల నాన్న గారిని కోల్పోయిన సమయంలో కూడా బ్యాగ్రౌండ్స్ ఇచ్చారు. శ్రీ జ్యోతి కృష్ణ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. తండ్రి కొడుకుల తాలూకు ఎఫర్ట్ ఈ సినిమా. సినిమాని రికార్డు బ్రేకింగ్ స్థాయిలో పూర్తి చేశామంటే ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి శ్రీ మనోజ్ పరమహంస. పాలనా వ్యవహారాల మధ్య రోజుకి రెండు గంటలు సమయం ఇస్తే నా సన్నిహితుని స్థలంలో సెట్ వేసి పూర్తి చేశాం. ఈ చిత్రాన్ని గత నెల రోజులుగా జనంలో ఉండేలా ప్రచారం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ భుజాన వేసుకుని తిరిగారు. ఆమెని చూశాకే నాకు ప్రెస్ మీట్లలో పాల్గొనాలనిపించింది. శ్రీ బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో జీవించారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

• ‘హరి హర వీరమల్లు’ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు
ఈ రోజు మీ కోరిక మేరకు టిక్కెట్ రేట్స్ పెరిగి మన ప్రభుత్వంలో మన సినిమా విడుదల అవుతోంది. హరిహర వీరమల్లు చాలా ఆసక్తికరమైన కథ. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. భారత దేశం ఎప్పుడూ ఎవరిపైనా దాడి చేయలేదు. ఆక్రమణ చేయలదు. మన దేశం పైనే అంతా దాడి చేశారు. మన పుస్తకాల్లో మోఘల్ తాలూకు గొప్పదనాన్ని చెప్పారు తప్ప, వారి అరాచకాల గురించి చెప్పలేదు. అక్బర్, షాజహాన్, ఔరంగజేబుల గురించి గొప్పలు చెప్పారు. ఔరంగజేబు చేసిన దుర్మార్గాలు చెప్పలేదు. సొంత తమ్ముడిన చంపేసిన వ్యక్తి ఔరంగజేబు. విజయనగరం సామ్రాజ్యం గొప్పతనం గురించి చెప్పలేదు. అప్పట్లో హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో చత్రపతి శివాజీ ధైర్యంగా పోరాటం చేశారు. అలా ధర్మం కోసం పోరాటం చేసిన ఒక కల్పిత పాత్ర హరిహర వీరమల్లు. ఆంధ్రప్రదేశ్ లోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాంల ద్వారా మొఘలులకి చేరింది. అలా అలా చేతులు మారుతూ లండన్ మ్యూజియంకి చేరింది. క్రిష్ చెప్పిన కథ కోసం నా శక్తినంతా పెట్టాను. ఈ చిత్రంలో మీ కోసం రెండు స్టెప్పులు కూడా వేశాను. రాజకీయాల్లోకి వచ్చాక రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కొన్నా, ఇప్పుడు సినిమాల్లో చేయడానికి మాత్రం కష్టపడ్డాను. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తిరిగి సాధన చేశాను. చిత్రం క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించాను. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు. మీరంతా కోరుకునే సక్సెస్ నే నేనూ కోరుకుంటున్నా. సినిమా మీకు నచ్చితే బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి. మీరే నా బలం. మీ కోసమే ఈ గుండె కొట్టుకుంటుంది. మీ కష్టం తీర్చేందుకు కొట్టుకుంటుంది” అన్నారు.