
Malavika Mohanan: సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకెళ్తున్న గ్లామరస్ బ్యూటీ మాళవిక మోహనన్, సహనటుల ప్రాధాన్యతపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవలే ‘సర్దార్ 2’తో పలకరించిన ఈ ముద్దుగుమ్మ, త్వరలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ‘పాకెట్ నోవెల్’ చిత్రంతో వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అనుభవాలను నెమరువేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె పెట్టిన ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సినీ ప్రియుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. సినిమా అంటే కేవలం కెమెరా ముందు నటన మాత్రమే కాదని, ఎవరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నామనే అంశమే ఒక ప్రాజెక్ట్‌ను మరింత ప్రత్యేకం చేస్తుందని మాళవిక పేర్కొన్నారు. “కొన్ని సినిమాలు తీస్తున్నప్పుడు అవి కేవలం షూటింగ్‌లా కాకుండా మన చుట్టూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. అలాంటి ఒక అందమైన అనుభవమే ‘పాకెట్ నోవెల్’. ఈ సినిమాలో భాగమైనందుకు నాకెంతో గర్వంగా ఉంది” అని ఆమె రాసుకొచ్చారు.
నెలల తరబడి ప్రతిరోజూ గంటల కొద్దీ కలిసి ప్రయాణించడం వల్ల చిత్రబృందంతో ఏర్పడే అనుబంధం ఒక సరికొత్త కుటుంబాన్ని తలపిస్తుందని మాళవిక చెప్పారు. ముఖ్యంగా వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి పని చేయడం తన కెరీర్లోనే మరచిపోలేని మైలురాయి అని కొనియాడారు. “విజయ్ సేతుపతి గారితో కలిసి నటించడం ఒక గొప్ప వరం. ఆయనతో కాకుండా ఈ ప్రయాణాన్ని వేరే ఎవరితోనూ కలలో కూడా ఊహించుకోలేను” అంటూ ఆయనపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్ సేతుపతి, మాళవిక కాంబోలో రానున్న ఈ ‘పాకెట్ నోవెల్’ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.














