Sai Dharam Tej: సాయి తేజ్ ‘సంబరాల ఏటు గట్టు’ కంప్లీట్!

Sai Durgha Tej

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటు గట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై మొదటి నుంచీ పరిశ్రమ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. నిజానికి ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం రకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందంటూ సాయి తేజ్ స్వయంగా ఓ అదిరిపోయే వీడియోను పంచుకుని మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే కిక్కిచ్చాడు.

సినిమా పూర్తయిన విషయాన్ని వెల్లడిస్తూ సాయి తేజ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా 160 రోజుల పాటు, 10 భారీ షెడ్యూల్స్‌లో ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ వీడియోలో కనిపించిన భారీ సెట్టింగులు, ఆ కాలం నాటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆయుధాలు, ఇతర సరంజామా చూస్తుంటే వెండితెరపై దర్శకుడు ఎలాంటి విజువల్ వండర్‌ను ఆవిష్కరించబోతున్నాడో అర్థమవుతోంది. సాయి తేజ్ ఈ ప్రాజెక్ట్ కోసం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

‘హను-మాన్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ లాంఛనంగా ముగియడంతో, ముందే ప్లాన్ చేసుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోనే దించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగ రేసులో సాయి తేజ్ తన ‘సంబరాల ఏటు గట్టు’తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.