
Thaman: విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అత్యంత వైభవంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. తమన్ మాట్లాడిన మాటలు, త్రివిక్రమ్‌పై ఆయన చూపించిన విపరీతమైన ప్రేమ, కృతజ్ఞత ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వేదికపై తన గురువు, మార్గదర్శి అయిన త్రివిక్రమ్‌ను ఉద్దేశించి “మీకోసం ముందడుగు వేసి తూటాలు (బుల్లెట్లు) ఎదుర్కోవడానికైనా మేము సిద్ధం” అంటూ తమన్ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.
తన కెరీర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతటిదో వివరిస్తూ తమన్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. జీవితంలో ఎవరో ఒకరి మాట కచ్చితంగా వినాలని, తన జీవితంలో తాను వినే ఏకైక వ్యక్తి త్రివిక్రమ్ మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. “అతడు సినిమాకు మణిశర్మ గారి దగ్గర ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే త్రివిక్రమ్ గారిని కలిశాను. అప్పుడే ఆయన బ్లాక్ కాఫీ తాగుతూ పుస్తకాలు చదువుతూ అందరికంటే పదేళ్లు ముందు ఆలోచించేవారు. నా జీవితాన్ని మళ్లీ తిరగరాసింది ఆయనే. ఒక్కోసారి నా బ్రెయిన్ నూడుల్స్‌లా చిక్కుకుపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే.. దాన్ని క్లియర్‌గా ఒక ఫ్రైడ్ రైస్ లా చేసి పంపిస్తారు. ‘అరవింద సమేత’ కంటే ముందు, ఆ తర్వాత నా కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ఆయన లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను” అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రత్యేకతలను వివరిస్తూ.. ఇది కేవలం పాటల కోసం తీసిన సినిమా కాదని, గుండెల్ని హత్తుకునే బలమైన సంభాషణలు ఉన్న “మాటల సినిమా” అని తమన్ స్పష్టం చేశారు. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో అంటే తనకెంతో ఇష్టమని, ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం సరికొత్త జానర్లను ట్రై చేశామని చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడే సినిమా సక్సెస్ ఏంటో తమకు అర్థమైపోయిందని, రేపు రిలీజ్ కాబోయే జూక్ బాక్స్‌లో మరో ఏడు ట్రాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని వెల్లడించారు.
సినిమా రీ-రికార్డింగ్ సమయంలో విక్టరీ వెంకటేష్ ఇచ్చిన ఎనర్జీని కూడా తమన్ గుర్తు చేసుకున్నారు. దాదాపు ఎనిమిది రీల్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసే ప్రతి రోజూ వెంకటేష్ స్వయంగా స్టూడియోకి వచ్చి తమతోనే కూర్చున్నారని చెప్పారు. “వెంకటేష్ గారు స్టూడియోలోకి వస్తే వచ్చే పాజిటివ్ ఎనర్జీ వేరు. జీవితంలో మనల్ని వెనకనుంచి ముందుకు తోసే ఒక పుష్ కావాలి.. వెంకీ గారు ఎప్పుడూ నన్ను అలా మోటివేట్ చేస్తూనే ఉంటారు” అని తమన్ చెప్పుకొచ్చారు. నిర్మాత చినబాబు (రాధాకృష్ణ) ఇచ్చిన బడ్జెట్ ఫ్రీడమ్, సుమ యాంకరింగ్ వల్ల వచ్చిన జోష్‌ను ప్రస్తావిస్తూ.. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొట్టి తమ కాంబినేషన్లో మరో హ్యాట్రిక్‌ను పూర్తి చేస్తుందని తమన్ ధీమా వ్యక్తం చేశారు.














