Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాకు హాలీవుడ్ టచ్.. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ రేంజ్ మారిపోయిందా?

Rishab Shetty

Rishab Shetty: ‘కాంతార’తో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ సింగ్ డైరెక్షన్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ సినీ అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టంట్ నిపుణులు పని చేయనున్నట్లు తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

తాజా వివరాల ప్రకారం.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, ‘వైకింగ్స్’, ‘ది విచర్’, ‘గ్రావిటీ’, ‘ఫాస్ట్ & ఫ్యూరియస్’ వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలు, వెబ్ సిరీస్‌లకు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుందట. దీంతో సినిమాలోని యుద్ధ సన్నివేశాలను అత్యంత భారీ స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని కీలక ఘట్టాలను అత్యంత వైభవంగా, భారీ యుద్ధ సన్నివేశాలతో వెండితెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్‌లు, ప్రొడక్షన్ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందించనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్ టీమ్ ఈ సినిమాలో భాగం అవుతుందని ప్రచారం జరుగుతుండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అయితే చిత్ర బృందం నుంచి ఈ వివరాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలోనే ఈ విషయాలకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.