
Mythri Ravi: విజయ్ దేవరకొండ కెరీర్లో ‘రణబాలి’ ఎందుకు ప్రత్యేకమైన సినిమా కాబోతోందో చెప్పడానికి ఆయన పడిన శ్రమే నిదర్శనం అన్నారు నిర్మాత మైత్రీ రవిశంకర్. రాయలసీమ యోధుడి పాత్రలో సహజంగా కనిపించేందుకు విజయ్ ఏకంగా 100 రోజుల పాటు గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాదు.. పాత్రకు తగ్గట్టుగా యాస, బాడీ లాంగ్వేజ్, లుక్ విషయంలోనూ ఎంతో కష్టపడ్డారని ఆయన తెలిపారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మాట్లాడిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్.. ఈ చిత్రానికి విజయ్ పెట్టిన ఎఫర్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘రణబాలి’లో విజయ్ పోషిస్తున్న సింగనమల బొబ్బిలి పాత్రకు గుర్రపు స్వారీ కీలకంగా ఉండటంతో.. షూటింగ్‌కు ముందే ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారని రవిశంకర్ తెలిపారు. దాదాపు 100 రోజుల పాటు గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేశారని చెప్పారు. కేవలం గుర్రంపై కూర్చోవడం మాత్రమే కాకుండా.. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించేందుకు విజయ్ ఈ శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ కథ కావడంతో పాత్రలో కనిపించే ప్రతి అంశం సహజంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ స్థాయిలో సిద్ధమైనట్లు నిర్మాత వెల్లడించారు.
సింగనమల బొబ్బిలి రాయలసీమ నేపథ్యానికి చెందిన యోధుడు కావడంతో.. విజయ్ తన మాట తీరు, యాసను కూడా పూర్తిగా మార్చుకున్నారని రవిశంకర్ చెప్పారు. పాత్రకు సరిపోయే బాడీ లాంగ్వేజ్‌ను అలవర్చుకోవడంతో పాటు లుక్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ట్రైలర్లో విజయ్ కనిపిస్తున్న తీరు చూస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాయలసీమ యాసలో ఆయన పలికిన డైలాగ్స్, గుర్రపు స్వారీ, యాక్షన్ సన్నివేశాలు పాత్ర కోసం చేసిన ప్రిపరేషన్‌ను బయటపెడుతున్నాయి. ‘రణబాలి’ కోసం విజయ్ మాత్రమే కాదు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కూడా భారీగా శ్రమించారని రవిశంకర్ తెలిపారు. ఈ కథపై దాదాపు రెండేళ్ల పాటు రీసెర్చ్ చేస్తూ ఆఫీస్‌కే పరిమితమై పనిచేశారని చెప్పారు. చరిత్రలో మరుగునపడిపోయిన ఓ యోధుడి కథను తెరపైకి తీసుకురావడంతో పాటు.. ఆ కాలం నాటి పరిస్థితులను ప్రేక్షకులకు అనుభూతి కలిగించేలా చూపించేందుకు దర్శకుడు ఎంతో కష్టపడ్డారని నిర్మాత పేర్కొన్నారు. సినిమా రిలీజ్‌కి ముందే సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ ప్రచారంపై కూడా రవిశంకర్ స్పందించారు. సినిమా చూడకముందే తీర్పులు ఇవ్వడం సరికాదని.. ఒక నటుడు, దర్శకుడు సినిమా కోసం ఎంత కష్టపడ్డారో కూడా చూడాలని కోరారు. ముఖ్యంగా విజయ్ ఈ పాత్ర కోసం చేసిన శ్రమను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు నచ్చకపోతే తమ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పులేదని.. కానీ ముందే నెగెటివ్ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అజయ్-అతుల్ సంగీతం అందించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.














