Nagarjuna: నాగార్జున మాట గుర్తుందా? సినిమా మేకింగ్‌పై ఇండస్ట్రీలో కొత్త చర్చ!

Nagarjuna

Nagarjuna: సినిమా అంటే కేవలం కథ, నటీనటులు, భారీ బడ్జెట్ మాత్రమే కాదు.. దాన్ని సరైన సమయంలో, సరైన విధానంలో పూర్తి చేయడం కూడా అంతే కీలకం. ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాల మేకింగ్ విధానంపై ఇదే అంశం చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా షూటింగ్ పూర్తయ్యే సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం లేకపోవడం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల లెనిన్ సినిమా ఈవెంట్‌లో అక్కినేని నాగార్జున సినిమాల మేకింగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. గతంలో సినిమా రిలీజ్‌కు నెల రోజుల ముందే ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. షూటింగ్‌ను ఎక్కువగా ఆలస్యం చేసి, చివర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తక్కువ సమయం కేటాయించడం వల్ల సినిమా ఔట్‌పుట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు.

అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా సినిమాల షూటింగ్స్ ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. పర్ఫెక్షన్, రీషూట్స్, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి కారణాలతో షూటింగ్ షెడ్యూల్స్ పొడిగిపోతున్నాయి. దీంతో సినిమా రిలీజ్‌కి కొన్ని వారాలు మాత్రమే ఉన్న సమయంలో డబ్బింగ్, ఎడిటింగ్, డీఐ, వీఎఫ్‌ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావుడిగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సినిమాను మరింత పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో షూటింగ్ సమయాన్ని పెంచడం ఒక కోణంలో సరైనదే అయినా.. దాని ప్రభావం చివర్లో పోస్ట్ ప్రొడక్షన్‌పై పడితే అసలు సమస్య అక్కడే స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే సినిమా లాస్ట్ స్టేజ్‌లో జరిగే ఎడిటింగ్, సౌండ్, కలర్, వీఎఫ్‌ఎక్స్ వంటి పనులు కూడా తుది ఔట్‌పుట్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ నేపథ్యంలో నాగార్జున చెప్పిన విధానం మరోసారి ప్రస్తావనకు వస్తోంది. షూటింగ్‌ను ముందుగానే పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కు తగినంత సమయం ఇస్తే సినిమా ఔట్‌పుట్‌ను మరింత మెరుగ్గా తీసుకురావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి మారుతున్న సినిమా మేకింగ్ విధానంలో ఈ అంశంపై దర్శకులు, నిర్మాతలు ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? భారీ సినిమాలకు కూడా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌కు సమయం కేటాయించే విధానం ఎప్పుడు పెరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.