Ravi Teja : హీరో రవితేజ కుటుంబంలో విషాదం.. తండ్రి రాజగోపాల్ రాజు మృతి

Raviteja
Ravi Teja : టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో రవితేజ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. ఫార్మసిస్టుగా పనిచేసిన రాజగోపాల్ గతంలో తన కుటుంబంతో కలిసి ఢిల్లీ, బొంబాయి, జైపూర్ వంటి నగరాల్లో నివసించారు. రవితేజ కూడా సినిమాల్లోకి రాకముందు తండ్రితో పాటు ఉత్తర భారతదేశంలో గడిపారు. రాజుగారికి ముగ్గురు కుమారులు రవితేజ, భరత్, రఘు.. కాగా, భరత్ 2017లో కారు ప్రమాదంలో మృతిచెందాడు. రఘు నటుడిగా సినిమాల్లో కొనసాగుతున్నారు.

రాజగోపాల్ రాజు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం వ్యక్తం చేస్తూ, “సోదరుడు రవి తేజ నాన్నగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. అయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లోకలిశాను. చాలా సరదాగా హుషారుగా మాట్లాడేవారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఇక రవితేజ అభిమానులు, సహచరులు కూడా ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.