The Paradise Second Single: ఇలాంటి సాంగ్ లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు.. ‘ది ప్యారడైజ్’తో కొత్త ట్రెండ్!

The Paradise Second Single

The Paradise Second Single: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో మూవీపై భారీ హైప్ నెలకొంది. తాజాగా సెకండ్ సింగిల్‌కు సంబంధించి మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా సినిమా పాటలను ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించి విడుదల చేస్తుంటారు. కానీ ‘ది ప్యారడైజ్’ టీమ్ మాత్రం సెకండ్ సింగిల్ విషయంలో సరికొత్త ప్లాన్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్ వేదికగా ఈ పాటను ఆవిష్కరించనున్నారు. ఆగస్టు 28న అమెరికాలోని డల్లాస్‌లో జరగనున్న అనిరుధ్ కాన్సర్ట్‌లో ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ను ప్రేక్షకుల సమక్షంలో లైవ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం నాని ఇప్పటికే డల్లాస్ చేరుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

లైవ్ కాన్సర్ట్‌లో సెకండ్ సింగిల్‌ను విడుదల చేసిన అనంతరం.. మరుసటి రోజే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పాటను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు మంచి స్పందన లభించింది. తాజాగా అనిరుధ్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ కలిసి ఉన్న ఫొటోను మేకర్స్ షేర్ చేయడంతో సెకండ్ సింగిల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఇక ‘ది ప్యారడైజ్’లో నాని సరసన కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. డల్లాస్‌లో లైవ్ కాన్సర్ట్ వేదికగా విడుదల కానున్న సెకండ్ సింగిల్ ఎలాంటి మోత మోగిస్తుందో చూడాలి.