పాక్ సైనికుల పైశాచికత్వం

indian-troopపాకిస్థాన్ సైన్యం మరోసారి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంది. సరిహద్దులు దాటి రావడమే కాక ఇద్దరు జవాన్లను హతమార్చడంతో పాటు అత్యంత కిరాతకంగా వారి తలలను వేరు చేసింది. ఓ సైనికుడి తలను వెంట తీసుకెళ్లిపోయిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘూటి నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఉదయం పొగమంచు కమ్మేసిన వేళ పాక్ సైనికులు దొంగచాటుగా చొరబడి గస్తీ బృందంపై దాడి చేశారు. లాన్స్ నాయక్ లు హేమ్ రాజ్, సుధాకర్ సింగ్ లను హతమార్చడంతో పాటు మరో ఇద్దరిని గాయపరచి వారి ఆయుధాలను కూడా తీసుకెళ్ళారు. ఈ దురాగతాన్ని భారతసైన్యం ధృవీకరించింది కాని తలల నరికివేతపై వివరాలు వెల్లడించలేదు.

ఉత్తర కమాండర్ లెఫ్ట్ నెంట్ జనరల్ కేటీ పర్నాయక్ ఘటనాస్థలిని సందర్శించారని, ఓ మృతదేహం ముక్కలు చేసి ఉన్నట్లు నిర్ధారించారని పేర్కొంది. సైనాధిపతి జనరల్ బిక్రంసింగ్.. పర్నాయక్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారత్-పాక్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నామని సరిహద్దు భద్రతా దళం (బీఎన్ ఎఫ్) ప్రకటించింది. “పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్నిగౌరవిస్తుందిని భావిస్తున్నాం” అని రక్షణ శాఖ మంగళవారం అర్థరాత్రి ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, భారత సైనికులపై ఎలాంటి దాడి చేయలేదని మంగళవారం పాక్ సైన్యం పేర్కొంది. భారత సైన్యం ప్రపంచ దృష్టిని మరల్చడానికే ఈ ఆరోపణలుచేస్తోందని విమర్శించింది.