అయోధ్య విరాళాల్లో 22 కోట్ల విలువ గల చెక్కులు బౌన్స్

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. అయితే, విరాళాల నిమిత్తం భక్తులు ఇచ్చిన చెక్కుల్లో దాదాపు 15వేలకు పైగా చెక్కులు బౌన్స్‌ అయినట్టు వెల్లడైంది. వీటి విలువ సుమారు రూ.22 కోట్లకు పైనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆడిట్‌ నివేదికలో తేలింది. చెక్కులు ఇచ్చిన వారి ఖాతాల్లో తగిన నిల్వలు లేకపోవడంతో పాటు సంతకాలు సరిపోలకపోవడం వల్ల చెక్కులు బౌన్స్‌ అయినట్టు తెల్పింది. ఓవర్‌ రైటింగ్‌ వంటి సాంకేతిక సమస్యల కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైందని ట్రస్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నామని ట్రస్టు సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా తెలిపారు.