నేటి నుంచే ఐపీఎల్‌ మహాసంగ్రామం.. తొలిపోరుకు సిద్దమైన గుజ‌రాత్ టైటాన్స్-చెన్నై సూప‌ర్ కింగ్స్‌


క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. మండుటెండల్లో వారిని పరుగుల జడివానలో ముంచేందుకు ఐపీఎల్‌ సిద్ధమైంది. నేటినుంచే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్ ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో స్టేడియంలో అన్ని జట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. గాయం కారణంగా రోహిత్ ట్రోఫీతో కెప్టెన్ల కార్యక్రమంలో పాల్గొనలేదని సమాచారం. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ స్థానంలో భువనేశ్వర్ పాల్గొన్నాడు.

ఇకపోతే శుక్రవారం అంటే మార్చి 31న ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడనున్నాయి. దీనికి గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. అయితే 10 జట్ల మధ్య మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, ఆ తర్వాత ప్లేఆఫ్స్‌ జరుగుతాయి. ప్లేఆఫ్స్‌ తర్వాత ఐపీఎల్ 2023 ఫైనల్ జరుగుతుంది.

ఇక గతేడాది అరంగేట్రం చేసిన గుజ‌రాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ జట్టుకు దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ సారథ్యం వహించనున్నాడు.