ఇంటిపనికి జీతం ఇవ్వాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు


ఇప్పటివరకు భర్త నుండి విడాకులు తీసుకున్న మహిళలకు భరణం మాత్రమే ఇచ్చేవారు. కానీ ఆ మహిళ అంతకాలం చేసిన ఇంటిపనికి కూడా వేతనం క్లెయిమ్ చేసుకోవచ్చని ఇటీవలే స్పెయిన్ కు చెందిన కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే స్పెయిన్ కు చెందిన ఇవానా మోరల్‌ అనే మహిళ తన వివాహ జీవితంలో వచ్చిన విభేదాలతో 2020లో భర్త నుంచి విడాకులు పొందింది. ఇక మా వివాహ బంధం ముగిసిన రోజున నా చేతుల్లో ఏమీ లేదు. అన్నేళ్లు కేవలం ఇంటిపనులకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకాలం నా భాగస్వామికి అన్ని పనుల్లో సహకరించాను. కానీ ఆర్థిక విషయాలను మాత్రం నాకు తెలియనిచ్చేవారు కాదు. అన్నీ ఆయన పేరు మీదే ఉన్నాయి. నాకు ఇద్దరు కుమార్తెలు అని ఆమె వెల్లడించారు. ఇక విడాకులు ఇచ్చిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కీలక తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల పాటు ఆమె చేసిన ఇంటిపనికి లెక్కకట్టింది. వార్షిక కనీస వేతనం ఆధారంగా ఆమెకు ఇంటిపనికి రూ.1.75 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అలాగే నెలవారీగా ఆమెకు భరణం, పిల్లల పోషణ కోసం డబ్బులు ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఇక ఈ తీర్పుపై మోరల్‌ హర్షం వ్యక్తం చేశారు.