‘శరవణ’ శకం ముగిసింది…రాజగోపాల్ కన్నుమూత…!

శరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో చెన్నై అసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్‌ కొద్దిసేపటిక్రితం మరణించారు. తన హోటల్ లో మహిళా ఉద్యోగిని లైంగికంగా వేదించి ఆమె భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలడంతో జులై8న కోర్టు జీవిత ఖైదు విదించింది. ఈ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడం, గుండెపోటువచ్చి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనారోగ్యంతో ఉన్న కారణంగా జైలుకు వెళ్లేందుకు తనకు మరికొంత సమయం కావాలంటూ రాజగోపాల్‌ చేసుకున్న అభ్యర్థనను గత 8న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘శరవణ భవన్‌’ హోటళ్లను స్థాపించిన రాజగోపాల్‌ శకం చివరికి హత్య కేసులో దోషిగా ముగిసింది. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్‌ జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవాడు. 2001లో ఓ జ్యోతిష్యుడి మాటను నమ్మిన రాజగోపాల్, తన దగ్గర పనిచేస్తున్న శాంతకుమార్‌ అనే ఉద్యోగి భార్యను మూడో పెళ్లి చేసుకునేందుకు శాంతకుమార్‌ను అంతమొందించాడు. ఈ కేసులో 2004లో కింది కోర్టు ఆయనతోపాటు మరో 8 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, వారంతా హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవడంతో మద్రాసు హైకోర్టు 2009లో శిక్షను పదేళ్ల నుంచి యావజ్జీవానికి పెంచింది. మద్రాసు హైకోర్టు వేసిన శిక్షను ఇటీవలే సుప్రీంకోర్టు సమర్థించింది.