లంక కధ ముగిసింది


క్రికెట్‌ కూనల దెబ్బకు శ్రీలంక తలవంచింది. ఆసియా కప్‌లో మాజీ ఛాంపియన్‌ శ్రీలంక కథ ముగిసింది. టోర్నీ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన లంక.. రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు తలవంచింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన వేళ ఆ జట్టు సోమవారం అఫ్గానిస్థాన్‌ చేతిలో 91 పరుగుల తేడాతో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. అఫ్గాన్‌ స్పిన్నర్ల ధాటికి 41.2 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.

250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు రెండో బంతి నుంచే కష్టాలు మొదలయ్యాయి. కుశాల్‌ మెండిస్‌ (0)ను ముజీబ్‌ డకౌట్‌ చేశాడు. తర్వాత తరంగ (36; 3 ఫోర్లు), డిసిల్వా (23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా… అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్‌ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. అఫ్గానిస్థాన్‌ ఆటగాడు రహ్మత్‌ షా (72; 5 ఫోర్లు) రాణించాడు. తిసారా పెరీరా 5 వికెట్లు తీశాడు.చెరో విజయంతో గ్రూప్‌ ‘బి’ నుంచి బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ సూపర్‌–4 దశకు అర్హత సాధించాయి.