తెలుగు భాషను కాపాడండి : తనికెళ్ళ భరణి

Tanikella-bharaniఆదివారం ఢిల్లీలో ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘కొన్ని గణాంకాల్లో చచ్చిపోతున్న భాషల్లో తెలుగు ఒకటని పేర్కొంటున్నారు. అది బాధాకరం. పొట్టపోసుకోవడానికి ఆంగ్లం తప్పనిసరి. అదేవిధంగా అందరిపైనా మాతృభాషను, మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇందుకు ప్రతి ఇంటి నుంచి కృషి జరగాలి’ అని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ తెలుగు భాషపై మమకారం ప్రవాసాంధ్రుల్లోనే ఎక్కువగా ఉంటోందన్నారు. ఢిల్లీలోనూ తెలుగువారు మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుండటం ఆనందంగా ఉందని… వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే వీరిని చూసి నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సన్నివేశాలను వివరిస్తూ ప్రేక్షకులను నవ్వించారు. సంప్రదాయాలను గౌరవిస్తే అనుబంధాలు తెలుస్తాయని…అప్పుడే ఇక్కడి వైద్యవిద్యార్థిని (నిర్భయ)పై జరిగిన సామూహిక అత్యాచారం వంటి అకృత్యాలు తగ్గుతాయన్నారు. ఢిల్లీలో తెలుగు వారి కోసం సేవలందిస్తున్న ఏఈఎస్ నిర్వాహకులను అభినందించారు.