వన్డే వరల్డ్‌కప్‌ నుంచి వెస్టిండీస్‌ ఔట్..


జింబాబ్వేలో జరుగుతున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్ దశలో స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్.. భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఘోరంగా విఫలమైంది. ఇది నిజంగా క్రికెట్ ప్ర‌పంచం ఉలక్కిప‌డే ఘ‌ట‌న. 1975, 1979 సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ పోటీల్లో విజేతగా నిలిచిన వెస్ట్ ఇండీస్ జట్టు ఇప్పుడు పేలవ ప్రదర్శనతో పతనావస్థకు చేరుకుంది. అంతేకాదు ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా వెస్టిండీస్ లేకుండా టోర్నీ జరగనుంది.

ఇకపోతే ఈరోజు జరిగిన క్వాలిఫ‌యింగ్ మ్యాచ్‌లో విండీస్ జ‌ట్టు 181 ప‌రుగులు చేయ‌గా.. మ‌రో 6.3 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే స్కాట్లాండ్ టార్గెట్ రీచ్ అయింది. వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. దీంతో ప్రపంచకప్‌కు చేరుకోకముందే తన ప్రయాణాన్ని ముగించింది. కాగా ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న‌వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ పోటీల్లో మొత్తం 10 జ‌ట్లు పాల్గోనున్నాయి. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వ‌నుంది. తొలి మ్యాచ్ అక్టోబ‌ర్ 5న ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.