ఐపీల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ..


ఐపీఎల్ లో ఈరోజు కోల్‌క‌తా నైట్ రైడర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఐపీల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. కేవలం 13 బంతుల్లోనే(7 ఫోర్లు, 3 సిక్స్ లతో) హాఫ్ సెంచరీ చేయడం విశేషం. గతంలో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. పవర్ ప్లేలో దూసుకెళ్లింది. మొదటి బంతి నుంచే యశస్వి జైస్వాల్.. కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నితీశ్ రానా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లో వ‌రుస‌గా 6,6,4,4,2,4 బాదాడు. దాంతో, 26 ర‌న్స్ వ‌చ్చాయి. హ‌ర్షిత్ రానా వేసిన రెండో ఓవ‌ర్లోనూ జోరు కొన‌సాగించాడు. ఫోర్, సిక్స్ బాదాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 3వ‌ ఓవ‌ర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన య‌శ‌స్వీ సింగిల్ తీసి యాభై ర‌న్స్ సాధించాడు.

ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్(57) అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ నితీష్ రాణా(22), ఓపెనర్ రహ్మతుల్లా గుర్భాజ్(18) పరుగులు చేసారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో విజృంభించాడు. అలాగే ఆరంభంలోనే కోల్‌కతా ఓపెనర్లు ఇద్దరినీ కూడా ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ బాట పట్టించాడు. కేఎమ్ అసిఫ్, సందీప్ శర్మ కూడా చెరో వికెట్ తీసుకున్నారు.