Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘కూలీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా భాగమవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు వీరు ఎవరి పాత్రల్లో కనిపించబోతున్నారన్న విషయం మాత్రం చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు.
అంతేకాదు, ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్ రోల్స్‌లో కనిపించనుండగా, నాగార్జున మాత్రం నిడివి ఎక్కువగా ఉన్న కీలక పాత్రలో నటించనున్నారని తెలిసింది. లోకేష్ కనకరాజ్ స్పెషల్‌గా నాగార్జున కోసం మాత్రమే ఆ పాత్రను డిజైన్ చేశాడట. ఆయన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త బైటకు వచ్చింది. ఏ సినిమా అయినా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తుంటాయి. కానీ లోకేష్ మాత్రం ఈసారి డిఫరెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడట. ట్రైలర్, టీజర్ ఏమీ విడుదల చేయకుండా, డైరెక్ట్‌గా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.
ఇది రజినీకాంత్ సినిమా కాబట్టి ట్రైలర్ లేకపోయినా ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడతారని అతనికి నమ్మకం. ముఖ్యంగా, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ క్యాస్టింగ్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుందన్న విశ్వాసంతో, డైరెక్ట్ థియేటర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ ప్లాన్‌కు నిర్మాతల సమ్మతిని పొందేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ నిర్మాతలు ఓకే అంటే, ట్రైలర్, టీజర్ లేకుండా ‘కూలీ’ నేరుగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. ఇదే రోజున ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మొత్తానికి, రజినీకాంత్ వీరాభిమాని అయిన లోకేష్ ఈ సినిమాను సంప్రదాయాలను త్రికరణ శుద్ధిగా మార్చి, ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌గా తెరపైకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.













