
Singeetam Srinivasa Rao: భారతీయ చలనచిత్ర రంగానికి సరికొత్త వ్యాకరణం నేర్పిన ప్రయోగాల దిగ్గజం, విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వయసు పైబడేకొద్దీ విశ్రాంతి కోరుకోవడం సాధారణం. కానీ సింగీతం గారికి సినిమానే ఊపిరి. ఏకంగా 94 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో ‘సింగీతం’ అనే చిత్రాన్ని రూపొందించి తనలోని సృజనాత్మక ప్రతిభను మరోసారి చాటారు. నవతరం దర్శకులకు సైతం సాధ్యం కాని ఈ అరుదైన అంకితభావం సినీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం.
ఒకే బాణీకి కట్టుబడకుండా ప్రయోగాలు చేయడమే సింగీతం నైజం. మాటలు లేని మూకీ సినిమాతో ‘పుష్పక విమానం’ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించినా, ‘ఆదిత్య 369’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసినా, ‘భైరవద్వీపం’తో జానపద విస్మయాన్ని సృష్టించినా అది ఒక్క సింగీతం శ్రీనివాసరావుకే చెల్లింది. సైన్స్ ఫిక్షన్, జానపదం, హాస్యం, ప్రయోగాత్మక కథలు.. ఇలా ఏ జోనర్‌నైనా ఆయన చేతిలో క్లాసిక్‌గా మారాల్సిందే. సినిమా ఉన్నంతవరకు ఆయన ఆలోచనలు, ఆయన సృష్టించిన దృశ్య కావ్యాలు జీవించే ఉంటాయి. భౌతికంగా ఆయన దూరమైనా, భారతీయ చిత్రసీమ గుండెల్లో సింగీతం శ్రీనివాసరావు చిరస్మరణీయుడు.














